Health Minister Reviews Covid Situation Amid Sudden Spurt In Cases Worldwide - Sakshi
Sakshi News home page

Covid Alert: కరోనా ముప్పు ముగియలేదు.. మళ్లీ మాస్కులేద్దాం

Published Thu, Dec 22 2022 1:45 AM | Last Updated on Thu, Dec 22 2022 9:08 AM

Health minister reviews Covid situation amid sudden spurt in cases worldwide - Sakshi

న్యూఢిల్లీ: చైనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో మహమ్మారి వ్యాప్తి, తాజా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ బుధవారం సీనియర్‌ అధికారులు, ఆరోగ్య నిపుణులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

అంతర్జాతీయంగా బీఎఫ్‌ 7 సబ్‌ వేరి యంట్‌ వ్యాప్తి గురించి వివరించారు. కరోనా ముప్పు ఇంకా ముగిసిపోలేదని, ప్రజలంతా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని, అర్హులైనవారంతా కరోనా వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసు కచ్చితంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనావిషయంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. కోవిడ్‌–19 వ్యాప్తిని తేలిగ్గా తీసుకోవద్దని చెప్పారు. పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, మహమ్మారిపై నిఘాను బలోపేతం చేయాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. 

కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చినా ఎదుర్కొందాం 
చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, అమెరికా తదితర దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, ఫలితంగా అక్కడి ప్రభుత్వాలకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని మన్‌సుఖ్‌ మాండవీయ గుర్తుచేశారు. మన దేశంలో పండుగ సీజన్‌ రాబోతున్న దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలన్నారు. కోవిడ్‌–19లో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చినా సమర్థవంతంగా నియంత్రించేలా వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పాజిటివ్‌ కేసుల నమూనాలను జినోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయడం ద్వారా కొత్త వేరియంట్లను గుర్తించవచ్చని వివరించారు. ఇందుకు ఇండియన్‌ సార్క్‌–కోవ్‌–2 జినోమిక్స్‌ కన్సార్టియం(ఇన్సాకాగ్‌) నెట్‌వర్క్‌ను ఉపయోగించాలని చెప్పారు. ఇన్సాకాగ్‌కు చెందిన జినోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌లకు పాజిటివ్‌ కేసుల నమూనాలను రోజువారీగా పంపించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు. కోవిడ్‌–19 నియంత్రణ కోసం ఈ ఏడాది జూన్‌లో జారీ చేసిన ‘ఆపరేషనల్‌ గైడ్‌లైన్స్‌’ను ప్రభావవంతంగా అమలు చేయాలన్నారు. 

ఆందోళన అవసరం లేదు: వీకే పాల్‌ 
దేశంలో అర్హులైన వారిలో ఇప్పటిదాకా కేవలం 27–28 శాతం మంది కరోనా టీకా బూస్టర్‌ డోసు తీసుకున్నారని నీతి ఆయోగ్‌ సభ్యుడు(ఆరోగ్యం) డాక్టర్‌ వీకే పాల్‌ తెలిపారు. సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మిగిలినవారు వీలైనంత త్వరగా బూస్టర్‌ తీసుకోవాలని చెప్పారు. అలాగే జనం గుమికూడేచోట మాస్కు ధరించాలన్నారు. ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు, వృద్ధులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. అంతర్జాతీయ విమాన ప్రయాణాల నియమ నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవని పేర్కొన్నారు.

దేశంలో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా కొత్త కేసులు నమోదవుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ నెల 20న దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 84% కేసులు ఈ 5 రాష్ట్రాల్లోనే బయటపడ్డాయని పేర్కొన్నారు. దేశంలో నమోదవుతున్న కేసులన్నీ తక్కువ తీవ్రత కలిగినవేనని స్పష్టం చేశారు. కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ వచ్చేవారం మరోసారి సమీక్ష నిర్వహించనుంది.
చదవండి: ఢిల్లీలో రేపు అత్యవసర కరోనా సమీక్ష సమావేశం   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement