అమరావతి: రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం శాసనసభలో పట్టుబట్టింది. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే రైతుల ఆత్మహత్యలు, కరువు అంశంపై చర్చించాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ, నినాదాలు చేశారు.
ప్రశ్నోత్తరాలు పూర్తయ్యాక చర్చిద్దామని స్పీకర్ చెప్పినప్పటికీ వారు వినిపించుకోకుండా సభలో నినాదాలు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల తీరుపై ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, మంత్రి యనమల రామకృష్ణుడు అభ్యంతరం తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు సభా నిబంధనలు అతిక్రమిస్తున్నారని.. వారిపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేస్తామని యనమల అన్నారు.
సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను పదినిమిషాల పాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.