
న్యూఢిల్లీ: పేటెంట్ హక్కుల పరిధిలో ఉన్న ఔషధాలను దేశీయంగా తయారు చేయడాన్ని కేంద్ర సర్కారు ప్రోత్సహించే ఆలోచనతో ఉంది. ఇందుకు వీలుగా విధానాన్ని తీసుకురావాలని అనుకుంటున్నట్టు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ఫార్మా, వైద్య పరికరాలపై ఏడో అంతర్జాతీయ సదస్సు ఆరంభానికి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.
ఈ సదస్సు ఈ నెల 25 నుంచి 27 వరకు జరగనుంది. జనరిక్ ఔషధ తయారీలో ప్రపంచ కేంద్రంగా భారత్ ఇప్పటికే అవతరించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ పరిధిని దాటుకుని మరింత ముందుకు వెళ్లాలని, పేటెంట్ ఔషధాలను కూడా తయారు చేయాలని మంత్రి ఆకాంక్షించారు. ‘‘నేడు భారత్ 3,500కు పైనా ఫార్మా కంపెనీలు, 10,500కు పైన తయారీ యూనిట్లతో అత్యధిక జనరిక్ ఔషథ తయారీ కంపెనీలకు కేంద్రంగా ఉంది.
యూఎస్‌లో వినియోగించే ప్రతి నాలుగు ఔషధాల్లో ఒకటి భారత్‌లో తయారు చేసిందే. భారత్‌లో పేటెంటెడ్ ఔషధాల తయారీని ప్రోత్సహించడం ఎలా? దీన్ని ప్రోత్సహించే విధానాన్ని తీసుకురావడంపై ఆలోచన చేస్తున్నాం’’అని మంత్రి వివరించారు. పేటెంటెడ్ ఔషధాల తయారీని ప్రోత్సహించేందుకు పరిశోధన, ఆవిష్కరణలు అవసరమన్నారు.
చదవండి: భారత్‌కు మధ్యంతర నిర్మాణాత్మక సమస్యల్లో అవి కూడా: ఐఎంఎఫ్