న్యూఢిల్లీ: ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో దేశంలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు 87%, పీజీ మెడికల్ సీట్లు 105% పెరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. గురువారం ఆయన పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడారు. దేశంలో యువతకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం 2014 తర్వాత పలు చర్యలు చేపట్టిందన్నారు. ఫలితంగా, 2014లో 387 మెడికల్ కాలేజీలుండగా, 2022 కల్లా వాటి సంఖ్య 648కి పెరిగిందన్నారు.
2014 తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 96%, ప్రైవేట్ కళాశాలల సంఖ్య 42% పెరిగిందని చెప్పారు.ప్రస్తుతం దేశంలో 355 ప్రభుత్వ, 293 ప్రైవేట్ వైద్య కళాశాలలున్నాయని తెలిపారు. అదేవిధంగా, 2014లో ఎంబీబీఎస్ కాలేజీల్లో 51,348 సీట్లుండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 96,077కు చేరిందన్నారు. 2014లో 31,185 పీజీ మెడికల్ సీట్లుండగా, 2022కు వచ్చే సరికి అవి 63,842కు పెరిగినట్లు చెప్పారు.
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను 10వేలకు పెంచాలనే లక్ష్యంతో 16 రాష్ట్రాల్లోని 58 కాలేజీలకు గాను 3,877 ఎంబీబీఎస్ సీట్ల పెంపుదలకు ఆమోదం తెలిపామన్నారు. ఇదే విధంగా, 21 రాష్ట్రాల్లోని 72 మెడికల్ కాలేజీల్లో మొదటి దశలో 4,058 పీజీ సీట్ల పెంపునకు అనుమతించినట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన(పీఎంఎస్‌ఎస్‌వై) ద్వారా 22 కొత్త ఎయిమ్స్ ఏర్పాటుకు, 75 ప్రభుత్వ వైద్య కళాశాలల ఆధునీకరణ పనులను చేపట్టినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment