టోల్‌గేట్ సిబ్బంది దురుసు ప్రవర్తన
నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి టోల్‌గేట్ సిబ్బంది.. ఓ న్యాయమూర్తి కుటుంబం వెళ్తున్న కారుకు టోల్ ఫీజు చెల్లించినా జడ్జి గుర్తింపు కార్డు లాక్కోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. గురువారం ఓ జిల్లా జడ్జి కుటుంబ సభ్యులు కారులో ఖమ్మం వస్తున్నారు. ఈ క్రమంలో పైనంపల్లి టోల్‌గేట్ వద్ద డ్రైవర్.. న్యాయమూర్తి కారు అని చెప్పినా వినకుండా రుసుము చెల్లించాలని సిబ్బంది వాదనకు దిగారు.
దీంతో డ్రైవర్ రుసుము చెల్లించారు. ఆపై న్యాయమూర్తికి చెందిన గుర్తింపు కార్డు చూపించగా.. సిబ్బంది దానిని లాక్కుని ఒరిజినల్ కార్డా, కాదా? అని తెలుసుకుని తర్వాత పంపిస్తామని దురుసుగా బదులిచ్చారు. ఈ విషయం తెలియడంతో ఆ న్యాయ మూర్తి టోల్‌గేట్ వద్దకు వచ్చి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది.
సూర్యాపేట జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌తో పాటు నేలకొండపల్లి పోలీసులు సైతం వచ్చి రుసుము చెల్లించినా న్యాయమూర్తి ఐడీ కార్డు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం టోల్‌గేట్ సిబ్బంది నుంచి కార్డు తిరిగి తీసుకున్నారు. ఈ ఘటనపై టోల్‌గేట్ సిబ్బంది మాట్లాడుతూ, చాలామంది నకిలీ కార్డులతో వస్తుండటంతో అనుమానం వచ్చి అడిగామని చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment