suraksha bima yojana scheme
-
Invest the Change: ఆ అ అలా మొదలైంది ఆర్థిక అక్షరాస్యత
పదిహేడు సంవత్సరాల వయసులో ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి చాలా తక్కువమందికి ఆసక్తి ఉంటుంది. జిందాల్ మాత్రం అలా కాదు. హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన పదిహేడు సంవత్సరాల కశ్వీ జిందాల్‌కు ఆర్థిక విషయాలు అంటే బోలెడు ఆసక్తి. ఆ ఆసక్తి ఆమెను ఆర్థికరంగానికి సంబంధించిన అనేకానేక విషయాల గురించి తెలుసుకునేలా, ‘ఇన్వెస్ట్ ది చేంజ్’కు శ్రీకారం చుట్టేలా చేసింది. ఈ స్వచ్ఛందసంస్థ ద్వారా అట్టడుగు వర్గాల ప్రజలలో డిజిటల్ అక్షరాస్యత పెరిగేలా కృషి చేస్తోంది. రకరకాల ప్రభుత్వ పథకాల గురించి తన బృందంతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది కశ్వీ జిందాల్... ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సకీనా బతుకుదెరువు కోసం దిల్లీకి వచ్చిన కశ్వీ జిందాల్ ఇంట్లో చిన్నాచితకా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఒకసారి రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో బయటపడిందామె. ఇక అప్పటి నుంచి ఆమెకు భయం పట్టుకుంది. ‘ఒకవేళ నాకు ఏమైనా అయితే పిల్లల పరిస్థితి ఏమిటి?’ ఆ భయంలో ఆమెకు సరిగ్గా నిద్రపట్టేది కాదు. అలాంటి రోజుల్లో ఒకరోజు ‘ఇన్వెస్ట్ ది చేంజ్’ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సమావేశానికి హాజరైంది. ఆ సమావేశంలో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన గురించి తెలుసుకుంది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి ప్రమాదానికి గురైనా, చనిపోయినా రక్షణగా నిలిచే పథకం ఇది. సంవత్సరానికి ఇరవై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ పథకంలో తన పేరు నమోదు చేసుకున్న సకీనా ‘ఇప్పుడు నిశ్చింతగా ఉంది’ అంటుంది. ఈ పథకంలో తన పేరు నమోదు చేసుకోవడానికి ముందు సకీనాకు బ్యాంకు ఎకౌంట్ లేదు. దీంతో కశ్వీ బృందం సకీనాకు బ్యాంక్ ఎకౌంట్ రిజిస్టర్ చేయించింది. తండ్రి ఫైనాన్షియల్ రంగంలో పనిచేస్తుండడంతో జిందాల్‌కు ఫైనాన్షియల్ మార్కెట్స్‌కు సంబంధించిన విషయాలు ఆసక్తిగా తెలుసుకునేది. తండ్రి విసుక్కోకుండా ఓపిగ్గా చెప్పేవాడు. దీంతో జిందాల్‌కు ఎకనామిక్స్ అనేది ఫేవరెట్ సబ్జెక్ట్ అయింది. ఫైనాన్స్ రంగంలోనే తన కెరీర్ ఏర్పాటు చేసుకోవాలనే భవిష్యత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తమ అపార్ట్మెంట్లో హౌస్‌కీపింగ్ పనిచేసే వ్యక్తి మరణించాడు. అతడి వయసు 31 సంవత్సరాలు మాత్రమే. అతడి మీద కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. ఆ సమయంలో ఆ అపార్ట్మెంట్లో పనిచేసే ఇతర వర్కర్లతో మాట్లాడుతున్నప్పుడు వారికి ప్రాథమిక ఆర్థిక విషయాలు, ప్రభుత్వ పథకాల గురించి ఏమీ తెలియదు అని అర్థం అయింది. ఈ నేపథ్యంలో జిందాల్ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన...మొదలైన ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. ఆ తరువాత స్వచ్ఛంద సంస్థ ‘ఇన్వెస్ట్ ది ఛేంజ్’ ప్రారంభించింది. తొలిరోజు నుంచి ‘ఇన్వెస్ట్ ది చేంజ్’ నిర్వహించిన అవగాహన సదస్సులకు అద్భుత స్పందన లభించింది. ఆ సదస్సుల తరువాత ‘ఫలానా స్కీమ్‌లో చేరుతాము’ అంటూ ఫోన్లు వెల్లువెత్తేవి. వారు స్కీమ్‌లో చేరేలా ఆన్లైన్ అప్లయింగ్, ఫామ్–ఫిల్లింగ్ వరకు జిందాల్ బృందం ప్రతి పని దగ్గరుండి చూసుకునేది. ఏదైనా అప్లికేషన్ ఆమోదం పొందకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించేది. ‘ఇన్వెస్ట్ ది చేంజ్’లో పదిహేనుమంది వాలంటీర్లు ఉన్నారు. ‘రోటరీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్’ భాగస్వామ్యంతో ప్రాథమిక ఆర్థిక విషయాలు, ప్రభుత్వ పథకాల గురించి ఎన్నో ప్రాంతాలలో ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించింది జిందాల్. ‘ఇన్వెస్ట్ ది చేంజ్’ఎంతోమందిని ప్రభావితం చేసింది. మార్పు తీసుకు వచ్చింది. ఆఫీస్ బాయ్‌గా పనిచేసే ప్రకా‹ష్ మండల్... కోవిడ్ కల్లోలంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. అతడికి ఉపయోగపడే గవర్నమెంట్ పాలసీల గురించి తెలియజేసి సహాయపడింది జిందాల్ బృందం. ‘ఎన్నో స్కీమ్‌లు ఉన్నప్పటికీ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన నాకు నచ్చాయి. దీనికి కారణం సంవత్సరానికి చాలా తక్కువ మొత్తం కడితే సరిపోతుంది. స్కీమ్‌లో చేరాలనుకున్నప్పుడు ఫామ్స్ నింపడం, ఇతరత్రా విషయాలలో ఇబ్బంది పడ్డాను. ఇలాంటి సమయంలో జిందాల్ బృందం నాకు సహకరించింది’ అంటున్నాడు ప్రకాష్. భవిష్యత్‌లో ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించి మరిన్ని కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలనుకుంటుంది జిందాల్. ‘ఆర్థిక అక్షరాస్యత అనేది మనల్ని స్వతంత్రులను చేస్తుంది. తెలివైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ప్రభుత్వ పథకాలతో పాటు పొదుపు మార్గాల గురించి కూడా తెలియజేస్తున్నాం’ అంటుది కశ్వీ జిందాల్. వారి నమ్మకమే మన బలం గొప్ప లక్ష్యాలతో ముందుకు వచ్చినప్పటికీ ప్రజల్లో నమ్మకం పాదుకొల్పడం అనేది అతి పెద్ద సవాలు. వారి నమ్మకాన్ని గెలుచుకుంటే సగం విజయాన్ని సాధించినట్లే. వ్యక్తిగత విషయాలు కూడా మనతో పంచుకుంటారు. నా వయసు అనేది పెద్ద సమస్యగా మారింది. ఈ చిన్న అమ్మాయికి ఏం తెలుస్తుంది... అంటూ నన్ను పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే నా ఉపన్యాసాల ద్వారా వారిని ఆకట్టుకొని వారికి నా పట్ల నమ్మకం కుదిరేలా చేసేదాన్ని. – కశ్వీ జిందాల్, ఇన్వెస్ట్ ది చేంజ్–ఫౌండర్ -
ఏడాదికి 20రూపాయలే..బెనిఫిట్ రూ.2 లక్షలు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన ఒకటి. ఈ స్కీమ్ పాలసీ తీసుకున్న పాలసీ దారుడు ప్రమాదవశాత్తూ మరణిస్తే.. వారి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకునేందుకు సాయపడుతుంది. రూ.2 లక్షల వరకు ప్రయోజనం ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకంలో ఏడాదికి రూ.20 చెల్లించి రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందవచ్చు. మే నెల చివరిలో బ్యాలెన్స్ కట్ పీఎం సురక్ష బీమా యోజన పథకంలో చేరాలనుకునే వారు సంబంధిత బ్యాంకులు, పోస్టాఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ బీమా పాలసీ తీసుకున్న పాలసీ దారులు ఆటో డెబిట్ పెట్టుకుంటే వారి అకౌంట్ నుంచి ప్రతి సంవత్సరం రూ.20 బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా కట్ అవుతాయి. కావాల్సిన డాక్యుమెంట్లు ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకంలో చేరాలనుకునే వారికి బ్యాంక్ అకౌంట్,ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అర్హులు ఎవరంటే కేంద్రం అందిస్తున్న ఈ పథకంలో 18 నుంచి 70 ఏళ్ల వయసు వారు చేరేందుకు అర్హులు. -
బీమాతో పేదల కుటుంబాలకు భరోసా
ఒంగోలు: ప్రధానమంత్రి ఇటీవల ప్రవేశపెట్టిన మూడు రకాల పథకాలు పేదల కుటుంబాలకు అతిపెద్ద భరోసాగా నిలుస్తాయని బీమా సంస్థలే కాదు...బ్యాంకర్లూ చెబుతున్నారు. అయితే అవకాశం ఉన్నా సరైన అవగాహన లేకపోవడంతో ప్రజలు వీటిని వినియోగించుకునేందుకు దృష్టి సారించడం లేదు. చాలామంది ఏదో ఒక స్కీమును వినియోగించుకుంటే సరిపోతుంది కదా అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి కనీసం రెండు బీమా పథకాలను ఉపయోగించుకున్నా ఆపద వేళల్లో ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. అంటే ఈనెల 31వ తేదీ వరకు బ్యాంకుల్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. జూన్ ఒకటో తేదీ నుంచి బీమా పథకాలు అమలులోకి వస్తాయి. మే 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేందుకు ఎటువంటి మెడికల్ చెకప్‌లు అవసరం లేదు. కేవలం ఫారం పూర్తిచేసి ఇస్తే సరిపోతుంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన: ఇది పూర్తిగా ప్రమాద బీమా. ఈ బీమాలో సభ్యత్వం పొందాలంటే బ్యాంకులో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ కనీసంగా నెలకు రూపాయి చొప్పున ప్రతి ఏడాది ఏకమొత్తంగా రూ.12 చెల్లించాలి. ఈ మొత్తం కూడా జూన్ ఒకటో తేదీ నాటికి బ్యాంకు ఖాతాలో నిల్వ ఉండాలి. మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా ప్రతి ఏడాది జూన్ ఒకటో తేదీ నాటికి నిల్వ ఉంచుకునేలా చూసుకోవాలి. దీనికి 18 నుంచి 70 ఏళ్ల వయస్సు వరకు అందరూ అర్హులే. ఏదైనా ప్రమాదవశాత్తు సంబంధిత పాలసీదారుడు మరణిస్తే అతను పేర్కొన్న నామినీకి రూ.2 లక్షలు అందుతుంది. ఒక వేళ పాలసీదారుడు తీవ్రంగా గాయపడి ఎటువంటి పనిచేసుకోలేని నిస్సహాయ స్థితికి లోనైతే అతనికి లక్ష రూపాయలు అందుతుంది. ప్రయోజనం ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన: ఇది పూర్తిగా జీవిత బీమా. మరణం ఏ రూపంలో సంభవించినా పాలసీదారుడు సూచించినా నామినీకి రూ.2 లక్షలు అందుతుంది. దీనికి ఏడాదికి రూ.330లు ప్రీమియం చెల్లించాలి. దీనికి దరఖాస్తు చేసుకోవాలంటే 18 నుంచి 50 సంవత్సరాలలోపు వారు మాత్రమే అర్హులు. పాలసీ 5 వరుస సంవత్సరాలు అమలులో ఉంటుంది. దీనికి కూడా ప్రీమియం రూ.330లు ప్రతి ఏడాది జూన్ ఒకటో తేదీ నాటికి బ్యాంకు ఖాతాల్లో నిల్వ ఉండేలా చూసుకోవాలి. జూన్ ఒకటో తేదీ నుంచి బీమా అమలులోకి వస్తుంది. వ్యవసాయ కూలీలు, డ్రైవర్లు, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఒక వేళ ఎవరైనా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన రెండింటికీ ప్రీమియం చెల్లించిన పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రెండు పథకాల నుంచి రూ.4 లక్షలు పరిహారం అందుతుంది. అటల్ పెన్షన్ యోజన: ఇది కేవలం భవిష్యత్తులో పెన్షన్ పొందేందుకు ఉద్దేశించిన పథకం. పెన్షన్ కనీసంగా వెయ్యి రూపాయల నుంచి రూ.5 వేల వరకు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే పెన్షన్ 60 సంవత్సరాలు దాటిన తరువాతే అందుతుంది. పథకంలో చేరాలంటే 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే అర్హులు. అసంఘటిత రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. వెయ్యి రూపాయల పెన్షన్ పొందాలంటే 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ప్రతినెల రూ.42 చొప్పున చెల్లించాలి. రూ.2 వేలు పెన్షన్ పొందాలంటే రూ.84, రూ.3 వేలు పెన్షన్ పొందాలంటే రూ.126, రూ.4 వేలు పెన్షన్ పొందాలంటే రూ.168, రూ.5 వేలు పెన్షన్ పొందాలంటే రూ.210లు చొప్పున ప్రీమియం చెల్లించాలి. అయితే ప్రీమియం వయస్సు పెరిగేకొద్దీ పెరుగుతూ ఉంటుంది. అయితే వేరే పెన్షన్ సౌకర్యం పొందుతున్నవారు ఈ పథకంలో దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు. పాలసీదారుడు మరణిస్తే నామినీకి రూ.1.70 లక్షలు చెల్లించడంతోపాటు పెన్షన్ కూడా ప్రతినెలా ప్రభుత్వం చెల్లిస్తుంది.