Gajwel constiuency
-
బోరుమన్న బోరబండ
సాక్షి,గజ్వేల్: రెండున్నర దశాబ్ధాల కిందట తక్కువ ఖర్చుతో అద్భుతంగా నిర్మించిన బహుళ ప్రయోజన రిజర్వాయర్ ‘బోరబండ’పై నిర్లక్ష్యం అలుముకుంది. సాగునీటి కొరతతో తల్లడిల్లుతున్న రైతాంగానికి ఊరటనివ్వాల్సిన ఈ జలాశయం నీరులేక వెలవెలబోతోంది. నిర్మాణం పూర్తయి 29 ఏళ్లు గడుస్తున్నా నీరందించాల్సిన కాల్వలు ప్రవాహానికి నోచుకోవడం లేదు... జలాశయం నిండితే మరెన్నో చెరువులకు నీటిని పంపే అవకాశమున్నా ఆ దిశగా సంబంధిత యంత్రాంగం చొరవ చూపడంలేదు. మిషన్ కాకతీయ 2వ విడతలో రూ. 20లక్షలు మంజూరు చేసి నామమాత్రంగా కొన్ని పనులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. జగదేవ్‌పూర్ మండలంలోని పీర్లపల్లి–ధర్మారం గ్రామాల మధ్య 1990లో రూ.56 లక్షల వ్యయంతో బోరబండ రిజర్వాయర్‌ను నిర్మించారు. 115 ఎకరాల విస్తీర్ణంలో 36.80 మిలియన్ ఘనపుటడుగుల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ జలాశయం నిర్మాణమైంది. క్షామంతో తల్లడిల్లుతున్న జగదేవ్‌పూర్ మండలంలోని వివిధ గ్రామాలకు ఆరుతడి పంటలకు కాల్వల ద్వారా సాగునీటిని అందించడంతో పాటు గజ్వేల్ నియోజకవర్గంలో భూగర్భజలాల పెంపొందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. సాగునీటిని పొలాలకు అందించడం కోసం 2.6 కిలోమీటర్ల పొడవున కుడి, 1.94 కిలోమీటర్ల పొడవునా ఎడమ కాల్వల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రాజెక్టు పరిధిలో 832 ఎకరాల ఆయకట్టు భూములున్నాయి. కుడికాల్వ ద్వారా ధర్మారం, వర్దరాజ్‌పూర్, ఇటిక్యాల,కొత్తపేట, పీర్లపల్లి గ్రామాల్లోని 568 ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందించడానికి, ఎడమ కాల్వ ద్వారా ధర్మారం, పీర్లపల్లిలోని మరికొంత భాగంలో వున్న 264 ఎకరాల ఆరుతడి పంటలకు సాగునీరు అందించడానికి ఏర్పాటు చేశారు. కానీ రిజర్వాయర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కాల్వలు ప్రవాహానికి నోచుకోలేదు. ఫలితంగా ఆయకట్టు భూముల రైతులకు నిరాశే మిగిలింది. వర్షాల వల్ల ప్రాజెక్టు నిండుతున్న సందర్భంలోనూ కాల్వల ద్వారా నీరందించేందుకు తూములను ఎత్తకపోవడంతో ప్రాజెక్టు వల్ల ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరలేదనే చెప్పాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి ప్రాజెక్ట్ నిర్మించాలంటే సుమారు రూ. 50కోట్లకుపైగానే ఖర్చవుతుందని చెబుతున్న ఇరిగేషన్ శాఖ అధికారులు 29 ఏళ్ల కిందట తక్కువ ఖర్చుతో అద్భుతంగా నిర్మించిన రిజర్వాయర్ అభివద్ధిపై నిర్లక్ష్యం వహించడంపై నిరసన వ్యక్తమవుతున్నది. అరకొరగా అభివృద్ధి పనులు సామూహిక చెరువుల యాజమాన్య పథకం కింద ‘బోరబండ’ రిజర్వాయర్ అభివద్ధికి 2008లో రూ. 84లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులను విడుదల చేయించుకోవడానికి ప్రణాళికలు తయారు చేసి సాంకేతిక అనుమతి పొందాల్సి ఉండగా దానిని పూర్తిచేయడంలో అధికారులు ఏళ్ల తరబడి నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఎన్నో ఏళ్ల జాప్యం తర్వాత ఆరేళ్ల క్రితం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు చేపట్టారు. శిథిలమైన కాల్వలను పటిష్టం చేయడం, తూముల మరమ్మతు, కట్టను పటిష్టం చేయడం తదితర పనులు వంటి పనులు అరకొరగా సాగాయి. ఎతైన ప్రదేశంలో ఉన్నా బోరబండ రిజర్వాయర్ నిండితే జగదేవ్‌పూర్ మండలంలోని పలు చెరువులకు ప్రవాహాపు నీటిని పంపే అవకాశముంది. కానీ ఈ దిశగా కార్యాచరణ రూపొందించడంలో ఇరిగేషన్‌శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున పూడికతీయాల్సి ఉన్నది. ఈ ప్రాజెక్ట్‌కు మాత్రం అధికారులు ‘మిషన్ కాకతీయ’–2లో కేవలం రూ.20 లక్షలు కేటాయించి కాల్వల మరమ్మతు పేరిట నామమాత్రంగా పనులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. మరోవైపు చుట్టూ అటవీ ప్రాంతంలో ఉన్న ఈ రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలున్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. సాక్షాత్తూ ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలో నిధుల కేటాయింపునకు ఇబ్బందులు లేకున్నా నీటిపారుదల శాఖ అధికారులకు పట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అనుసంధానానికి ప్రతిపాదనలు బోరబండ రిజర్వాయర్ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. గజ్వేల్ నియోజకవర్గంలో పూర్తియిన కొండపోచమ్మసాగర్ నుంచి యాదాద్రి జిల్లా తుర్కపల్లికి కాల్వ ద్వారా చెరువులకు సాగునీటిని పంపే ప్రతిపాదనలున్నాయి. ఈ ప్రతిపాదనలు అమలులోకి వస్తే జలాశయానికి కొత్త కళ రానుంది. తుర్కపల్లి కాల్వ అనుసంధానంతో రిజర్వాయర్‌కు పూర్వ వైభవం వస్తుంది. ఎత్తయిన ప్రదేశంలో ఉన్న బోరబండ ద్వారా సమీపంలోని చెరువులను నింపే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. రైతులు ఆందోళన చెందొద్దు. - పవన్, గజ్వేల్ నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈఈ -
గజ్వేల్‌లో సర్వత్రా ఆసక్తి
స్వయానా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో గజ్వేల్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. ఇక్కడి నుంచి వరుసగా రెండోసారి కేసీఆర్ బరిలో నిలవగా ముచ్చటగా మూడోసారి వంటేరు ప్రతాప్‌రెడ్డి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన ఆయన ఈసారి కండువా మార్చి కాంగ్రెస్ తరఫున పోటీకి దిగారు. బీజేపీ నుంచి ఆకుల విజయ, బీఎల్పీ నుంచి శ్రీరాముల శ్రీనివాస్ పోటీపడుతున్నారు. మెజారిటీ కోసం టీఆర్ఎస్ శ్రేణులు కృషి చేస్తుండగా.. గెలుపు కోసం కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. టీఆర్ఎస్ గెలుపు బాధ్యతలు మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు. ఈ స్థానం ప్రస్తుతం రాష్ట్రంలోనే హాట్ సీట్‌గా మారింది. ఇక్కడి పరిణామాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది. గజ్వేల్: సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్ నుంచి ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ రెండోసారి పోటీలో ఉన్నారు. ఈ సారి తమ అధినేతకు భారీ మెజారిటీని బహుమతిగా ఇవ్వాలన్న లక్ష్యంతో ఆ పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. మంత్రి హరీశ్‌రావు ఈ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకొని అన్నీ తానై పనిచేస్తున్నారు. బీజేపీ, బీఎల్పీ(బహుజన లెఫ్ట్ పార్టీ)లు సైతం పోటీలో ఉన్నాయి. ఇక్కడ గెలిచే పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి రావడం గత 13 ఎన్నికల్లో ఆనవాయితీగా వస్తోంది. 2014 ఎన్నికల్లో ఇదే సెంటిమెంటును నమ్ముకొని ఈ నియోజకవర్గం నుంచి ‘బరి’లోకి దిగిన కేసీఆర్ అధికారం చేపట్టారు. గజ్వేల్‌ను తన సొంత ‘ఇలాకా’గా మార్చుకున్న కేసీఆర్ నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి 2009, 2014 ఎన్నికల్లో ఓటమి చవిచూసి ప్రస్తుతం సానుభూతిని నమ్ముకొని బరిలోకి దిగారు. గెలుపే లక్ష్యంగా ప్రధాన టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక్కడి నుంచి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండడంతో రాష్ట్రంలోనే హాట్ సీట్‌గా మారింది. ఇక్కడ జరుగుతున్న ఎన్నికల పరిణామాలపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు రూ. 1800కోట్లతో కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్, రూ. 1200కోట్ల పైచిలుకు వ్యయంతో ములుగులో హార్టికల్చర్ యూనివర్సిటీ నిర్మాణం, రూ. 450 కోట్ల వ్యయంతో మిషన్ భగీరథ పథకం పనులు జరిగాయి. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ గజ్వేల్ మీదుగా 151 కిలోమీటర్లు మేర నిర్మాణం జరుగుతోంది. ఈ లైన్ నిర్మాణానికి రూ.1160 కోట్లు వెచ్చిస్తుండగా...తొలివిడతగా రూ.350 కోట్లు విడుదలయ్యాయి. గజ్వేల్‌కు రూ. 220కోట్ల వ్యయంతో రింగురోడ్డు, రూ. 153కోట్ల వ్యయంతో ఎడ్యుకేషన్ హబ్, రూ. 100కోట్ల వ్యయంతో డబుల్ బెడ్రూం మోడల్ కాలనీ, రూ. 20కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, రూ. 25కోట్ల వ్యయంతో వంద పడకల ఆస్పత్రి, రూ. 25కోట్ల వ్యయంతో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రూ. 20కోట్ల వ్యయంతో ఆడిటోరియం వంటి భారీ అభివృద్ధి పనులను చేపట్టారు. తన ఫాంహౌస్ గ్రామం ఎర్రవల్లితో పాటు నర్సన్నపేటలను స్వయంగా దత్తత తీసుకొని ఆయా గ్రామాల్లో 600 పైచిలుకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. అక్కడ సామూహిక వ్యవసాయం, డ్రిప్ పరికరాల పంపిణీ, ప్రతి ఇంటికి పాడిగేదెల పంపిణీ, వందకు పైగా వందశాతం సబ్సిడీతో ట్రాక్టర్ల పంపిణీ వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దారు. సబ్స్టేషన్ల సామర్థ్యం పెంపు, వేయికిపైగా చెరువులను మిషన్ కాకతీయ పథకంలో అభివృద్ధి, ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, వైకుంఠధామాలు, పాఠశాలల అదనపు గదులు, గ్రామ పంచాయతీ, మహిళా భవనాలు, మినీ ఫంక్షన్‌హాళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టారు. ప్రధాన సమస్యలు నిరుద్యోగం... నియోజకవర్గంలో సుమారు 15వేలకు పైగా చదువుకున్న నిరుద్యోగ యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. భారీ పరిశ్రమల స్థాపన కోసం వీరంతా నిరీక్షిస్తున్నారు. వంటేరు ప్రతాప్‌రెడ్డి (కాంగ్రెస్ అభ్యర్థి) వంటేరు ప్రతాప్‌రెడ్డి గజ్వేల్ నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉన్న నేతగా గుర్తింపు పొందారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి చేతిలో 7వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్‌పై పోటీ చేసి 19339 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వస్తున్నారు. తనను ఆదరిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈసారైనా అవకాశం కల్పించండి అంటూ ప్రచారంచేస్తూ ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఆకుల విజయ(బీజేపీ అభ్యర్థి) బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్న ఆకుల విజయ ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. 2014లో సిరిసిల్లలో కేటీఆర్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో 14800 ఓట్లు పొందారు. ప్రస్తుతం కేసీఆర్‌పై పోటీకి దిగారు. బీజేపీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మహిళా అభ్యర్థిగా తనను ఆదరించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సిట్టింగ్ ప్రొఫైల్ కేసీఆర్ స్వగ్రామం సిద్దిపేట మండలంలోని చింతమడక. మొదట యూత్ కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రవేశం చేశారు. 1983లో టీడీపీలో చేరి సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 1985లో రెండో సారి పోటీ చేసి గెలుపొందారు. నాటి నుంచి నేటి వరకు ఎమ్మెల్యే, ఎంపీగా వివిధ స్థానాల నుంచి పోటీ చేస్తూ వరస విజయాలు సాధిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో శాసన సభ డిప్యూటీ స్పీకర్‌గా, రాష్ట్ర రవాణా శాఖామంత్రిగా పనిచేశారు. 2001 ఏప్రిల్ 27న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సమితి)ని స్థాపించారు. అనంతరం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో గెలుపొందారు. 2004 ఎన్నికల్లో సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లో గెలుపొందారు. ఆ తర్వాత సిద్దిపేట ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు. ఈ సమయంలో ఆరు నెలల పోర్ట్ పోలియో లేనిమంత్రిగా కొనసాగి, ఆ తర్వాత కేంద్ర కార్మిక మంత్రిగా ఏడాదిన్నర కాలం పనిచేశారు. 2006లో కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి మరోసారి కరీంనగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు. 2008లో కరీంనగర్ ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ గెలుపొందారు. 2009 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. శ్రీరాముల శ్రీనివాస్(బీఎల్పీ అభ్యర్థి) బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థిగా గజ్వేల్ శాసనసభా స్థానం నుంచి పోటీ చేస్తున్న శ్రీరాముల శ్రీనివాస్ విప్లవ నేపథ్యం నుంచి వచ్చారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం తిమ్మాపూర్‌కు చెందిన వారు. గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసిన ఆయన గజ్వేల్ ప్రాంతంలో ఉద్యమాలను కొనసాగించారు. విప్లవ పార్టీలను వీడి ప్రస్తుతం బహుజన ఉద్యమాలను కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంపై ఉన్న మమకారంతో ప్రస్తుతం ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. బహుజన వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అగ్రకుల ఆధిపత్యాన్ని తగ్గించడమే తన లక్ష్యమని చెబుతూ... ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. -
పాలకుడిని కాదు... సేవకుడిని
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు నేనేమిచ్చినా తక్కువనే, ఏం చేసినా తక్కువనే. మీ కాలికి ముల్లు గుచ్చుకుంటే నా పంటితో పీకేస్తా’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన సొంత నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన అధికారిక హోదాలో తొలిసారిగా సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచే ప్రజల మధ్యకు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాల్లో పాల్గొని ప్రసంగించారు. నియోజకవర్గం ప్రజలు కోరకుండానే వరాల వర్షం కురిపించారు. కేసీఆర్ వరాల జడివానలో గజ్వేల్ తడిసి, మురిసిపోయారు. తాను గజ్వేల్‌కు వచ్చి పోటీ చేస్తే... ఇక్కడి ప్రజలు తన మీద అమృతం కురిపించారని అన్నారు. తనను కడుపులో పెట్టుకొని గెలివపించారని కొనియాడారు. ఎన్నికల సందర్భంలో గజ్వేల్ నియోజకవర్గ ప్రజల మధ్యకు ఎక్కువగా రాలేకపోయినా... మంచి మెజార్టీతోని ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు అని అన్నారు. గజ్వేల్ ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనమీద ఉందన్నారు. గజ్వేల్ పట్టణ పేదలకు 5 వేల ఇళ్లు గతంలో తాను చెప్పిన విధంగా ఒక ప్రత్యేకమైన స్థలం తీసుకుని గజ్వేల్ పట్టణంలోని పేదలకు 5 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నానని కేసీఆర్ ప్రకటించారు. ఆ కాలనీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, తానే స్వయంగా వచ్చి కాలనీ ఫౌండేషన్ స్టోన్ వేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న జిల్లా కలెక్టర్‌ను రిక్వేస్టు చేస్తూ...గజ్వేల్‌లో రేపటి నుంచే కౌంటర్లు ఏర్పాటు చేసి, పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సిందిగా కేసీఆర్ కోరారు. అర్హుల జాబితా తనకు పంపిస్తే... హైదరాబాద్ నుంచి ఇళ్లు మంజూరు చేయడంతో పాటు తానే వచ్చి శంకుస్థాపన చేస్తానన్నారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దే బాధ్యత తాను తీసుకుంటుంన్నానని ప్రజలకు భరోసా ఇచ్చారు. గోదావరి నీళ్లు తెచ్చి ఈ తల్లి పాదాలు కడుగుతా నియోజకవర్గానికి రెండు నుంచి మూడు లక్షల ఎకరాలకు సాగు నీరు తెచ్చే బాధ్యత తనమీద ఉందని కేసీఆర్ అన్నారు. రానున్న రోజుల్లో గోదావరి నీళ్లు తెచ్చి గజ్వేల్ నేలతల్లి పాదాలు కడుగుతా అని ఆయన హామీ ఇచ్చారు. త్వరలోనే గజ్వేల్‌కు రింగ్‌రోడ్డు వచ్చి తీరుతుందన్నారు. ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ వరకు ఉన్న రోడ్డును నాలుగు, ఐదు లేన్ల రహదారిగా విస్తరించి బటర్‌ఫ్లై లైట్లతో అలంకరిస్తానన్నారు. హరిత హారం అనే నినాదం కింద గజ్వేల్ పట్టణంలో ఇబ్బడి ముబ్బడిగా చెట్లు పెంచుతానన్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత హెలీకాప్టర్‌లో గజ్వేల్‌కు వస్తే పట్టణంలో దిగుతున్నామా..! అడవిలో దిగుతున్నమా...! అనే విధంగా చెట్లు పెంచుతామన్నారు. తాగునీటి సమస్యను కూడా సంపూర్ణంగా పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ‘ నేను గజ్వేల్ ప్రజలను కోరేది ఒక్కటే... ఎన్నికలు అయిపోయినయి. స్థానిక ఎన్నికలు కూడా అయిపోయినయి. ఇగ రాజకీయాలు పక్కనబెడదాం. మనం ఎనుకబడిన ప్రాంతంగా ఉన్నాం. మనం బాగుపడాలే. అందరం ఒకటై, పార్టీలకు అతీతంగా ప్రజలకు నాయకత్వం వహించి ఏకోఖ్ముకంగా పనిచేసి అభివృద్ధి సాధించుదాం. గజ్వేల్ అగ్రగామి నియోజకవర్గంగా నిలబెడదాం. దాన్నిజూసుకొని గర్వపడుదాం’ అని కేసీఆర్ పిలుపు నిచ్చారు. గజ్వేల్ డెవలప్మెంట్ అథారిటీ ‘మీలో ఒకడిగా నేను మీకు అందుబాటులో ఉంటాను. చివరిగా ఒకే మాట చెప్తున్నా ...! గజ్వేల్ డెవలప్మెంటు అథారిటీ అని ఒక ఏజెన్సీ పెట్టి , మీ గురించి ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమిస్తా. హన్మంతరావు అనే అధికారి మీకు సేవ చేసేందుకు వస్తున్నారు. అన్ని పనులు వారు సమన్వయం చేస్తారు. మీ కోసం నా ఇంట్లో ఒక పీఏ కూడా ఉంటడు. మీరు అర్ధరాత్రి వచ్చినా..అపరాత్రి వచ్చిన ఆ పీఏ మీకు సేవలు అందిస్తావుంటాడు’. అని ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ప్రజలకు భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్‌పై ప్రశంసలు... జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. అవకాశం దొరినప్పుడల్లా కేసీఆర్ ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. నిజాయితీపరురాలిగా, అంకితభావం ఉన్న అధికారిణిగా ఆమెను కీర్తించారు. ఇలాంటి అధికారులు రాష్ట్రంలో ఒకరిద్దరు మాత్రమే ఉన్నారన్నారు. కరీంనగర్ జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసినప్పుడు వైద్య రంగంలో స్మితా సబర్వాల్ చూపిన చొరవతో వైద్యం పేదలకు అందుబాటులోకి వచ్చాయని, జిల్లాలో కూడా ఆమె అమలు చేస్తున్న ‘మార్పు’ కార్యక్రమం వల్లే మహిళలు ప్రభుత్వ ఆసుపత్రి వైపు మొగ్గు చూపుతున్నారని కొనియాడారు.