'కరువులో చంద్రబాబు రికార్డు బ్రేక్'
'కరువులో చంద్రబాబు రికార్డు బ్రేక్'
Published Thu, Feb 23 2017 12:59 PM | Last Updated on Sat, Jul 6 2019 12:58 PM
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పాలనలో రైతుల పరిస్ధితి మరింత దయనీయంగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం ప్రమాద ఘంటికలు మోగుతుంటే ప్రభుత్వం, బాధ్యత కల్గిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి ఆత్మవంచన చేసుకుంటూ రాష్ట్రం వెలిగిపోతున్నట్టు మాట్లాడటం ప్రజల ఆత్మాభిమానంపై దెబ్బకొట్టడమే అన్నారు. గతంలో ఎన్నడూలేని కరువును రాష్ట్రం ఎదుర్కొంటుందని, లక్షలాది ఎకరాల్లో భూములు బీడులుగా మారాయని తెలిపారు. అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ దుర్భిక్షాంధ్రప్రదేశ్‌గా మారిందని నాగిరెడ్డి ఆరోపించారు.
చంద్రబాబు అనేకసార్లు తన రికార్డులు తనే బ్రేక్ చేస్తున్నట్టు ప్రకటించుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరువు మూలంగా 2003లో ఆహార ధాన్యాల ఉత్పత్తి కనిష్ట స్థాయిలో 107 లక్షల టన్నులు.. ఇదే ఆయన కరువు రికార్డ్ అన్నారు. ప్రస్తుతం 2016-17 రాష్ట్రంలో ఇంతకుముందున్నెడూ లేనటువంటి కరువుతో ఆయన రికార్డును ఆయనే బ్రేకు చేసుకున్నారని ఎద్దేవా చేశారు.
సీఎం చంద్రబాబు నాయుడు కరువును జయించామన్నారు.. అయితే పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడితే ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తానంటున్నారు.. కానీ రాష్ట్ర ప్రజలు వేల గ్రామాల్లో త్రాగడానికి కూడా నీరు లేక, చేయటానికి పని దొరకక, పశువులకు పశుగ్రాసం లేక, పొట్ట చేత పట్టుకొని దినసరి కార్మికులుగా పక్క రాష్ట్రాలకు వలస పోవడంతో ఏపీ నేడు బిహార్‌ను మించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు వ్యవసాయరంగంలో అత్యధికంగా లావాదేవీలు జరిగే నవంబర్, డిసెంబర్ నెలల్లో నోట్ల రద్దు నిర్ణయం వల్ల రైతుల తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ఖరీఫ్ పంట అమ్ముకునే సమయం, రబీ పూర్తి స్థాయిలో మొదలయ్యే సమయంలో చేతిలో చిల్లి గవ్వ లేక రైతులు నానా అవస్థలు పడ్డారని గుర్తుచేశారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు ఏపీలోని అన్ని జిల్లాల్లో అన్ని పంటలు కలిపి 43.86 లక్షల హెక్టార్లలో సాగు చేశారని.. అయితే ఆయన అధికారంలోకి వచ్చిన ఈ మూడు సంవత్సరాల్లో సాగు అంతకంతకూ తగ్గిపోయిందన్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని వ్యవసాయరంగం, రైతుల దుస్థితిపై వైఎస్‌ఆర్సీపీ రైతు విభాగం సుదీర్ఘ సమీక్ష నిర్వహించినట్టు నాగిరెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement