గజ్వేల్ నియోజకవర్గం
స్వయానా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో గజ్వేల్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. ఇక్కడి నుంచి వరుసగా రెండోసారి కేసీఆర్ బరిలో నిలవగా ముచ్చటగా మూడోసారి వంటేరు ప్రతాప్‌రెడ్డి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన ఆయన ఈసారి కండువా మార్చి కాంగ్రెస్ తరఫున పోటీకి దిగారు. బీజేపీ నుంచి ఆకుల విజయ, బీఎల్పీ నుంచి శ్రీరాముల శ్రీనివాస్ పోటీపడుతున్నారు. మెజారిటీ కోసం టీఆర్‌ఎస్ శ్రేణులు కృషి చేస్తుండగా.. గెలుపు కోసం కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. టీఆర్‌ఎస్ గెలుపు బాధ్యతలు మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు. ఈ స్థానం ప్రస్తుతం రాష్ట్రంలోనే హాట్ సీట్‌గా మారింది. ఇక్కడి పరిణామాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది.
గజ్వేల్: సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది. టీఆర్‌ఎస్ నుంచి ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ రెండోసారి పోటీలో ఉన్నారు. ఈ సారి తమ అధినేతకు భారీ మెజారిటీని బహుమతిగా ఇవ్వాలన్న లక్ష్యంతో ఆ పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. మంత్రి హరీశ్‌రావు ఈ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకొని అన్నీ తానై పనిచేస్తున్నారు. బీజేపీ, బీఎల్‌పీ(బహుజన లెఫ్ట్ పార్టీ)లు సైతం పోటీలో ఉన్నాయి. ఇక్కడ గెలిచే పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి రావడం గత 13 ఎన్నికల్లో ఆనవాయితీగా వస్తోంది. 2014 ఎన్నికల్లో ఇదే సెంటిమెంటును నమ్ముకొని ఈ నియోజకవర్గం నుంచి ‘బరి’లోకి దిగిన కేసీఆర్ అధికారం చేపట్టారు.
గజ్వేల్‌ను తన సొంత ‘ఇలాకా’గా మార్చుకున్న కేసీఆర్ నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి 2009, 2014 ఎన్నికల్లో ఓటమి చవిచూసి ప్రస్తుతం సానుభూతిని నమ్ముకొని బరిలోకి దిగారు. గెలుపే లక్ష్యంగా ప్రధాన టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక్కడి నుంచి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండడంతో రాష్ట్రంలోనే హాట్ సీట్‌గా మారింది. ఇక్కడ జరుగుతున్న ఎన్నికల పరిణామాలపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ సాగుతోంది.
నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు
రూ. 1800కోట్లతో కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్, రూ. 1200కోట్ల పైచిలుకు వ్యయంతో ములుగులో హార్టికల్చర్ యూనివర్సిటీ నిర్మాణం, రూ. 450 కోట్ల వ్యయంతో మిషన్ భగీరథ పథకం పనులు జరిగాయి.
మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ గజ్వేల్ మీదుగా 151 కిలోమీటర్లు మేర నిర్మాణం జరుగుతోంది. ఈ లైన్ నిర్మాణానికి రూ.1160 కోట్లు వెచ్చిస్తుండగా...తొలివిడతగా రూ.350 కోట్లు విడుదలయ్యాయి.
గజ్వేల్‌కు రూ. 220కోట్ల వ్యయంతో రింగురోడ్డు, రూ. 153కోట్ల వ్యయంతో ఎడ్యుకేషన్ హబ్, రూ. 100కోట్ల వ్యయంతో డబుల్ బెడ్రూం మోడల్ కాలనీ, రూ. 20కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, రూ. 25కోట్ల వ్యయంతో వంద పడకల ఆస్పత్రి, రూ. 25కోట్ల వ్యయంతో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రూ. 20కోట్ల వ్యయంతో ఆడిటోరియం వంటి భారీ అభివృద్ధి పనులను చేపట్టారు.
తన ఫాంహౌస్ గ్రామం ఎర్రవల్లితో పాటు నర్సన్నపేటలను స్వయంగా దత్తత తీసుకొని ఆయా గ్రామాల్లో 600 పైచిలుకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. అక్కడ సామూహిక వ్యవసాయం, డ్రిప్ పరికరాల పంపిణీ, ప్రతి ఇంటికి పాడిగేదెల పంపిణీ, వందకు పైగా వందశాతం సబ్సిడీతో ట్రాక్టర్ల పంపిణీ వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దారు.
సబ్‌స్టేషన్ల సామర్థ్యం పెంపు, వేయికిపైగా చెరువులను మిషన్ కాకతీయ పథకంలో అభివృద్ధి, ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, వైకుంఠధామాలు, పాఠశాలల అదనపు గదులు, గ్రామ పంచాయతీ, మహిళా భవనాలు, మినీ ఫంక్షన్‌హాళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టారు.
ప్రధాన సమస్యలు
నిరుద్యోగం... నియోజకవర్గంలో సుమారు 15వేలకు పైగా చదువుకున్న నిరుద్యోగ యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. భారీ పరిశ్రమల స్థాపన కోసం వీరంతా నిరీక్షిస్తున్నారు.
వంటేరు ప్రతాప్‌రెడ్డి (కాంగ్రెస్ అభ్యర్థి)
వంటేరు ప్రతాప్‌రెడ్డి గజ్వేల్ నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉన్న నేతగా గుర్తింపు పొందారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి చేతిలో 7వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్‌పై పోటీ చేసి 19339 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వస్తున్నారు. తనను ఆదరిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈసారైనా అవకాశం కల్పించండి అంటూ ప్రచారంచేస్తూ ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు.
ఆకుల విజయ(బీజేపీ అభ్యర్థి)
బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్న ఆకుల విజయ ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. 2014లో సిరిసిల్లలో కేటీఆర్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో 14800 ఓట్లు పొందారు. ప్రస్తుతం కేసీఆర్‌పై పోటీకి దిగారు. బీజేపీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మహిళా అభ్యర్థిగా తనను ఆదరించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
సిట్టింగ్ ప్రొఫైల్
కేసీఆర్ స్వగ్రామం సిద్దిపేట మండలంలోని చింతమడక. మొదట యూత్ కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రవేశం చేశారు. 1983లో టీడీపీలో చేరి సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 1985లో రెండో సారి పోటీ చేసి గెలుపొందారు. నాటి నుంచి నేటి వరకు ఎమ్మెల్యే, ఎంపీగా వివిధ స్థానాల నుంచి పోటీ చేస్తూ వరస విజయాలు సాధిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో శాసన సభ డిప్యూటీ స్పీకర్‌గా, రాష్ట్ర రవాణా శాఖామంత్రిగా పనిచేశారు. 2001 ఏప్రిల్ 27న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, టీఆర్‌ఎస్(తెలంగాణ రాష్ట్ర సమితి)ని స్థాపించారు. అనంతరం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో గెలుపొందారు.
2004 ఎన్నికల్లో సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లో గెలుపొందారు. ఆ తర్వాత సిద్దిపేట ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు. ఈ సమయంలో ఆరు నెలల పోర్ట్ పోలియో లేనిమంత్రిగా కొనసాగి, ఆ తర్వాత కేంద్ర కార్మిక మంత్రిగా ఏడాదిన్నర కాలం పనిచేశారు. 2006లో కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి మరోసారి కరీంనగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు.
2008లో కరీంనగర్ ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ గెలుపొందారు. 2009 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
శ్రీరాముల శ్రీనివాస్(బీఎల్‌పీ అభ్యర్థి)
బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థిగా గజ్వేల్ శాసనసభా స్థానం నుంచి పోటీ చేస్తున్న శ్రీరాముల శ్రీనివాస్ విప్లవ నేపథ్యం నుంచి వచ్చారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం తిమ్మాపూర్‌కు చెందిన వారు. గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసిన ఆయన గజ్వేల్ ప్రాంతంలో ఉద్యమాలను కొనసాగించారు. విప్లవ పార్టీలను వీడి ప్రస్తుతం బహుజన ఉద్యమాలను కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంపై ఉన్న మమకారంతో ప్రస్తుతం ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. బహుజన వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అగ్రకుల ఆధిపత్యాన్ని తగ్గించడమే తన లక్ష్యమని చెబుతూ... ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment