jagdevpur
-
బోరుమన్న బోరబండ
సాక్షి,గజ్వేల్: రెండున్నర దశాబ్ధాల కిందట తక్కువ ఖర్చుతో అద్భుతంగా నిర్మించిన బహుళ ప్రయోజన రిజర్వాయర్ ‘బోరబండ’పై నిర్లక్ష్యం అలుముకుంది. సాగునీటి కొరతతో తల్లడిల్లుతున్న రైతాంగానికి ఊరటనివ్వాల్సిన ఈ జలాశయం నీరులేక వెలవెలబోతోంది. నిర్మాణం పూర్తయి 29 ఏళ్లు గడుస్తున్నా నీరందించాల్సిన కాల్వలు ప్రవాహానికి నోచుకోవడం లేదు... జలాశయం నిండితే మరెన్నో చెరువులకు నీటిని పంపే అవకాశమున్నా ఆ దిశగా సంబంధిత యంత్రాంగం చొరవ చూపడంలేదు. మిషన్ కాకతీయ 2వ విడతలో రూ. 20లక్షలు మంజూరు చేసి నామమాత్రంగా కొన్ని పనులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. జగదేవ్‌పూర్ మండలంలోని పీర్లపల్లి–ధర్మారం గ్రామాల మధ్య 1990లో రూ.56 లక్షల వ్యయంతో బోరబండ రిజర్వాయర్‌ను నిర్మించారు. 115 ఎకరాల విస్తీర్ణంలో 36.80 మిలియన్ ఘనపుటడుగుల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ జలాశయం నిర్మాణమైంది. క్షామంతో తల్లడిల్లుతున్న జగదేవ్‌పూర్ మండలంలోని వివిధ గ్రామాలకు ఆరుతడి పంటలకు కాల్వల ద్వారా సాగునీటిని అందించడంతో పాటు గజ్వేల్ నియోజకవర్గంలో భూగర్భజలాల పెంపొందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. సాగునీటిని పొలాలకు అందించడం కోసం 2.6 కిలోమీటర్ల పొడవున కుడి, 1.94 కిలోమీటర్ల పొడవునా ఎడమ కాల్వల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రాజెక్టు పరిధిలో 832 ఎకరాల ఆయకట్టు భూములున్నాయి. కుడికాల్వ ద్వారా ధర్మారం, వర్దరాజ్‌పూర్, ఇటిక్యాల,కొత్తపేట, పీర్లపల్లి గ్రామాల్లోని 568 ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందించడానికి, ఎడమ కాల్వ ద్వారా ధర్మారం, పీర్లపల్లిలోని మరికొంత భాగంలో వున్న 264 ఎకరాల ఆరుతడి పంటలకు సాగునీరు అందించడానికి ఏర్పాటు చేశారు. కానీ రిజర్వాయర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కాల్వలు ప్రవాహానికి నోచుకోలేదు. ఫలితంగా ఆయకట్టు భూముల రైతులకు నిరాశే మిగిలింది. వర్షాల వల్ల ప్రాజెక్టు నిండుతున్న సందర్భంలోనూ కాల్వల ద్వారా నీరందించేందుకు తూములను ఎత్తకపోవడంతో ప్రాజెక్టు వల్ల ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరలేదనే చెప్పాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి ప్రాజెక్ట్ నిర్మించాలంటే సుమారు రూ. 50కోట్లకుపైగానే ఖర్చవుతుందని చెబుతున్న ఇరిగేషన్ శాఖ అధికారులు 29 ఏళ్ల కిందట తక్కువ ఖర్చుతో అద్భుతంగా నిర్మించిన రిజర్వాయర్ అభివద్ధిపై నిర్లక్ష్యం వహించడంపై నిరసన వ్యక్తమవుతున్నది. అరకొరగా అభివృద్ధి పనులు సామూహిక చెరువుల యాజమాన్య పథకం కింద ‘బోరబండ’ రిజర్వాయర్ అభివద్ధికి 2008లో రూ. 84లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులను విడుదల చేయించుకోవడానికి ప్రణాళికలు తయారు చేసి సాంకేతిక అనుమతి పొందాల్సి ఉండగా దానిని పూర్తిచేయడంలో అధికారులు ఏళ్ల తరబడి నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఎన్నో ఏళ్ల జాప్యం తర్వాత ఆరేళ్ల క్రితం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు చేపట్టారు. శిథిలమైన కాల్వలను పటిష్టం చేయడం, తూముల మరమ్మతు, కట్టను పటిష్టం చేయడం తదితర పనులు వంటి పనులు అరకొరగా సాగాయి. ఎతైన ప్రదేశంలో ఉన్నా బోరబండ రిజర్వాయర్ నిండితే జగదేవ్‌పూర్ మండలంలోని పలు చెరువులకు ప్రవాహాపు నీటిని పంపే అవకాశముంది. కానీ ఈ దిశగా కార్యాచరణ రూపొందించడంలో ఇరిగేషన్‌శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున పూడికతీయాల్సి ఉన్నది. ఈ ప్రాజెక్ట్‌కు మాత్రం అధికారులు ‘మిషన్ కాకతీయ’–2లో కేవలం రూ.20 లక్షలు కేటాయించి కాల్వల మరమ్మతు పేరిట నామమాత్రంగా పనులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. మరోవైపు చుట్టూ అటవీ ప్రాంతంలో ఉన్న ఈ రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలున్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. సాక్షాత్తూ ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలో నిధుల కేటాయింపునకు ఇబ్బందులు లేకున్నా నీటిపారుదల శాఖ అధికారులకు పట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అనుసంధానానికి ప్రతిపాదనలు బోరబండ రిజర్వాయర్ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. గజ్వేల్ నియోజకవర్గంలో పూర్తియిన కొండపోచమ్మసాగర్ నుంచి యాదాద్రి జిల్లా తుర్కపల్లికి కాల్వ ద్వారా చెరువులకు సాగునీటిని పంపే ప్రతిపాదనలున్నాయి. ఈ ప్రతిపాదనలు అమలులోకి వస్తే జలాశయానికి కొత్త కళ రానుంది. తుర్కపల్లి కాల్వ అనుసంధానంతో రిజర్వాయర్‌కు పూర్వ వైభవం వస్తుంది. ఎత్తయిన ప్రదేశంలో ఉన్న బోరబండ ద్వారా సమీపంలోని చెరువులను నింపే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. రైతులు ఆందోళన చెందొద్దు. - పవన్, గజ్వేల్ నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈఈ -
పెళ్లి రోజే ‘లక్ష్మీ’ కటాక్షం
జగదేవ్‌పూర్(గజ్వేల్): అసెంబ్లీ సమావేశాల్లో కళ్యాణ లక్ష్మి పథకం కానుక రూ75 వేల నుంచి రూ.1,00,116 పెంచుతున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పెళ్లి రోజే చెక్కును అందిస్తామని చెప్పారు. పెంచింది ఆలస్యమే లేదు అమలు చేశారు. ముందుగా సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో బుధవారం జరిగినా పెళ్లిలో కళ్యాణలక్ష్మి చెక్కును ఆర్డీసీ చైర్మన్ నర్సారెడ్డి, గఢా అధికారి హన్మంతరావులు వ« దువు కుటుంబానికి అందించి లాంఛనం గా ప్రారంభించారు. ఎర్రవల్లి గ్రామానికి చెందిన చెవేళ్ల చంద్రయ్య, పోచమ్మ దంపతుల కూతురు అశ్వినికి ఇటీవల యాదాద్రి జిల్లా రాజాపేట మండలం పారుపల్లి గ్రామానికి చెందిన శేఖర్‌తో నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా వారు కల్యాణలక్ష్మి కి దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం స్వయంగా ఎర్రవల్లి ఫంక్షన్హాల్లో పెళ్లి జరుగుతున్న క్రమంలోనే గఢా అధికారి హన్మంతరావు, ఆర్డీసీ చైర్మన్ తూంకుంట నర్సారెడ్డిలు పెళ్లి హాజరై కళ్యాణ లక్ష్మి ప థకం మంజూరైన రూ.1,00,116 చెక్కు ను వధువు తల్లి పోచమ్మ పేరు మీద అం దించి లాంఛనంగా పథకాన్ని ప్రారంభిం చారు. దేశంలోనే నంబర్‌వన్.. పేదోళ్లను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చు ట్టారని, ఇటివల్లనే రూ.75 వేల నుంచి రూ.1,00,116 పెంచారని, ఇది పేదోళ్లకు వరమని ఆర్డీసీ చైర్మన్ నర్సారెడ్డి, గఢా అ ధికారి హన్మంతరావులు అన్నారు. ఎర్రవల్లిలో కళ్యాణలక్ష్మి చెక్కును అందించారు. అశ్విని ఆనందం... ఇన్నాళ్లు కళ్యాణలక్ష్మి పథకం చెక్కు అందలాంటే పెళ్లి అయి నెలలు గడిచిన రాలేని పరిస్థితి ఉండేవి. ప్రస్తుతం అలాంటి కష్టాలకు అశ్విని లగ్గంతోనే చెక్ పడింది. పెళ్లి రోజు కళ్యాణలక్ష్మి చెక్కును అందించడంతో అశ్విని ఆనందంతో మురిసిపోయింది. కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాగ్యబాల్‌రాజ్, జెడ్పీటీసీ రాంచంద్రం, ఎంపీటీసీ భాగ్యమ్మ, వీడీసీ అధ్యక్షులు కిష్టారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా పరిశీలకుడు పన్యాల భూపతిరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా మాజీ అధ్యక్షుడు మదాసు శ్రీనివాస్, జగదేవ్‌పూర్ మండలాధ్యక్షుడు గుండా రంగారెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
బస్సు అద్దాలు ధ్వంసం చేసిన దుండగులు
మెదక్ : ఆగంతకులు మూడు బస్సు అద్దాలను పగలగొట్టిన సంఘటన మంగళవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లో చోటు చేసుకుంది. బాధితుని కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నర్సింహులు జగదేవ్‌పూర్‌లోనే ఎస్విఎన్ ప్రైవేట్ పాఠశాలను నడుపుతున్నారు. అయితే తనకున్న మూడు బస్సులను పాఠశాల అవరణలో ప్రతి రోజులాగా నిలిపి ఉంచారు. అయితే సోమవారం రాత్రి వరకు బాగానే ఉన్నా బస్సులు మంగళవారం ఉదయం చూసేసరికి మూడు బస్సుల అద్దాలు పగలిపొయి ఉన్నాయి. దీంతో పాఠశాల కరస్పాండెంట్ నర్సింహులు వెంటనే ఎస్ఐ వీరన్నకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వీరన్న పాఠశాలకు చేరుకుని బస్సులను పరిశీలించారు. బాధితుడు మాట్లాడుతూ సుమారు రూ.లక్ష వరకు అస్థి నష్టం జరిగిందన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తకు టీ ఇచ్చి... తను విషం తాగి...
► ఇష్టం లేని పెళ్లి చేశారని నవవధువు ఆత్మహత్య జగదేవ్‌పూర్: కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఇష్టం లేని పెళ్లి చేశారని కన్నవాళ్లను వదిలి అనంతలోకాలకు వెళ్లింది. పచ్చని పందిరిలో వేద మంత్రాలు, వాయిద్యాల మధ్య జరిగిన పెళ్లి సంబురం తీరకముందే రెండు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. చివరిగా తాళి కట్టిన భర్తకు టీ ఇచ్చి బాత్రూంలోకి వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. జగదేవ్‌పూర్ మండలం చేబర్తి గ్రామానికి చెందిన గుర్రాల నర్సింహులు,లక్ష్మి దంపతుల కూతురు రేణుక ఇటివలే డిగ్రీ పూర్తి చేసింది. వర్గల్ మండలం జబ్బాపూర్‌కి చెందిన రంగస్వామితో రేణుకకు గురువారం పెళ్లి జరిగింది. పెళ్లి, విందు రోజు బాగానే ఉన్నా.. ఇష్టం లేని పెళ్లి చేశారన్న కోపంలో రేణుక ఉంది. విషయం మాత్రం ఇంట్లో వారికి చెప్పలేదు. శుక్రవారం జబ్బాపూర్ గ్రామంలో విందు అనంతరం అదే రాత్రి చేబర్తి వచ్చారు. ఉదయం వరకు బాగానే ఉండి భర్త స్వామికి టీ ఇచ్చి బాత్రూమ్లోకి వెళ్లింది. అర గంటైనా రాకపొవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు తలుపులు తట్టారు. ఎంతకూ తలుపులు తీయకపోవడంతో వాటిని తీసి లోపలికి వెళ్లి చూడగా రేణుక అపస్మారకస్థితిలో పడి ఉంది. వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కళ్ల ముందే కన్నబిడ్డ మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. -
నైజీరియాలో మెదక్‌వాసి దుర్మరణం
జగదేవ్‌పూర్ (మెదక్): నైజీరియా దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెదక్ జిల్లావాసి దుర్మరణం చెందారు. జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లికి చెందిన చింతమడక(కుంట) సాయిలు(45) ఉపాధి కోసం నైజీరియా వెళ్లాడు. నాలుగేళ్ల నుంచి అక్కడ పని చేస్తుండగా... సోమవారం రాత్రి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయిలు మృతి చెందాడు. కాగా, సాయిలుకు భార్య బాలవ్వ, కూతురు కవిత, కుమారుడు భాస్కర్ ఉన్నారు. సాయిలు మృతదేహం ఎర్రవల్లి గ్రామానికి రావడానికి రెండు రోజుల సమయం పడుతుందని గ్రామస్తులు తెలిపారు. అయితే, సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడికి వెళ్లారు. సీఎంను కలువడానికి వారికి అనుమతి లభించలేదు.