ఎదిర వెంకట్‌రెడ్డికి వినికిడి యంత్రాన్ని అమరుస్తున్న కేంద్ర మంత్రి గెహ్లాట్, చిత్రంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తదితరులు
ఇంతకాలం దివ్యాంగులకు ఇస్తున్న గుర్తింపు కార్డులు జిల్లా వరకే పరిమితం కాగా సమస్యలు ఎదురవుతున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చిందని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత శాఖ మంత్రి థాపర్‌చంద్ గెహ్లాట్ అన్నారు. ఈ మేరకు దేశమంతటా చెల్లుబాటయ్యేలా గుర్తింపు కార్డులు జారీ చేయనున్నామని తెలిపారు. ఈ విధానంలోకి వచ్చేందుకు 24 రాష్ట్రాలు ముందుకొచ్చాయని.. ఇందులో తెలంగాణ కూడా ఉందని చెప్పారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో దివ్యాంగులు, వృద్ధులకు ఉపకరణాలు పంపిణీ చేసేందుకు మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలోఆయన మాట్లాడారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : దివ్యాంగుల గుర్తింపు కోసం ఇచ్చే గుర్తింపు కార్డు జిల్లా వరకే చెల్లుబాటు అయ్యేవని.. ఈ సమస్యను గుర్తించి దేశవ్యాప్తంగా ఒకే గుర్తింపుకార్డు అమలుచేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించిన దివ్యాంగులు, వృద్ధులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గెహ్లాట్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. దివ్యాంగులకు అందజేసే యూనవర్సల్ ఐడెంటిటీ కార్డు అమలుచేయడానికి దేశంలోని 24 రాష్ట్రాల్లో ముందుకు వచ్చాయని, అందులో తెలంగాణ కూడా ఉందన్నారు.
ఈ కార్డు ద్వారా దేశంలో ఎక్కడైనా పథకాలను లబ్ధి పొందొచ్చని తెలిపారు. ఐదేళ్ల లోపు ఉన్న చెవిటి, మూగ చిన్నారులకు కాక్లర్ ఇంపాక్ట్ చికిత్స చేయిస్తే భవిష్యత్‌లో వారు మాట్లాడే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారని. దీనిని దృష్టిలో ఉంచుకొని చిన్నారులకు కాక్లర్ ఇంపాక్ట్ కోసం రూ.6లక్షల సబ్సిడీని కేంద్రం అందజేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 12.50 లక్షల మంది చిన్నారులకు కాక్లర్ ఇంపాక్ట్ చేయించడం జరిగిందన్నారు. అలాగే ఈ నాలుగేళ్లలో దేశ వ్యాప్తంగా దివ్యాంగుల కోసం 7వేల క్యాంప్‌లు నిర్వహించి ఐదు గిన్నిస్‌బుక్ రికార్డులను నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.620 కోట్లతో 11లక్షల మంది దివ్యాంగులకు వివిధ ఉపకరణాలు పంపిణీ చేసినట్లు వివరించారు. తన శాఖ పరిధిలోని పథకాల అమలులో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని గెహ్లాట్ వెల్లడించారు.
సబ్సిడీపై మోటార్ ట్రై సైకిల్
80శాతం వైకల్యం ఉండి నిలబడలేని దివ్యాంగులకు మోటార్ ట్రై సైకిల్ అందజేస్తున్నట్లు కేంద్ర మంత్రి గెహ్లాట్ తెలిపారు. వీటికోసం ఎలాంటి లైసెన్స్ ఉండదని, కేవలం బ్యాటరీతో నడుస్తుందన్నారు. ఈ మోటార్ ట్రై సైకిల్ విలువ రూ.37వేలు ఉండగా.. రూ.25వేల సబ్సిడీ కేంద్రం అందజేస్తుందన్నారు. దాతలు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి దివ్యాంగులకు మోటార్ ట్రై సైకిల్ అందజేసేలా కృషి చేయాలని కోరారు. మోటార్ ట్రై సైకిల్ లబ్ధిదారులు చిరువ్యాపారాలు చేయడానికి రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు.
దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి గెహ్లాట్, చిత్రంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు
రాజధానికి దీటుగా పాలమూరు అభివృద్ధి : రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
మహబూబ్‌నగర్ రూరల్ : హైదరాబాద్‌కు తీసిపోని విధంగా దీటుగా పాలమూరు జిల్లా రహదారుల అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర రోడ్డు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రూ.1860 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఎంపీ జితేందర్‌రెడ్డి అధ్యక్షతన జరగగా కలెక్టర్ రొనాల్డ్ రోస్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ మహబూబ్‌నగర్ రోడ్ల విస్తరణ, వెడల్పు, మరమ్మత్తు పనులకు రూ.230 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
దివ్యాంగులకు ఉపరకరణాలు అందజేయడం ఓ బృహత్తర కార్యమని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు పింఛన్లు అందజేస్తుండడం సీఎం కేసీఆర్ మంచి మనస్సుకు నిదర్శనమని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా 8 నుంచి 10 లక్షల ఎకరాల వరకు సాగునీరు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇదే కాకుండా పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం జరుగుతుందని అన్నారు. సీఎంకు ఎంతో ఇష్టమైన ఈ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.
దివ్యాంగుల సంక్షేమానికి కృషి : రొనాల్డ్‌రోస్, కలెక్టర్
జిల్లాలో దివ్యాంగు ల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. వెనకబడిన పాలమూరు జిల్లా లో దివ్యాంగులకు ఉపకరణాలు అందించే క్యాంపు జరగడం సంతోషించదగ్గ విషయమ ని అన్నారు. స్థానిక ఎంపీ జితేందర్‌రెడ్డి సహకారంతో ఇలాంటి క్యాంపులు మరిన్ని జరగా లని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment