physically handicapped
-
దివ్యాంగ బాలికపై లైంగిక దాడి.. ఆపై ఆత్మహత్య
ఎన్పీకుంట: దివ్యాంగ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి.. ఆపై తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీసత్యసాయి జిల్లా ఎన్పీకుంట మండలం సారగుండ్లపల్లిలో జరిగింది. కదిరి డీఎస్పీ శ్రీలత, రూరల్ సీఐ నాగేంద్ర కథనం ప్రకారం... సారగుండ్లపల్లికి చెందిన పి.జనార్దన (36) తన భార్యను పుట్టినిల్లు అయిన తనకల్లు మండలం కొక్కంటిక్రాస్లో వదిలి ఆదివారం రాత్రి స్వగ్రామానికి బైక్‌పై తిరుగు పయనమయ్యాడు. మార్గమధ్యంలోని కొత్తమిద్ది గ్రామంలో వినాయక మండపం వద్ద రాత్రి 8 గంటల సమయంలో ఆడుకుంటున్న దివ్యాంగురాలైన 17 ఏళ్ల బాలికను కంపచెట్లలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న చిన్న పిల్లలు కేకలు వేయడంతో పారిపోయాడు. బాధితురాలి తండ్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో జనార్దనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతని ఆచూకీ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే..జనార్దన తన స్వగ్రామంలో నిర్మాణంలో ఉన్న తన ఇంట్లోని వంట గదిలో ఉరి వేసుకుని మృతి చెంది ఉండటాన్ని సోమవారం ఉదయం తల్లి గమనించింది. కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఎన్పీకుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా పోలీసులు మృతుడిని పరిశీలించగా చేతికి, వేలుకు ఇంకు అంటి ఉండటాన్ని గమనించి ఘటన స్థలంలో వెతకగా సూసైడ్‌నోట్ లభించింది. తన మృతికి ఎవరూ కారణం కాదని అందులో రాసి ఉన్నట్లు ధ్రువీకరించారు. ఇరువురి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
సీఎం భరోసా.. దొరికింది ఆసరా
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మంచి మనసు చాటుకున్నారు. విజయవాడలో బుధవారం ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సభ ముగించుకొని సీఎం తన కాన్వాయ్‌లో వెళ్తుండగా.. రోడ్డుపైన నిస్సహాయ స్థితిలో వీల్‌చైర్‌లో కూర్చున్న ఒక యువకుడిని గమనించారు. వెంటనే అతడి వైపు సీఎం తన చేయి చూపుతూ తాను ఉన్నాననే భరోసాను కల్పించారు. వెంటనే అతడి సమస్య ఏమిటో ఆరా తీయాలని తన సెక్యూరిటీ సిబ్బందిని సీఎం ఆదేశించారు. అలాగే అతడి వివరాలను తక్షణమే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. అంతటితో ఆగకుండా గన్నవరం విమానాశ్రయానికి వెళ్తూ కూడా ఆ యువకుడి విషయం ఎంతవరకు వచ్చిందని సీఎం జగన్ మరోసారి ఆరా తీశారు. యువకుడికి అవసరమైన సాయం అందేలా.. వైద్యానికి అవసరమైన ఖర్చును అంచనా వేసి తనకు వివరాలు పంపాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో తక్షణమే స్పందించిన విజయవాడ కలెక్టర్ ఢిల్లీ రావు స్వయంగా తన వాహనాన్ని యువకుడి ఉన్న చోటుకు పంపి అతడిని తన కార్యాలయానికి రప్పించారు. అతడి పరిస్థితిని కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు. వెంటనే డీఎంహెచ్ఓను పిలిపించి చికిత్స నిమిత్తం యువకుడిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అంతేకాకుండా తక్షణ సహాయం కింద రూ.లక్ష చెక్కును సైతం కలెక్టర్ ఢిల్లీ రావు అందజేశారు. సీఎం అండ.. తీరింది బెంగ.. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం చెవుటూరుకు చెందిన ఏసుబాబు, శివగంగల దంపతుల కుమారుడు లక్ష్మణ్ (20)కు రెండేళ్ల క్రితం ఓ ప్రమాదంలో తలకు బలమైన గాయమైంది. అప్పట్లో 71 రోజులు ఆస్పత్రిలోనే వైద్యం పొందినప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. లక్ష్మణ్ కాలు చచ్చుపడిపోయింది. కూలి పనులు చేసుకునే తల్లిదండ్రులు తమకు శక్తికి మించి వైద్యం చేయించారు. అయితే ప్రతి నెలా మందులకు రూ.10 వేలు వెచ్చించడం భారంగా మారింది. మిగిలిన ఇద్దరు కుమారులు కుటుంబ పోషణ కోసం చదువు మానేసి పనులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్‌ను కలిస్తే తమకు న్యాయం జరుగుతుందని బుధవారం బాధితుడు లక్ష్మణ్ తన తల్లిదండ్రులతో విజయవాడ వచ్చాడు. సీఎం అండతో సమస్య పరిష్కారమైంది. -
దివ్యాంగ బాలికపై లైంగిక దాడి యత్నం
రాజాం సిటీ: చట్టాలు ఎన్ని వచ్చిన మృగాళ్ల ఆగడాలకు అడ్డేలేకుండా పోతోంది. మండలంలోని కొత్తకంచరాం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దివ్యాంగ బాలికపై లైంగిక దాడి యత్నం ఘటనకు సంబంధించి ఎస్సై వీబీ రామకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దివ్యాంగ బాలిక (14) రాజాంలోని భవిత కేంద్రంలో 8వ తరగతి చదువుతోంది. ప్రతిరోజూ ఆటోలో రాజాం భవిత కేంద్రానికి వస్తూ పోతూ ఉండేది. రెండు రోజుల క్రితం యథావిధిగా భవిత కేంద్రానికి ప్రతి రోజూ వస్తున్న ఆటోలో వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఆటోకోసం వేచి చూస్తుండగా కొత్తకంచరాం గ్రామానికి చెందిన సామంతుల హరిబాబు బైక్‌పై వచ్చి ఇంటికి తీసుకువెళ్తానని ఎక్కించాడు. అక్కడినుంచి కంచరాం సమీపంలోని తోటపల్లి కాలువలోకి తీసుకువెళ్లి లైంగికదాడికి యత్నిస్తుండగా అటుగా వెళ్తున్న కొంతమంది గమనించి కేకలు వేయడంతో బాలికను విడిచిపెట్టి పరారయ్యాడు. బాలికను సచివాలయ మహిళా పోలీసుకు స్థానికులు అప్పగించగా వారు రాజాం పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. (చదవండి: సారా ప్యాకింగ్ కేంద్రాలపై దాడులు) -
భారీగా దివ్యాంగుల మెస్ చార్జీల పెంపు
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగుల మెస్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. సాధారణ విద్యార్థుల కంటే కనీసం 25% అధి కంగా మెస్ చార్జీలు చెల్లించాలని వికలాంగుల చట్టం–2016 చెబుతోంది. ఇందులో భాగంగా మెస్ చార్జీలు పెంచాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపింది. దీంతో స్పందించిన ప్రభుత్వం రెండ్రో జుల క్రితం పెంచిన మెస్ చార్జీలపై నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి డి.దివ్య ఉత్తర్వులు జారీ చేశారు. ప్రీమెట్రిక్ కేటగిరీలో 3 నుంచి 7వ తరగతి దివ్యాంగ విద్యార్థులకు నెలకు రూ.950 నుంచి రూ.1200కు పెంచింది. 8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.1100 నుంచి రూ.1500కు పెంచింది. పోస్టుమెట్రిక్ కేటగిరీలో ఇంటర్ నుంచి పీజీ వరకు చదివే దివ్యాంగ విద్యా ర్థులకు నెలకు రూ.1500 నుంచి రూ.2 వేలకు పెంచింది. -
డిసెంబర్ 7న కృత్రిమ అవయవాల పంపిణీ
సాక్షి, నిజామాబాద్: జిల్లా న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో వచ్చేనెల డిసెంబర్ 7న వికలాంగులకు కృతిమ అవయవాలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి, సబ్‌కోర్టు సీనియర్ సివిల్ జడ్జి ఎం. కిరణ్ మహి తెలిపారు. బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో జడ్జి తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ 7న నగరంలోని బస్వాగార్డెన్(వినాయక్‌నగర్)లో పంపిణీ ఉంటుందన్నారు. వివిధ ప్రమాదాల్లో కాళ్లు, చేతులు కో ల్పోయిన వారికి కృతిమ అవయవాల పంపిణీ, చెవిటి వారికి వినికిడి మిషన్లు, వృద్ధులకు చేతికర్రలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జడ్జి తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, మున్సిపల్ కార్పొరేషన్, ఐసీడీఎస్, మెప్మా, ఎన్జీవోస్, రెవెన్యూ సిబ్బంది సహకారంతో చేస్తామన్నారు. దీనికిగాను ఎవరికి ఏం అవసరం ఉందో దాని గుర్తించి ఈనెల 25లోపు జిల్లా కోర్టులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయ సూపరిం టెండెంట్‌కు దరఖాస్తులు ఇవ్వాలని కోరారు. న్యాయ చట్టాలపై అవగాహన... డిసెంబర్ 7న బస్వాగార్డెన్‌లో సీనియర్ సిటిజన్లకు న్యాయ చట్టాలపై అవగాహన కల్పించినట్లు సబ్‌కోర్టు జడ్జి కిరణ్ మహి తెలిపారు. సీనియర్ సిటిజన్లకు న్యాయ చట్టాలు ఏం చెబుతున్నాయి అనే వివరాలపై అవగాహన జరుగుతుందన్నారు. కృతిమ అవయవాల పంపిణీ, అవగాహన సదస్సును ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన వారు సద్వినియోగం చేసుకోవాలని జడ్జి తెలిపారు. -
22న దివ్యాంగుల కోటా కౌన్సెలింగ్
హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ డిప్లొమా కోర్సుల్లో, వ్యవసాయ, వెటర్నరీ డిగ్రీ కోర్సుల్లో దివ్యాంగుల రిజర్వేషన్ కోటాలోని సీట్ల భర్తీ కోసం గురువారం (22న)కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ సుధీర్‌కుమార్ తెలిపారు. వివిధ విభాగాల డాక్టర్ల బృందం, డీన్స్ కమిటీ అభ్యర్థులు విద్యార్థుల అర్హతలను, సామర్థ్యాలను పరిశీలిస్తారని చెప్పారు. వివిధ డిప్లొమా కోర్సులకు, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు (బైపీసీ స్ట్రీమ్) ఆన్లైన్లో పీహెచ్ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వారే హాజరుకావాలని వెల్లడించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫీజుతో రావాలని, వివరాలకు (www.pjtsau.edu.in) చూడవచ్చన్నారు. వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన సీట్ల భర్తీ.. వ్యవసాయ వర్సిటీ వివిధ డిప్లొమా కోర్సుల్లో (వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన) సీట్ల భర్తీకి ఈ నెల 22న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సుధీర్ కుమార్ తెలిపారు. ఎన్సీసీ డైరెక్టరేట్ ఆఫీసర్స్ సమక్షంలో కౌన్సెలింగ్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు నిర్ణీత ఫీజు డిప్లొమా కోర్సులకు రూ.12,200 (యూనివర్సిటీ పాలిటెక్నిక్స్), రూ.16,600 (ప్రైవేటు పాలిటెక్నిక్స్), డిగ్రీ కోర్సులకు రూ.36,450తో హాజరుకావాలని తెలిపారు. ఎన్సీసీ ఆఫీసర్ ప్రాధాన్యతలను సూచిస్తారని పేర్కొన్నారు. తర్వాత సీట్లను ప్రాధాన్యతల ఆధారంగా, టీఎంసెట్– 2019 ర్యాంకుల ప్రకారం భర్తీ చేస్తామని వెల్లడించారు. పూర్తి వివరాలను విశ్వవిద్యాలయం వెబ్సైట్లో చూడవచ్చని చెప్పారు. -
ఇక ఈజీ!
అమరచింత: జిల్లాలోని దివ్యాంగుల కోసం ఆర్టీసీ అధికారులు బస్ పాస్‌లు ఇచ్చేందుకు సరికొత్త ప్రణాళిక రూపొందించారు. వైకల్యం కలిగిన ప్రతిఒక్కరికీ 50శాతం రాయితీతో కూడిన బస్ పాస్‌లను నేరుగా వారికే అందించాలని భావిస్తున్నారు. ఇందుకోసం జిల్లాలోని అన్ని గ్రామాలు, మండల మహిళా సమాఖ్య కార్యాలయాల్లో ఏపీఎంల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. వారి నుంచి ఆధార్ జిరాక్స్ కాపీ, సదరం సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోతో పాటు రూ.30 ఫీజును తీసుకుని దరఖాస్తు చేసుకున్నవారికి 24 గంటల వ్యవధిలోనే పాస్ అందజేస్తున్నారు. దివ్యాంగుల కష్టాలకు చెల్లు ! జిల్లాలో మొత్తం 15,847 మంది దివ్యాంగుల్లో ఆర్థోపెడిక్ లోపం కలిగిన వారు 9,904 మంది, చూపు లేనివారు 2,059, చెవిటివారు 1,151, మానసిక వ్యాధిగ్రస్తులు 1414, ఇతర దివ్యాంగులు 1,271 మంది ఉన్నారు. డీఆర్డీఏ ద్వారా 11,053 మంది దివ్యాంగులు ఆసరా పింఛన్లు పొందుతున్నారు. వీరందరికీ తప్పనిసరిగా ప్రభుత్వపరంగా ఆర్టీసీ రాయితీ బస్సు పాసులు ఇవ్వాలని భావిస్తున్నారు. జిల్లాలోని దివ్యాంగులు ఆర్టీసీ బస్ పాస్‌లను పొందాలంటే నరకయాతన అనుభవించేవారు. ప్రతినెలా 27, 28 తేదీల్లోనే సాధారణ బస్ పాస్‌లతో పాటు దివ్యాంగులకు సైతం పాసులు ఇచ్చేవారు. దీంతో దివ్యాంగులు ఆయా డిపోల వద్ద గంటల తరబడి వేచి ఉండేవారు. ఇక వాటిని పొందాలంటేకష్టసాధ్యమని తెలుసుకున్న దివ్యాంగులు వాటిని తీసుకునేందుకు చాలామంది ఆసక్తిచూపేవారు కాదు. ఈ క్రమంలో ఇప్పటివరకు కేవలం 3500 మంది దివ్యాంగులు మాత్రమే ఆర్టీసీ రాయితీ పాసులు పొందుతున్నారు. ప్రతి ఒక్కరికీ బస్‌పాస్ అందించాలి 40శాతం వైకల్యం ఉన్నవారికి మాత్రమే రాయితీ బస్ పాస్‌లు ఇస్తున్నారు. 40 కంటే తక్కువ శాతం ఉన్నవారికి కనీసం ఇవ్వాలి. దివ్యాంగులను ప్రభుత్వమే ఆదుకోవాలి. – కుర్మన్న, మస్తీపురం ఇన్నాళ్లూ ఇబ్బందిపడ్డారు.. గతంలో దివ్యాంగుల ఆర్టీసీ రాయితీ బస్ పాస్‌లను పొందడానికి ఇబ్బందులు పడేవారు. నెలలో రెండు రోజులు మాత్రమే సాధారణ బస్ పాస్‌లతో పాటు దివ్యాంగులకు సైతం ఇస్తుండటంతో గంటల తరబడి వేచిచూస్తూ బాధపడేవాళ్లం. ఆర్టీసీ అధికారులు తీసుకున్న నిర్ణయంతో ప్రతిఒక్కరూ పొందుతున్నారు. – మాకం శ్రీనివాసులు, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు, తిప్పుడంపల్లి -
దివ్యాంగ ఓటర్లు 10,047
సాక్షి, మంచిర్యాల అగ్రికల్చర్: మంచిర్యాల జిల్లాలో దివ్యాంగ ఓటర్లు 10,047 మంది ఉన్నారని, పోలింగ్ కేంద్రాల్లో వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భారతి హోళికేరి తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఎన్నికల్లో దివ్యాంగుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు గాను టోల్‌ఫ్రీ నంబర్ హెల్ప్‌లైన్‌ను సోమవారం కలెక్టరేట్లో ప్రారంభించారు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే 18004250504 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్ చేయవచ్చన్నారు. దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు ప్రత్యేక వాహన సదుపాయం కల్పిస్తున్నామని, పోలింగ్ కేంద్రంలో వీల్చైర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ర్యాంపు, రెయిలింగ్ సౌకర్యంతో పాటు వీల్‌చైర్‌లోనే ఉండి ఓటు వేసేలా తగిన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 10,047 మంది దివ్యాంగులను గుర్తించామన్నారు. సదరం సర్టిఫికెట్ల ద్వారా పెన్షన్ పొందుతున్న వారి వివరాలు తీసుకొని వారు ఓటుహక్కు వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు. అంధులకు బ్రెయిలీ లిపిలో.. అంధులకు బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్ పోలింగ్ కేంద్రంలో అందుబాటులో ఉంచామని కలెక్టర్ తెలిపారు. బ్యాలెట్ పేపర్‌పై బ్రెయిలీ లిపిలో అంకెలు ఉంటాయని, అవసరమై చోట వారి వెంట వచ్చిన సహాయకుల సహకారంతో ఓటుహక్కు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. పోలింగ్‌కు ఐదు రోజులు ముందు బూత్‌స్థాయి అధికారుల ద్వారా ఓటరు స్లిప్, బ్రెయిలీ స్లిప్‌లు, బ్రెయిలీ ఎపిక్ కార్డులను అందజేస్తామన్నారు. బ్రెయిలీ ఎపిక్ దివ్యాంగులకు, గర్భిణులు, బాలింతలకు క్యూ ఉండదని, పోలింగ్ కేంద్రాల్లో వారు కూర్చోడానికి అన్ని ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. ఎన్ఎస్ఎస్ వాలంటరీర్లు, ఎన్సీసీ కెడెట్ల సహకరిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి రౌఫ్‌ఖాన్, ఇన్చార్జి డీఆర్డీవో శంకర్, పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు. -
ఒకే దేశం.. ఒకే కార్డు
ఇంతకాలం దివ్యాంగులకు ఇస్తున్న గుర్తింపు కార్డులు జిల్లా వరకే పరిమితం కాగా సమస్యలు ఎదురవుతున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చిందని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత శాఖ మంత్రి థాపర్చంద్ గెహ్లాట్ అన్నారు. ఈ మేరకు దేశమంతటా చెల్లుబాటయ్యేలా గుర్తింపు కార్డులు జారీ చేయనున్నామని తెలిపారు. ఈ విధానంలోకి వచ్చేందుకు 24 రాష్ట్రాలు ముందుకొచ్చాయని.. ఇందులో తెలంగాణ కూడా ఉందని చెప్పారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో దివ్యాంగులు, వృద్ధులకు ఉపకరణాలు పంపిణీ చేసేందుకు మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలోఆయన మాట్లాడారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : దివ్యాంగుల గుర్తింపు కోసం ఇచ్చే గుర్తింపు కార్డు జిల్లా వరకే చెల్లుబాటు అయ్యేవని.. ఈ సమస్యను గుర్తించి దేశవ్యాప్తంగా ఒకే గుర్తింపుకార్డు అమలుచేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించిన దివ్యాంగులు, వృద్ధులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గెహ్లాట్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. దివ్యాంగులకు అందజేసే యూనవర్సల్ ఐడెంటిటీ కార్డు అమలుచేయడానికి దేశంలోని 24 రాష్ట్రాల్లో ముందుకు వచ్చాయని, అందులో తెలంగాణ కూడా ఉందన్నారు. ఈ కార్డు ద్వారా దేశంలో ఎక్కడైనా పథకాలను లబ్ధి పొందొచ్చని తెలిపారు. ఐదేళ్ల లోపు ఉన్న చెవిటి, మూగ చిన్నారులకు కాక్లర్ ఇంపాక్ట్ చికిత్స చేయిస్తే భవిష్యత్‌లో వారు మాట్లాడే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారని. దీనిని దృష్టిలో ఉంచుకొని చిన్నారులకు కాక్లర్ ఇంపాక్ట్ కోసం రూ.6లక్షల సబ్సిడీని కేంద్రం అందజేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 12.50 లక్షల మంది చిన్నారులకు కాక్లర్ ఇంపాక్ట్ చేయించడం జరిగిందన్నారు. అలాగే ఈ నాలుగేళ్లలో దేశ వ్యాప్తంగా దివ్యాంగుల కోసం 7వేల క్యాంప్‌లు నిర్వహించి ఐదు గిన్నిస్‌బుక్ రికార్డులను నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.620 కోట్లతో 11లక్షల మంది దివ్యాంగులకు వివిధ ఉపకరణాలు పంపిణీ చేసినట్లు వివరించారు. తన శాఖ పరిధిలోని పథకాల అమలులో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని గెహ్లాట్ వెల్లడించారు. సబ్సిడీపై మోటార్ ట్రై సైకిల్ 80శాతం వైకల్యం ఉండి నిలబడలేని దివ్యాంగులకు మోటార్ ట్రై సైకిల్ అందజేస్తున్నట్లు కేంద్ర మంత్రి గెహ్లాట్ తెలిపారు. వీటికోసం ఎలాంటి లైసెన్స్ ఉండదని, కేవలం బ్యాటరీతో నడుస్తుందన్నారు. ఈ మోటార్ ట్రై సైకిల్ విలువ రూ.37వేలు ఉండగా.. రూ.25వేల సబ్సిడీ కేంద్రం అందజేస్తుందన్నారు. దాతలు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి దివ్యాంగులకు మోటార్ ట్రై సైకిల్ అందజేసేలా కృషి చేయాలని కోరారు. మోటార్ ట్రై సైకిల్ లబ్ధిదారులు చిరువ్యాపారాలు చేయడానికి రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి గెహ్లాట్, చిత్రంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎమ్మెల్యేలు రాజధానికి దీటుగా పాలమూరు అభివృద్ధి : రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మహబూబ్‌నగర్ రూరల్ : హైదరాబాద్‌కు తీసిపోని విధంగా దీటుగా పాలమూరు జిల్లా రహదారుల అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర రోడ్డు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రూ.1860 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఎంపీ జితేందర్‌రెడ్డి అధ్యక్షతన జరగగా కలెక్టర్ రొనాల్డ్ రోస్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ మహబూబ్‌నగర్ రోడ్ల విస్తరణ, వెడల్పు, మరమ్మత్తు పనులకు రూ.230 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దివ్యాంగులకు ఉపరకరణాలు అందజేయడం ఓ బృహత్తర కార్యమని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు పింఛన్లు అందజేస్తుండడం సీఎం కేసీఆర్ మంచి మనస్సుకు నిదర్శనమని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా 8 నుంచి 10 లక్షల ఎకరాల వరకు సాగునీరు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇదే కాకుండా పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం జరుగుతుందని అన్నారు. సీఎంకు ఎంతో ఇష్టమైన ఈ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి కృషి : రొనాల్డ్‌రోస్, కలెక్టర్ జిల్లాలో దివ్యాంగు ల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. వెనకబడిన పాలమూరు జిల్లా లో దివ్యాంగులకు ఉపకరణాలు అందించే క్యాంపు జరగడం సంతోషించదగ్గ విషయమ ని అన్నారు. స్థానిక ఎంపీ జితేందర్‌రెడ్డి సహకారంతో ఇలాంటి క్యాంపులు మరిన్ని జరగా లని ఆశాభావం వ్యక్తం చేశారు. -
దివ్యాంగులకు చంద్రబాబు వద్ద చేదు అనుభవం
తాడేపల్లి రూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి దివ్యాంగులు తమ సమస్యలను చెప్పుకునేందుకు శనివారం ఉదయం ఉండవల్లి–అమరావతి కరకట్ట వెంట ఉన్న ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు. ఉదయం 11 గంటల వరకు కరకట్టపైనే మండుటెండలో వేచి ఉన్నారు. చివరకు సీఎంతో మాట్లాడేందుకు ముగ్గురు ప్రతినిధులకు అవకాశం ఇచ్చారు. వారు సమస్యలను పూర్తిగా విన్నవించకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులు మాట్లాడుతూ దివ్యాంగులందరికీ సమానంగా రూ.3,000 పింఛను ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క దివ్యాంగుడు కూడా చట్టసభల్లో లేరని, రాబోయే ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరగా, ఆయన గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారు.. అని వ్యాఖ్యానించారని ఒక దివ్యాంగుడు వాపోయాడు. ఈనెల 27 నుంచి జరగనున్న టీడీపీ మహానాడులో దివ్యాంగుల సమస్యలపై చర్చించాలని కోరినట్టు తెలిపారు. దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలి జోజిబాబు, వనమా బాబూరావు, వి.దుర్గారావు, సర్వేశ్వరరావు, రమేష్, ఎస్.కె.జిలాని, కొమ్మూరి రాధాకృష్ణ, ఏసుగంటి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కొండూరులో వికలాంగుడు ఆత్మహత్య
-
వికలాంగులకు రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పించాలి
హైదరాబాద్ : శారీరక వైకల్యం ఉన్న వారికి రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించాలని పలువురు నేతలు కోరారు. అఖిల భారత వికలాంగుల వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ శుక్రవారం చిక్కడపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహాసభ నిర్వహించింది. ఈ సమావేశానికి పలువురు రాజకీయ, ఉద్యమ పార్టీల నేతలు హాజరై వికలాంగులకు మద్దతు తెలిపారు. అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి అన్ని రంగాల్లో సమప్రాధాన్యం దక్కేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, విమలక్క ఇతర రాజకీయ పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
పింఛను కోసం.. సెల్ టవర్ ఎక్కబోయాడు
కోరుకొండ(తూర్పుగోదావరి జిల్లా): పింఛను కోసం ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా, ఎంతమంది అధికారులను కలిసినా రాకపోవడంతో ఓ వికలాంగుడు సెల్‌టవర్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో జరిగింది. గాదరాడ గ్రామానికి చెందిన సీహెచ్. వీరబాబుకు గతంలో రూ. 200 పింఛను వచ్చేది. ప్రభుత్వం మారిన తర్వాత అతనికి పింఛను అందడం లేదు. గ్రామంలోని రైతు కన్వీనర్ తోరాటి శ్రీను సహాయంతో ఎన్నో సార్లు అధికారులను కలిశాడు. అయినా పింఛను అందకపోవడంతో సోమవారం ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ఉన్న సెల్‌టవర్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. తోరాటి శ్రీను సెల్‌టవర్ ఎక్కగా, వీరబాబును పోలీసులు అడ్డుకున్నారు. శ్రీను మాత్రం సెల్‌టవర్‌పైనే ఉండిపోయాడు. కోరుకొండ మండలంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ రాజనగరం నియోజకవర్గ ఇంచార్జి జక్కంపూడి విజయలక్ష్మీ ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ధర్నాకు దిగారు. -
నడవలేకున్నా.. పరీక్షలు రాస్తా....
లేపాక్షి: పట్టుదల ముందు ఎటువంటి ఆటంకాలు, అవరోధాలైనా తలవంచాల్సిందేనని అనంతపురం జిల్లాకు చెందిన ఓ బాలిక నిరూపించింది. నడవలేని స్థితిలో ఉన్నా... విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినా... విద్యా సంవత్సరాన్ని కోల్పోరాదనే ఉద్దేశంతో పరీక్షలకు హాజరవుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కల్లూరు గ్రామానికి చెందిన శ్రావణి పదో తరగతి చదువుతోంది. ఆరు నెలల సైకిల్‌పై పాఠశాలకు వెళుతూ కిందపడడంతో కాలు విరిగింది. వైద్యులు శస్త్రచికిత్స చేసి కాలి లోపల స్టీల్ రాడ్ వేశారు. అయితే, దురదష్టవశాత్తూ శ్రావణి మరోసారి కిందపడడంతో రెండోసారీ శస్త్రచికిత్స చేసిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. కానీ, ఎంత కష్టమైనా సరే పదో తరగతి వార్షిక పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్న శ్రావణి... తండ్రి సహాయంతో లేపాక్షిలోని వివేకానంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షలు రాస్తోంది. -
''రెండు కాళ్లు లేవు.. కాని కారు నడుపుతాడు''
-
సీఎం కేసీఆర్ సారూ... మొర వినే దెవరు?
ఈ చిత్రంలోని అభాగ్యురాలిని చూశారా? నడవలేని దీన స్థితిలో ఎంతో కష్టపడి తెలంగాణ సెక్రెటేరియట్‌కు వచ్చిన ఆమె గాధ వింటే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. కానీ మన అధికారులకు మాత్రం ఆమె బాధ అర్థం చేసుకునే ఓపిక.. తీరిక లేవు. ఆమె పేరు రమాదేవి. నల్గొండ పట్టణానికి చెందిన ఆమెకు పుట్టుకతోనే పోలియో సోకడంతో నడవలేకపోతోంది. ఆమె భర్త పేరు శ్రావణ్‌కుమార్. వీరికి ఇద్దరు పిల్లలు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో భర్త శ్రావణ్ కుమార్‌కు కాలు విరిగిపోయింది. అతను మంచాన పడ్డాడు. హైదరాబాద్ : ఇల్లు గడవడం కష్టమైంది. ఏం చేయాలో తోచని ఆమె సీఎం కేసీఆర్‌కు తన దుస్థితిని వివరించి, ఆదుకోవాల్సిందిగా కోరాలని భావించింది. వినతిపత్రంతో సోమవారం తెలంగాణ సచివాలయానికి చేరుకుంది. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు తన పరిస్థితిని వివరించి...సీఎంను కలిసేందుకు అవకాశం ఇప్పించాలని వేడుకుంది. అయినా ఫలితం కనిపించలేదు. ఆమెను లోపలికి పంపించేందుకు వారు నిరాకరించారు. ఎవరిని కదిపించినా ఉపయోగం లేకుండాపోయింది. చాలా సేపు అదే ఆవరణలో నిరీక్షించిన ఆమె చివరకు అటుగా వస్తున్న ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారికి తన దుస్థితిని వివరించే ప్రయత్నం చేసింది. ఆయనకు వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించగా...‘నాకెందుకు ఇస్తావ్’ అని ప్రశిస్తూ వెళ్లిపోయారు. ‘నా ఇద్దరు పిల్లలు కడుపు నిండా తినగలిగితే అదే చాలు’ అంటున్న ఆమె మాటలు ప్రభుత్వ పెద్దలకు చెప్పే వారే లేకపోయారు. అప్పటికే తిరిగి తిరిగి అలసిపోయిన ఆ అభాగ్యురాలు నిరాశతో... కన్నీరు పెట్టుకుంటూ వెనుదిరిగింది. -
వికలాంగ సంఘాలతో ముఖ్య కార్యదర్శి చర్చలు విఫలం
సమస్యలపై పోరు కొనసాగిస్తామన్న వికలాంగులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు - వాటి పరిష్కారాల కోసం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వికలాంగ సంఘాలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వికలాంగ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహానీ శనివారం సాయంత్రం వివిధ సంఘాలతో చర్చలు జరిపారు. గత డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగ దినోత్సవాల సందర్భంగా ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చారో చెప్పాలని వికలాంగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వికలాంగుల పింఛన్‌ను మార్చిలోగా పెంచుతానని అప్పుడు సీఎం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీల తరహాలో ఇచ్చే పారిశ్రామిక రాయితీలు, స్టడీసర్కిల్ ఏర్పాటు, ఇళ్ల మంజూరులో వికలాంగులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న జీవో అమలు ఈ రోజు వరకు ఎందుకు నెరవేర్చలేదని నిలదీశారు. అసలు ఈ సమావేశాన్ని సీఎం నిర్వహించమన్నారా? లేక మీరే నిర్వహించారా? అని ప్రశ్నించగా, తానే నిర్వహిస్తున్నట్లు నీలం సహానీ చెప్పినట్లు సమాచారం. దీంతో వికలాంగ సంఘాలు ఈ చర్చలను తాము అంగీకరించలేదని తేల్చి చెప్పడంతో చర్చలు విఫలమయ్యాయి. సమావేశం అనంతరం వికలాంగ హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు అందె రాంబాబు ‘సాక్షి’తో మాట్లాడుతూ వికలాంగుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రపంచ వికలాంగ హక్కుల దినోత్సవాన్ని బ్లాక్‌డేగా జరుపుకుంటామని చెప్పారు. అన్ని జిల్లాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి వికలాంగులు నిరసనను తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం ఎక్కడ కార్యక్రమంలో పాల్గొన్నా అడ్డుకుని తీరుతామని ప్రకటించారు. -
కదంతొక్కిన వికలాంగులు
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ఇళ్ల స్థలాల కోసం వికలాంగులు కదంతొక్కారు. వికలాంగుల హక్కుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మల్లేశం మాట్లాడుతూ.. ప్రభుత్వం వికలాంగుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వికలాంగులందరికీ ఇళ్ల స్థలాలు, అంత్యోదయ రేషన్ కార్డులు, దీపం కనెక్షన్ కింద గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని, జిల్లా కేంద్రంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. స్వయం ఉపాధి కోసం బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో 3 శాతం వికలాంగులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎన్పీఆర్డీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడివయ్య మాట్లాడూతూ.. పారిశ్రామిక వేత్తలకు భూములిస్తున్న ప్రభుత్వం, వికలాంగులకు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. జిల్లా స్థాయిలో వికలాంగుల మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని, సర్టిఫికెట్లు కలిగిన వికలాంగులకు పింఛన్లు మంజూరు చేయాలని, ఉపాధి హామీ పథకంలో 150 రోజులపాటు పనులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, కార్యదర్శి గోపాల్, నాయకులు బస్వరాజ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్ 1500కు పెంచాలి వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అందె రాంబాబు
సూర్యాపేటటౌన్, న్యూస్‌లైన్: ప్రభుత్వం వికలాంగులకు అందిస్తున్న పింఛన్‌ను 500 నుంచి 1500కు పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు అందె రాంబాబు డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన తిరుగుబాటు రథయాత్ర శుక్రవారం సూర్యాపేటకు చేరుకున్నది. ఈ సందర్భంగా స్థానిక గాంధీ పార్కులో రథయాత్ర సభ నిర్వహించారు. రాంబాబు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వర్తింపజేస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదింప చేయాలన్నారు. చట్ట సభల్లో రిజర్వేషన్‌కు తీర్మానం చేసి పార్లమెంటుకు సిఫారసు చేయాలని చెప్పారు. వికలాంగుల అత్యాచార, అవమాన నిరోధక చట్టాన్ని అమలు చేయాలన్నారు. అర్హులైన వికలాంగులకు ఉచిత విద్యుత్, రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వం రాష్ట్రంలోని వికలాంగులైన కళాకారులు, క్రీడాకారులను గుర్తించి జాతీయ పోటీలకు ప్రోత్సహించాలన్నారు. వికలాంగులకు అంత్యోదయ కార్డులు, సదరన్ క్యాంపులు నిర్వహించాలన్నారు. ఈ నెల 28న సీఎం ఇల్లు ముట్టడి చేస్తున్నట్టు తెలిపారు. సంఘం జిల్లా నాయకుడు చింత సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వీహెచ్పీఎస్ జిల్లా ఇన్చార్జి లింగాల పెద్దన్న, అధ్యక్షుడు గడ్డం ఖాసీం, చింతల సైదులు, ఎర్ర వీరస్వామి, భూతం లింగయ్య, గరిగంటి రజిత, గిద్దె రాజేష్, విజయరావు, కుంచం సైదమ్మ, ఎండీ.జహీర్‌బాబా, కలింగరెడ్డి, నాగయ్య, కొరివి సైదులు, జలేందర్, నాగేశ్వర్రావు, పేర్ల సోమయ్య, వెంకన్న, భిక్షపతి, సైదులు పాల్గొన్నారు.