బస్ పాస్‌లు ఇచ్చేందుకు అమరచింతలో దివ్యాంగుల నుంచి జిరాక్స్ ప్రతులను తీసుకుంటున్న ఆర్టీసీ అధికారులు
అమరచింత: జిల్లాలోని దివ్యాంగుల కోసం ఆర్టీసీ అధికారులు బస్ పాస్‌లు ఇచ్చేందుకు సరికొత్త ప్రణాళిక రూపొందించారు. వైకల్యం కలిగిన ప్రతిఒక్కరికీ 50శాతం రాయితీతో కూడిన బస్ పాస్‌లను నేరుగా వారికే అందించాలని భావిస్తున్నారు. ఇందుకోసం జిల్లాలోని అన్ని గ్రామాలు, మండల మహిళా సమాఖ్య కార్యాలయాల్లో ఏపీఎంల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. వారి నుంచి ఆధార్ జిరాక్స్ కాపీ, సదరం సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోతో పాటు రూ.30 ఫీజును తీసుకుని దరఖాస్తు చేసుకున్నవారికి 24 గంటల వ్యవధిలోనే పాస్ అందజేస్తున్నారు.
దివ్యాంగుల కష్టాలకు చెల్లు !
జిల్లాలో మొత్తం 15,847 మంది దివ్యాంగుల్లో ఆర్థోపెడిక్ లోపం కలిగిన వారు 9,904 మంది, చూపు లేనివారు 2,059, చెవిటివారు 1,151, మానసిక వ్యాధిగ్రస్తులు 1414, ఇతర దివ్యాంగులు 1,271 మంది ఉన్నారు. డీఆర్‌డీఏ ద్వారా 11,053 మంది దివ్యాంగులు ఆసరా పింఛన్లు పొందుతున్నారు. వీరందరికీ తప్పనిసరిగా ప్రభుత్వపరంగా ఆర్టీసీ రాయితీ బస్సు పాసులు ఇవ్వాలని భావిస్తున్నారు. జిల్లాలోని దివ్యాంగులు ఆర్టీసీ బస్ పాస్‌లను పొందాలంటే నరకయాతన అనుభవించేవారు. ప్రతినెలా 27, 28 తేదీల్లోనే సాధారణ బస్ పాస్‌లతో పాటు దివ్యాంగులకు సైతం పాసులు ఇచ్చేవారు. దీంతో దివ్యాంగులు ఆయా డిపోల వద్ద గంటల తరబడి వేచి ఉండేవారు. ఇక వాటిని పొందాలంటేకష్టసాధ్యమని తెలుసుకున్న దివ్యాంగులు వాటిని తీసుకునేందుకు చాలామంది ఆసక్తిచూపేవారు కాదు. ఈ క్రమంలో ఇప్పటివరకు కేవలం 3500 మంది దివ్యాంగులు మాత్రమే ఆర్టీసీ రాయితీ పాసులు పొందుతున్నారు.
ప్రతి ఒక్కరికీ బస్‌పాస్ అందించాలి
40శాతం వైకల్యం ఉన్నవారికి మాత్రమే రాయితీ బస్ పాస్‌లు ఇస్తున్నారు. 40 కంటే తక్కువ శాతం ఉన్నవారికి కనీసం ఇవ్వాలి. దివ్యాంగులను ప్రభుత్వమే ఆదుకోవాలి. – కుర్మన్న, మస్తీపురం
ఇన్నాళ్లూ ఇబ్బందిపడ్డారు..
గతంలో దివ్యాంగుల ఆర్టీసీ రాయితీ బస్ పాస్‌లను పొందడానికి ఇబ్బందులు పడేవారు. నెలలో రెండు రోజులు మాత్రమే సాధారణ బస్ పాస్‌లతో పాటు దివ్యాంగులకు సైతం ఇస్తుండటంతో గంటల తరబడి వేచిచూస్తూ బాధపడేవాళ్లం. ఆర్టీసీ అధికారులు తీసుకున్న నిర్ణయంతో ప్రతిఒక్కరూ పొందుతున్నారు. – మాకం శ్రీనివాసులు, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు, తిప్పుడంపల్లి
Comments
Please login to add a commentAdd a comment