దేశమంతటా ఒకే పన్ను విధానం | same tax procedure in national wide | Sakshi
Sakshi News home page

దేశమంతటా ఒకే పన్ను విధానం

Published Sat, Jun 24 2017 11:00 PM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM

దేశమంతటా ఒకే పన్ను విధానం

దేశమంతటా ఒకే పన్ను విధానం

- జూలై 1 నుంచి అమలు
– ‘సాక్షి’ ఆధ్వర్యంలో జీఎస్‌టీపై అవగాహన సదస్సు
– సందేహాలను నివృత్తి చేసిన కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వరరెడ్డి

ధర్మవరం : ప్రాంతానికో పన్ను, రాష్ట్రానికో పన్ను, దేశానికో పన్ను ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన ట్యాక్స్‌లు లేకుండా  దేశమంతటా ఒక్కటే ట్యాక్స్‌ అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ(వస్తు సేవా పన్ను) చట్టాన్ని తెస్తోందని కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. జీఎస్టీ జులై  నుంచి అమలుకానుంది. కేంద్రం, రాష్ట్రాలు వసూలు చేసే పరోక్ష పన్నుల స్థానంలో జీఎస్టీ ఒక్కటే ఉంటుంది. దీనిపై అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలోని ప్రణవ్‌ ఫంక‌్షన్‌ హాల్‌లో  శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు.

కార్యక్రమానికి కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వరరెడ్డి, ఏసీటీఓలు అమర్‌నాథ్‌రెడ్డి, బేబినంద, ఆడిటర్‌ విజయభాస్కర్‌రెడ్డి, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి మల్లికార్జున, కిరాణా మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పిన్ను ప్రసాద్, గోల్డ్‌షాపుల అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు స్టార్‌ ఖలీల్‌  పాల్గొన్నారు. సీటీఓ మాట్లాడుతూ ఈ నెల 25  నుంచి జీఎస్టీ పోర్టల్‌ ఓపెన్‌ అవుతుందని ప్రతిఒక్కరూ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు. ధర్మవరం సీటీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.  అనంతరం  వ్యాపారులు,  చేనేత ప్రముఖులు అడిగిన పలు సందేహాలను సీటీఓ నివృత్తి చేశారు.

ఆ వివరాలిలా....
ప్రశ్న: బంగారు కొనుగోలు చేసేందుకు పేదలు వస్తారు. వారు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ ఉండదు. మేము బంగారు అమ్మితే మాకు ట్యాక్స్‌ పడుతుంది. ఎలా వ్యాపారం చేయాలి? – గోల్డ్‌ ప్రసాద్, బంగారు వ్యాపారి, ధర్మవరం
సీటీఓ: ప్రతి వస్తువు కొనుగోలు, అమ్మకాలపై జీఎస్టీ ఉంటుంది. వ్యాపారస్తులు, కస్టమర్లు అందరూ జీఎస్టీ పరిధిలోకి రావాలనే ప్రభుత్వం జీఎస్టీ చట్టం తెచ్చింది.

ప్రశ్న: జీఎస్టీ రిజిస్ట్రేషన్‌కు ఎంత ఖర్చు అవుతుంది. ఎక్కడికి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి?– స్టార్‌ ఖలీల్, బంగారు దుకాణాల అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు
సీటీఓ:  సంబంధిత డాక్యుమెంట్లు, బిల్లులతో  సీటీఓ కార్యాలయానికి వస్తే ఉచితంగా జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ చేయిస్తాం.

ప్రశ్న: గతంలో ఏదైనా మిషనరీ కొనుగోలు చేస్తే టిన్‌ నంబర్‌ అడిగేవారు. ప్రస్తుతం జీఎస్టీతోపాటు టిన్‌ నంబర్‌ కూడా అవసరమా? – మల్లికార్జున, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి
సీటీఓ: వ్యాపారులు  జీఎస్టీలోకి వచ్చిన తర్వాత టిన్‌ నంబర్‌ అవసరంలేదు. కేవలం జీఎస్టీ మాత్రమే వర్తిస్తుంది.

ప్రశ్న: రూ.20 లక్షలు దాటితేనే జీఎస్టీ పరిధిలోకి అంటున్నారు. అంతకన్నా తక్కువైతే జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ అవసరంలేదా?  కొంత మెటీరియల్‌ డ్యామేజ్‌ అయింది. జీఎస్టీకి చూపాలా? – లక్ష్మీనారాయణ, పెయింట్స్‌ అండ్‌ హార్డ్‌వేర్, అనంతపురం
సీటీఓ: రూ.20 లక్షలు దాటితేనే జీఎస్టీ పరిధిలోకి వస్తారు. వ్యాపారంలో ప్రతి ఏడాది పెరగవచ్చు. తగ్గవచ్చు. అలాంటప్పుడు మీరు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే మీ వ్యాపారానికి మంచిది. జీఎస్టీ పరిధిలో లేకపోతే మీతో వ్యాపారం చేసేందుకు మీ దుకాణానికి పెయింట్స్, హార్డ్‌వేర్‌ ఇచ్చేందుకు కంపెనీవారు సుముఖత చూపరు. జీఎస్టీ పరిధిలో ఉంటేనే సరుకు ఇస్తారు. ఈ నెల 30వ తేదీకి మీ వద్దవున్న స్టాకు వివరాలన్నీ జీఎస్టీలోకి అప్‌లోడ్‌ చేయాల్సిందే.  

ప్రశ్న: చేనేత మగ్గాలకు ముడిసరుకులు కొన్నప్పుడు జీఎస్టీ వేస్తారు. కొన్నవారు కూడా జీఎస్టీ పరిధిలోకి వస్తారా? రిజిస్ట్రేషన్‌ లేనివారి వద్ద కొంటే జీఎస్టీ ఎలా అమలవుతుంది? – గిర్రాజు రవి, చేనేత వ్యాపారుల  సంఘం నాయకులు
సీటీఓ: చేనేత చీరలకు 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ముడిసరుకులు కొన్నప్పుడు జీఎస్టీ వేస్తారు. కొన్నవారు కూడా చీర తయారైనప్పుడు అమ్మే సమయంలో జీఎస్టీ వర్తిస్తుంది. చేనేత కార్మికులకు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ ఉండదు కాబట్టి రిజిస్ట్రేషన్‌ లేనివారి వద్దకొంటే చీరలను కొనుగోలు చేసిన వ్యాపారి జీఎస్టీ ట్యాక్స్‌ కట్టాలి.

ప్రశ్న: వంద మగ్గాలుండే వ్యక్తి కూడా జీఎస్టీ పరిధిలో లేకుండా స్థానికంగానే పట్టుచీరలను శిల్క్‌హౌస్‌లకు వేసి విక్రయిస్తారు. అప్పుడు ట్యాక్స్‌ ఎలా ఎవరు చెల్లిస్తారు?– బీరే ఎర్రిస్వామి, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్, ధర్మవరం

సీటీఓ: చేనేతకు 5 శాతం జీఎస్టీ ట్యాక్స్‌ ఉంది. వంద మగ్గాలుండే వ్యక్తి వద్ద జీఎస్టీ లేకుండా వ్యాపారి చీరలు కొంటే రివర్స్‌ ట్యాక్స్‌ మేనేజ్‌మెంట్‌ కింద అమ్మిన వ్యక్తి ట్యాక్స్‌తోపాటు వ్యాపారి ట్యాక్స్‌ రెండూ కట్టాల్సి ఉంటుంది.

ప్రశ్న: ఒక్కో సంవత్సరం వ్యాపారం తగ్గవచ్చు. రూ.20 లక్షలకు తక్కువగా ఉన్నప్పుడు ట్యాక్స్‌ కట్టాలంటే వ్యాపారి నష్టపోతాడు. ఎలా? – చందమూరు నారాయణరెడ్డి కౌన్సిలర్‌
సీటీఓ: ఒక ఏడాది రూ.20 లక్షలకుపైగా వ్యాపారం జరిగితే జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వ్యాపారికి మరో ఏడాది అంతకన్నా  ఎక్కువ వ్యాపారం జరిగితే ఆ సమయంలో ఎంత టర్నోవర్‌ చేస్తారో వాటికి మాత్రమే ట్యాక్స్‌ పడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement