రూ.5 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలి
– ఇతర జిల్లాలతో ‘అనంత’ను పోల్చొద్దు
–ప్రత్యేకంగా చూసి.. తక్షణ సాయం ప్రకటించాలి
– వేరుశనగకు ఫసల్‌బీమా వర్తింపజేయాలి
– కేంద్ర కరువు బృందానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినతి
అనంతపురం అగ్రికల్చర్ : ‘వరుస కరువులతో జిల్లాలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. రైతుల ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది. కావున కరువు విషయంలో అనంతను ఇతర జిల్లాలతో పోల్చకుండా ప్రత్యేకంగా పరిగణించాలి. తక్షణ సాయంగా రూ.5 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాల’ని కేంద్ర కరువు బృందానికి ఽవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. మంగళవారం ఉదయం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ, ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి తరిమెల శరత్‌చంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రాగే పరశురాం, నదీం అహ్మద్, జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న తదితరులు అనంతపురంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (కేంద్ర కరువు బృందం) సభ్యులు జేకే రాథోడ్, జీఆర్ జర్గర్, ఎం.రామకృష్ణను కలిశారు. కలెక్టర్ కోన శశిధర్, జేసీ బి.లక్ష్మీకాంతం, ట్రైనీ కలెక్టర్ వినోద్‌కుమార్ పార్టీ నేతలను కేంద్ర బృందానికి పరిచయం చేయడంతో పాటు వినతిపత్రంలో పేర్కొన్న అంశాలను వివరించారు.
22 లక్షల ఎకరాల్లో పంట నష్టం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, శంకరనారాయణ, గురునాథ్‌రెడ్డి, శరత్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది 22 లక్షల ఎకరాల్లో పంట పూర్తిగా ఎండిపోవడంతో రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారన్నారు. పంట పెట్టుబడి నష్టమే రూ.3,500 కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల వరకు ఉందన్నారు. ఉపాధిహామీ పథకం అంతంత మాత్రంగానే అమలవుతుండడంతో ఇప్పటికే మూడు లక్షల మంది ప్రజలు వలసలు వెళ్లారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా కరువు జిల్లాగా ప్రకటిస్తూ కంటితుడుపు సాయం చేస్తోందని పేర్కొన్నారు. పంటలు దారుణంగా దెబ్బతిన్నా 2013లో రూ.643 కోట్లు, 2015కు సంబంధించి ఇన్‌పుట్ సబ్సిడీ ఎగ్గొట్టడంతో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. 2014కు సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీ రూ.55 కోట్లు, 2016 వాతావరణ బీమా రూ.367 కోట్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని వివరించారు. వేరుశనగ పంటకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రూ.19,500 ఉండగా, ఇన్‌పుట్ పరిహారం విషయానికి వచ్చే సరికి ఎకరాకు రూ.6 వేలు మాత్రమే ఇస్తామనడం దారుణమన్నారు.
ప్యాకేజీ తక్షణమే ప్రకటింపజేయండి
జిల్లాలో రైతులు, కూలీలు, ఇతరత్రా అన్ని వర్గాల పరిస్థితి దారుణంగా ఉండటంతో తక్షణ సాయంగా కేంద్రం నుంచి రూ.5 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించేలా చూడాలని కేంద్ర బృందానికి విన్నవించారు. ఉపాధిహామీ పథకం నిధులు పక్కదారి పట్టకుండా.. కూలీలు, రైతులు వలసలు వెళ్లకుండా చూడాలన్నారు. ఒక్కో కుటుంబానికి ఏడాదికి కనీసం 200 రోజుల ఉపాధి కల్పించాలన్నారు. పండిన అరకొర పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనందున కనీస మద్దతు ధర (మినిమం సపోర్ట్ ప్రైసెస్–ఎంఎస్‌పీ) ప్రకారం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. హంద్రీ–నీవా ప్రాజెక్టును పూర్తి చేసి తాగు, సాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. మొక్కుబడి సాయం కాకుండా శాశ్వత చర్యలతో ‘అనంత’ కరువును రూపుమాపే మార్గం చూపించాలని విజ్ఞప్తి చేశారు.