ఆస్పత్రుల్లోని అవినీతి తెలుసు!
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్
న్యూఢిల్లీ: వైద్య, ఆరోగ్య రంగంలో అవినీతిని సహించేది లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తేల్చి చెప్పారు. వైద్యరంగంలో నెలకొని ఉన్న వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత అవినీతిని సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో దేశంలోని అన్ని కేంద్ర ఆసుపత్రుల్లోని అన్ని రకాల వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ‘ఆస్పత్రుల్లో ఎన్ని రకాలుగా అవినీతి జరుగుతుందో డాక్టరుగా నాకు తెలుసు. ఆస్పత్రి సామగ్రి కోసం సప్లైయర్ల నుంచి లంచం తీసుకోవడం నుంచి రోగులకు సేవలందించేందుకు డబ్బులు తీసుకోవడం వరకు అంతా అవినీతే.
ఉద్యోగులు, వీఐపీలకు బెడ్లను రిజర్వ్ చేయడం, ప్రత్యేకంగా సౌకర్యాలు అందించడం అవినీతి కిందకే వస్తుంది. వీటన్నింటినీ సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అన్నారు. తన శాఖలో 500% పారదర్శకతను తీసుకురావడంతో పాటు అవినీతికి అసలేమాత్రం సహించబోనని మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజే స్పష్టం చేశానన్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్(సీవీఓ)గా ఉన్న సంజీవ్ చతుర్వేదిని తొలగించడంపై వస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ.. సీవీఓగా చతుర్వేది నియామకాన్ని సీవీసీ వ్యతిరేకించిందని తెలిపారు.