నెల్లూరు(రెవెన్యూ): జిల్లాలో ఈ ఏడాది వర్షపాతం 45 శాతం తక్కువ నమోదైంది. జిల్లాలోని 46 మండలాల్లోనూ కరువు ప్రభావం ఉంది. భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం కేవలం 7 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించింది. వాటిని పెంచే విధంగా చూడటంతో పాటు జిల్లాను పట్టిపీడిస్తున్న అనేక సమస్యలను సీఎం దృష్టికి తీసుకుపోనున్నట్లు కలెక్టర్ జానకి తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో విజయవాడలో బుధవారం 13 జిల్లాల కలెక్టర్లతో ప్రీబడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు జిల్లా కలెక్టర్ జానకి మంగళవారం రాత్రి బయలుదేరి వెళ్లారు. జిల్లాకు సంబంధించి సమగ్ర వివరాలను సిద్ధం చేసుకొని వెంట తీసుకుని వెళ్లారు. జిల్లా కలెక్టర్ ఎం. జానకి ప్రధానంగా 7 ఆంశాలపై చర్చించనున్నారు.
ముఖ్యంగా కరువు మండలాల పెంపుపై మాట్లాడనున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, డంపింగ్‌యార్డులు, ఇసుక విక్రయాలు, గ్రామీణ ప్రాంతాల్లో పౌష్టికాహారం, పర్యాటక అభివృద్ధి తదితరాలపై కలెక్టర్ చర్చించనున్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి.
రైతులు సోమశిల ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్న నీటితో పంటలు సాగుచేస్తున్నారు. జిల్లాలో ఉన్న 90 శాతం చెరువుల్లో నీరులేదు. వచ్చేది ఎండాకాలం..కాబట్టి ముందస్తు చర్యలు చేపట్టకపోతే ప్రజలు మంచినీటికి నానా అవస్థలుపడవలసి వస్తుంది. వందల సంఖ్యలో బోర్లు మరమ్మతులకు గురయ్యాయి. ఎండకాలంలోపు వాటికి మరమ్మతులు చేపట్టాలి. మంచినీటి ఎద్దడి నివారించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందో లేదో చూడాలి.
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వనరులు ఉన్నాయి. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటుచేయడానికి ఇతర దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ముందుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో భూముల గుర్తింపుపై చర్చించే అవకాశం ఉంది. రైతులకు మద్దతు ధర కల్పించేలా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలని కోరనున్నారు.
ఇసుక విక్రయాలు, సామాజిక పింఛన్లు, చంద్రన్న సంక్రాంతి కానుక తదితర అంశాలపై చర్చించనున్నారు. ఆదేవిధంగా ఏపీ ప్రభుత్వం సంక్రాంతి పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వనున్నారని తెలిసింది. గ్రామీణ ప్రాంతాలలో కబడ్డీ, ముగ్గుల పోటీలు తదితర వాటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
కరువు మండలాలే ప్రధానం
Published Wed, Jan 7 2015 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM
Advertisement
Advertisement