జీఎస్‌టీతో 10 శాతం ఆర్థిక వృద్ధి సాధ్యం
సాక్షి, న్యూఢిల్లీ: జూలై 1 నుంచి అమలు కానున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) దేశంలో సరికొత్త ఆర్థిక విప్లవానికి నాందిపలకనుందని, దీని ద్వారా ప్రస్తుతం 7.6% ఉన్న ఆర్థికవృద్ధి భవిష్యతులో 9–10%కి చేరుతుందని నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త సంస్కరణల వైపు పయనించనుందన్నారు. మంగళవారం ఢిల్లీలో ఏసర్, ట్యాలీ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో వాణిజ్య వ్యాపారులకు సులభంగా జీఎస్టీపై సమగ్ర అవగాహన, నిర్దిష్టమైన వ్యాపార లావాదేవీలను కలిగి ఉండే విధంగా రూపొందించిన ప్రీ లోడెడ్ ట్యాలీ సాఫ్ట్‌వేర్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ఆవిష్కరణ కార్యక్రమంలో అమితాబ్ కాంత్ పాల్గొన్నారు.
అఖిల భారత పరిశ్రమల సమాఖ్య అధ్వర్యంలో ట్యాలీ సొల్యూషన్స్ అందించిన జీఎస్టీ పన్ను ఆధారిత ట్యాలీ సాఫ్ట్‌వేర్‌తో ఏసర్ కొత్త కంప్యూటర్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ద్వారా వ్యాపారులు తమ వాణిజ్య లావాదేవీలను, జీఎస్టీ పన్నుల చెల్లింపు విధివిధానాలను సులభతరంగా అర్థం చేసుకొనే వీలుకలుగుతుంది. వ్యాపారుల సౌలభ్యం కోసం ఏసర్, ట్యాలీ చేసిన ఈ ప్రయాత్నానికి ఆమిత్‌కాంత్ అభినందించారు. కార్యక్రమంలో ఏసర్ ఇండియా ఎండీ హరీష్ కోహ్లీ, ట్యాలీ సొల్యూషన్స్ ఎక్యిక్యూటివ్ డైరెక్టర్ తేజస్ గోయెంకా, అఖిల భారత పరిశ్రమల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖన్డెవాల్ పాల్గొన్నారు.
బ్యాంకుల విలీనంపై నీతి ఆయోగ్ అధ్యయనం
ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంపై కసరత్తు చేస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ .. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను మదింపు చేసేందుకు నీతి ఆయోగ్‌తో పాటు అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థల సహకారం కూడా తీసుకుంటోంది. సుమారు నెల రోజుల్లో నీతి ఆయోగ్ దీనిపై నివేదికనివ్వొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.