3 కోట్ల మందికి ఉచిత టీకా | 3 Crore On Frontline To Get Free Vaccine In 1st Phase | Sakshi
Sakshi News home page

3 కోట్ల మందికి ఉచిత టీకా

Published Sun, Jan 3 2021 4:12 AM | Last Updated on Sun, Jan 3 2021 11:50 AM

3 Crore On Frontline To Get Free Vaccine In 1st Phase - Sakshi

డ్రైరన్‌ ప్రక్రియను పరిశీలించేందుకు ఢిల్లీలోని తేజ్‌ బహదూర్‌ ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌

న్యూఢిల్లీ: దేశంలో తొలి విడత కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా 3 కోట్ల మందికి ఉచితంగా టీకా ఇస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు. కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకి వ్యాక్సిన్‌ ఇవ్వడంలో తొలి ప్రాధాన్యం ఉంటుందన్నారు. కోటి మంది వైద్య సిబ్బంది, మరో 2 కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు తొలి విడతలో టీకా వేస్తామని శనివారం ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. టీకా తీసుకోవడానికి అర్హులైన 27 కోట్ల మందికి జూలైలోగా టీకా పంపిణీ పూర్తి చేస్తామని చెప్పారు.

ఇప్పటికే టీకా లబ్ధిదారుల జాబితా రూపొందించడానికి కసరత్తు జరుగుతోందన్నారు. శనివారం ఢిల్లీలోని టీకా డ్రైరన్‌ కార్యక్రమ నిర్వహణను రెండు ఆస్పత్రుల్లో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా టీకా భద్రతపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని అన్నారు. సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ తయారు చేస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ సిఫారసు చేసిన మర్నాడే ఆరోగ్య మంత్రి తొలి విడతలో ఉచితంగా టీకా పంపిణీ చేస్తామని చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.  

వదంతులు నమ్మొద్దు  
దేశవ్యాప్తంగా కరోనా టీకా డ్రై రన్‌ జరుగుతున్న నేపథ్యంలో టీకా భద్రత, సామర్థ్యంపై వస్తున్న వదంతుల్ని నమ్మవద్దని మంత్రి హర్షవర్ధన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్‌ పూర్తిగా సురక్షితమైనదేనని హామీ ఇచ్చారు. వ్యాక్సిన్‌కు ఆమోద ముద్ర వేసే ముందు దానిని పరీక్షించడంలోనూ, ప్రొటోకాల్‌ నిబంధనలు అనుసరించడంలో ఎలాంటి రాజీ ఉండదని చెప్పారు. వ్యాక్సిన్‌ సైడ్‌ అఫెక్ట్‌లపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు.

ఒకసారి వ్యాక్సినేషన్‌ మొదలయ్యాక టీకా భద్రతపైనున్న అనుమానాలు తొలగిపోయి నమ్మకం వస్తుందని మంత్రి అన్నారు. పోలియా వ్యాక్సిన్‌ సమయంలోనూ అందరిలోనూ సందేహాలు ఉండేవని, ఆ తర్వాత అన్నీ తొలగిపోయాయన్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అత్యంత భారీగా టీకా పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడంలో భారత్‌కు బాగా అనుభవం ఉందని అన్నారు. మారుమూల గ్రామంలో నివసించే ప్రజలకి కూడా టీకా అందేలా పకడ్బందీగా ప్రణాలికలు సిద్ధం చేశామన్నారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాలూ సన్నద్ధంగా ఉన్నాయన్న హర్షవర్ధన్‌ వచ్చేవారంలోనే వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభం కానుందని చెప్పారు.

డ్రైరన్‌ సక్సెస్‌
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ సిఫారసు చేసిన నేపథ్యంలో శనివారం దేశవ్యాప్తంగా డ్రై రన్‌ విజయవంతంగా పూర్తయింది. దేశంలో మొదలు కానున్న భారీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ఎదురయ్యే సవాళ్లను గుర్తించడం కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డ్రై రన్‌ నిర్వహించారు. రాష్ట్రాల రాజధానుల్లో కనీసం మూడు ప్రాంతాల్లో టీకా డ్రై రన్‌ జరిగింది. టీకా పంపిణీ చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కొరత ఉన్న కొన్ని రాష్ట్రాల్లో రాజధానులతో పాటు జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మహారాష్ట్ర, కేరళ, గుజరాత్‌ నాలుగు జిల్లాల్లో డ్రై రన్‌ నిర్వహిస్తే, కర్ణాటక, తమిళనాడు అయిదు జిల్లాల్లోనూ, రాజస్థాన్‌ ఏడు జిల్లాల్లోనూ నిర్వహించింది. ఈ పైలెట్‌ రన్‌లో అతి పెద్ద సమస్యలేవీ ఎదురు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. డిసెంబర్‌ 28, 29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, అసోం, పంజాబ్‌లో డ్రైరన్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎదురైన సమస్యల్ని పరిష్కరిస్తూ శనివారం నాటి డ్రై రన్‌కు మార్గదర్శకాల్ని సవరించారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ డ్రై రన్‌లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement