సొమ్ము ఎవరిదో.. సోకూ వారిదే!
- కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్రాల బడ్జెట్‌లో పేర్కొనాల్సిందే
- వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే అమలు!
- బడ్జెట్ల రూపకల్పనలపై అన్ని రాష్ట్రాలకు నీతి ఆయోగ్ నూతన మార్గదర్శకాలు జారీ
సాక్షి, హైదరాబాద్: 'ఫలానా సంక్షేమ పథకానికి ఇంత ఖర్చు చేస్తున్నాం.. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ఇన్ని కోట్లు కేటాయించాం..' అంటూ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఘనంగా చదివే బడ్జెట్ పద్దులపై ఇక ముందు కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్ లలో.. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద అందిస్తున్న నిధులను తప్పనిసరిగా విడిగా పేర్కొనాలని చెప్పింది. తద్వారా ఏ పథకానికి ఏ ప్రభుత్వం(కేంద్రం, రాష్ట్రం) ఎంతెంత నిధులిచ్చింది సులువుగా వెల్లడవుతుందని పేర్కొంది. ఈ మేరకు బడ్జెట్ కేటాయింపులు, బడ్జెట్ స్వరూపంలో మార్పులకు సంబంధించి నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాలకు మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. వచ్చే ఏడాది నుంచి జీఎస్టీ చట్టం అమలు కానున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు కీలకంగా మారాయి.
ఫలానా పథకానికి ఇన్ని నిధులు కేటాయిస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేసుకోవడం ఇకపై కుదరదని, కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లలో ప్రత్యేకంగా పేర్కొనాల్సి ఉంటుందని, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు నిధులిస్తోంది. వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పింఛన్లకు నిధులు అందజేస్తోంది. విద్య, వైద్య ఆరోగ్యం, సాగునీరు, పౌష్టికాహారం, అంగన్‌వాడీ కేంద్రాలతోపాటు మరెన్నో కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తోంది. అలాగే ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రాంట్లను ఇస్తోంది. అయితే, ఏపీతోపాటు కొన్ని రాష్ట్రాలు కేంద్రం ఇస్తున్న నిధులకు మరికొంత సొమ్ము జోడించి ఆయా కార్యక్రమాలకు ఇన్ని నిధులు కేటాయించమంటూ బడ్జెట్‌లో పేర్కొంటున్నాయి.
నిధుల్లో సింహభాగం కేంద్రానివే అయినప్పటికీ క్రెడిట్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే దక్కుతుండటం గమనార్హం. అందుకే ఈ విధానంలో మార్పులు తీసుకురావాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే నీతి ఆయోగ్ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్ పద్దులో తప్పనిసరిగా పేర్కొనాలి. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు రాష్ట్రాలకు ఏ కార్యక్రమానికి ఎన్ని నిధులను కేటాయించాయనే వివరాలను రాష్ట్రాల బడ్జెట్‌లో పొందుపరచాలని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. దీనివల్ల పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులెన్ని, రాష్ట్ర సర్కారు ఇస్తున్న నిధులెన్నో రాష్ట్రాల బడ్జెట్‌ల ద్వారా తెలిసిపోతుంది. సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అనే వ్యవహారానికి చెక్ పేట్టేందుకే కేంద్రం ఈ మార్పులు చేసిందని అధికార వర్గాలు తెలిపాయి.