చుక్క నీరులేక వెలవెలబోతున్న బోరబండ రిజర్వాయర్
సాక్షి,గజ్వేల్: రెండున్నర దశాబ్ధాల కిందట తక్కువ ఖర్చుతో అద్భుతంగా నిర్మించిన బహుళ ప్రయోజన రిజర్వాయర్ ‘బోరబండ’పై నిర్లక్ష్యం అలుముకుంది. సాగునీటి కొరతతో తల్లడిల్లుతున్న రైతాంగానికి ఊరటనివ్వాల్సిన ఈ జలాశయం నీరులేక వెలవెలబోతోంది. నిర్మాణం పూర్తయి 29 ఏళ్లు గడుస్తున్నా నీరందించాల్సిన కాల్వలు ప్రవాహానికి నోచుకోవడం లేదు... జలాశయం నిండితే మరెన్నో చెరువులకు నీటిని పంపే అవకాశమున్నా ఆ దిశగా సంబంధిత యంత్రాంగం చొరవ చూపడంలేదు. మిషన్ కాకతీయ 2వ విడతలో రూ. 20లక్షలు మంజూరు చేసి నామమాత్రంగా కొన్ని పనులు చేపట్టి చేతులు దులుపుకున్నారు.
జగదేవ్‌పూర్ మండలంలోని పీర్లపల్లి–ధర్మారం గ్రామాల మధ్య 1990లో రూ.56 లక్షల వ్యయంతో బోరబండ రిజర్వాయర్‌ను నిర్మించారు. 115 ఎకరాల విస్తీర్ణంలో 36.80 మిలియన్ ఘనపుటడుగుల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ జలాశయం నిర్మాణమైంది. క్షామంతో తల్లడిల్లుతున్న జగదేవ్‌పూర్ మండలంలోని వివిధ గ్రామాలకు ఆరుతడి పంటలకు కాల్వల ద్వారా సాగునీటిని అందించడంతో పాటు గజ్వేల్ నియోజకవర్గంలో భూగర్భజలాల పెంపొందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. సాగునీటిని పొలాలకు అందించడం కోసం 2.6 కిలోమీటర్ల పొడవున కుడి, 1.94 కిలోమీటర్ల పొడవునా ఎడమ కాల్వల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రాజెక్టు పరిధిలో 832 ఎకరాల ఆయకట్టు భూములున్నాయి.
కుడికాల్వ ద్వారా ధర్మారం, వర్దరాజ్‌పూర్, ఇటిక్యాల,కొత్తపేట, పీర్లపల్లి గ్రామాల్లోని 568 ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందించడానికి, ఎడమ కాల్వ ద్వారా ధర్మారం, పీర్లపల్లిలోని మరికొంత భాగంలో వున్న 264 ఎకరాల ఆరుతడి పంటలకు సాగునీరు అందించడానికి ఏర్పాటు చేశారు. కానీ రిజర్వాయర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కాల్వలు ప్రవాహానికి నోచుకోలేదు. ఫలితంగా ఆయకట్టు భూముల రైతులకు నిరాశే మిగిలింది. వర్షాల వల్ల ప్రాజెక్టు నిండుతున్న సందర్భంలోనూ కాల్వల ద్వారా నీరందించేందుకు తూములను ఎత్తకపోవడంతో ప్రాజెక్టు వల్ల ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరలేదనే చెప్పాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి ప్రాజెక్ట్ నిర్మించాలంటే సుమారు రూ. 50కోట్లకుపైగానే ఖర్చవుతుందని చెబుతున్న ఇరిగేషన్ శాఖ అధికారులు 29 ఏళ్ల కిందట తక్కువ ఖర్చుతో అద్భుతంగా నిర్మించిన రిజర్వాయర్ అభివద్ధిపై నిర్లక్ష్యం వహించడంపై నిరసన వ్యక్తమవుతున్నది.
అరకొరగా అభివృద్ధి పనులు
సామూహిక చెరువుల యాజమాన్య పథకం కింద ‘బోరబండ’ రిజర్వాయర్ అభివద్ధికి 2008లో రూ. 84లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులను విడుదల చేయించుకోవడానికి ప్రణాళికలు తయారు చేసి సాంకేతిక అనుమతి పొందాల్సి ఉండగా దానిని పూర్తిచేయడంలో అధికారులు ఏళ్ల తరబడి నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఎన్నో ఏళ్ల జాప్యం తర్వాత ఆరేళ్ల క్రితం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు చేపట్టారు. శిథిలమైన కాల్వలను పటిష్టం చేయడం, తూముల మరమ్మతు, కట్టను పటిష్టం చేయడం తదితర పనులు వంటి పనులు అరకొరగా సాగాయి. ఎతైన ప్రదేశంలో ఉన్నా బోరబండ రిజర్వాయర్ నిండితే జగదేవ్‌పూర్ మండలంలోని పలు చెరువులకు ప్రవాహాపు నీటిని పంపే అవకాశముంది.
కానీ ఈ దిశగా కార్యాచరణ రూపొందించడంలో ఇరిగేషన్‌శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున పూడికతీయాల్సి ఉన్నది. ఈ ప్రాజెక్ట్‌కు మాత్రం అధికారులు ‘మిషన్ కాకతీయ’–2లో కేవలం రూ.20 లక్షలు కేటాయించి కాల్వల మరమ్మతు పేరిట నామమాత్రంగా పనులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. మరోవైపు చుట్టూ అటవీ ప్రాంతంలో ఉన్న ఈ రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలున్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. సాక్షాత్తూ ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలో నిధుల కేటాయింపునకు ఇబ్బందులు లేకున్నా నీటిపారుదల శాఖ అధికారులకు పట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
అనుసంధానానికి ప్రతిపాదనలు
బోరబండ రిజర్వాయర్ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. గజ్వేల్ నియోజకవర్గంలో పూర్తియిన కొండపోచమ్మసాగర్ నుంచి యాదాద్రి జిల్లా తుర్కపల్లికి కాల్వ ద్వారా చెరువులకు సాగునీటిని పంపే ప్రతిపాదనలున్నాయి. ఈ ప్రతిపాదనలు అమలులోకి వస్తే జలాశయానికి కొత్త కళ రానుంది. తుర్కపల్లి కాల్వ అనుసంధానంతో రిజర్వాయర్‌కు పూర్వ వైభవం వస్తుంది. ఎత్తయిన ప్రదేశంలో ఉన్న బోరబండ ద్వారా సమీపంలోని చెరువులను నింపే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. రైతులు ఆందోళన చెందొద్దు.
- పవన్, గజ్వేల్ నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈఈ
Comments
Please login to add a commentAdd a comment