పాలకుడిని కాదు... సేవకుడిని | KCR promises waiver of crop loans worth Rs 12,000 cr | Sakshi
Sakshi News home page

పాలకుడిని కాదు... సేవకుడిని

Published Wed, Jun 4 2014 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM

పాలకుడిని కాదు... సేవకుడిని

పాలకుడిని కాదు... సేవకుడిని

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు నేనేమిచ్చినా తక్కువనే, ఏం చేసినా తక్కువనే. మీ కాలికి ముల్లు గుచ్చుకుంటే నా పంటితో పీకేస్తా’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన సొంత నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన అధికారిక  హోదాలో తొలిసారిగా సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచే ప్రజల మధ్యకు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాల్లో పాల్గొని ప్రసంగించారు. నియోజకవర్గం ప్రజలు కోరకుండానే వరాల వర్షం కురిపించారు. కేసీఆర్ వరాల జడివానలో గజ్వేల్ తడిసి, మురిసిపోయారు. తాను గజ్వేల్‌కు వచ్చి పోటీ చేస్తే... ఇక్కడి ప్రజలు తన మీద అమృతం కురిపించారని అన్నారు. తనను కడుపులో పెట్టుకొని గెలివపించారని కొనియాడారు. ఎన్నికల సందర్భంలో గజ్వేల్ నియోజకవర్గ ప్రజల మధ్యకు ఎక్కువగా రాలేకపోయినా... మంచి మెజార్టీతోని ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు అని అన్నారు. గజ్వేల్ ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనమీద ఉందన్నారు.
 
 గజ్వేల్ పట్టణ పేదలకు 5 వేల ఇళ్లు
 గతంలో తాను చెప్పిన విధంగా ఒక ప్రత్యేకమైన స్థలం తీసుకుని గజ్వేల్ పట్టణంలోని పేదలకు 5 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నానని కేసీఆర్ ప్రకటించారు. ఆ కాలనీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, తానే స్వయంగా వచ్చి కాలనీ ఫౌండేషన్ స్టోన్ వేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.
 ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న జిల్లా కలెక్టర్‌ను రిక్వేస్టు చేస్తూ...గజ్వేల్‌లో రేపటి నుంచే కౌంటర్లు ఏర్పాటు చేసి, పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సిందిగా కేసీఆర్ కోరారు. అర్హుల జాబితా తనకు పంపిస్తే... హైదరాబాద్ నుంచి ఇళ్లు మంజూరు చేయడంతో పాటు తానే వచ్చి శంకుస్థాపన చేస్తానన్నారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దే బాధ్యత తాను తీసుకుంటుంన్నానని ప్రజలకు భరోసా ఇచ్చారు.
 
 గోదావరి నీళ్లు తెచ్చి
 ఈ తల్లి పాదాలు కడుగుతా
 నియోజకవర్గానికి రెండు నుంచి మూడు లక్షల ఎకరాలకు  సాగు నీరు తెచ్చే బాధ్యత తనమీద ఉందని కేసీఆర్ అన్నారు. రానున్న రోజుల్లో గోదావరి నీళ్లు తెచ్చి గజ్వేల్ నేలతల్లి పాదాలు కడుగుతా అని ఆయన హామీ ఇచ్చారు. త్వరలోనే గజ్వేల్‌కు రింగ్‌రోడ్డు వచ్చి తీరుతుందన్నారు. ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ వరకు ఉన్న రోడ్డును నాలుగు, ఐదు లేన్ల రహదారిగా విస్తరించి బటర్‌ఫ్లై లైట్లతో అలంకరిస్తానన్నారు. హరిత హారం అనే నినాదం కింద గజ్వేల్ పట్టణంలో ఇబ్బడి ముబ్బడిగా చెట్లు పెంచుతానన్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత హెలీకాప్టర్‌లో గజ్వేల్‌కు  వస్తే పట్టణంలో దిగుతున్నామా..! అడవిలో దిగుతున్నమా...! అనే విధంగా చెట్లు పెంచుతామన్నారు. తాగునీటి సమస్యను కూడా సంపూర్ణంగా పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
 
 ‘ నేను గజ్వేల్ ప్రజలను కోరేది ఒక్కటే... ఎన్నికలు అయిపోయినయి. స్థానిక ఎన్నికలు కూడా అయిపోయినయి. ఇగ రాజకీయాలు పక్కనబెడదాం. మనం ఎనుకబడిన ప్రాంతంగా ఉన్నాం. మనం బాగుపడాలే. అందరం ఒకటై, పార్టీలకు అతీతంగా ప్రజలకు నాయకత్వం వహించి ఏకోఖ్ముకంగా పనిచేసి అభివృద్ధి సాధించుదాం. గజ్వేల్ అగ్రగామి నియోజకవర్గంగా నిలబెడదాం. దాన్నిజూసుకొని గర్వపడుదాం’ అని కేసీఆర్ పిలుపు నిచ్చారు.
 
 గజ్వేల్ డెవలప్‌మెంట్ అథారిటీ
 ‘మీలో ఒకడిగా నేను మీకు అందుబాటులో ఉంటాను. చివరిగా ఒకే మాట చెప్తున్నా ...! గజ్వేల్ డెవలప్‌మెంటు అథారిటీ అని ఒక ఏజెన్సీ పెట్టి , మీ గురించి ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమిస్తా. హన్మంతరావు అనే అధికారి మీకు సేవ చేసేందుకు  వస్తున్నారు. అన్ని పనులు వారు సమన్వయం చేస్తారు. మీ కోసం నా ఇంట్లో ఒక పీఏ కూడా ఉంటడు. మీరు అర్ధరాత్రి వచ్చినా..అపరాత్రి వచ్చిన ఆ పీఏ మీకు సేవలు అందిస్తావుంటాడు’. అని ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ప్రజలకు భరోసా ఇచ్చారు.
 
 జిల్లా కలెక్టర్‌పై ప్రశంసలు...
 జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. అవకాశం దొరినప్పుడల్లా కేసీఆర్ ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. నిజాయితీపరురాలిగా, అంకితభావం ఉన్న అధికారిణిగా ఆమెను కీర్తించారు. ఇలాంటి అధికారులు రాష్ట్రంలో ఒకరిద్దరు మాత్రమే ఉన్నారన్నారు. కరీంనగర్ జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసినప్పుడు వైద్య రంగంలో స్మితా సబర్వాల్ చూపిన చొరవతో వైద్యం పేదలకు అందుబాటులోకి వచ్చాయని, జిల్లాలో కూడా ఆమె అమలు చేస్తున్న ‘మార్పు’ కార్యక్రమం వల్లే మహిళలు ప్రభుత్వ ఆసుపత్రి వైపు మొగ్గు చూపుతున్నారని కొనియాడారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement