international travelers
-
ఆకాశ వీధిలో బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌దే హవా
దేశీయంగా చౌక విమానయాన సంస్థల (బడ్జెట్ ఎయిర్‌లైన్స్–ఎల్సీసీ) హవా కొనసాగుతోంది. అంతర్జాతీయ ట్రావెల్ డేటా సంస్థ ఓఏజీ తాజా గణాంకాల ప్రకారం ఎల్‌సీసీల మార్కెట్ వాటా అత్యధికంగా ఉన్న టాప్ 10 దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. మొత్తం సీట్ల సామర్థ్యంలో ఇండిగో సారథ్యంలోని ఎల్సీసీలకు ఏకంగా 71 శాతం వాటా ఉంది. అంతర్జాతీయంగా చూస్తే భారత్‌కు సమీప పోటీదారు ఇండోనేసియాలో ఇది 64 శాతమే. ఈ విషయంలో అంతర్జాతీయ సగటు 34 శాతంగానే ఉంది. ప్రపంచంలోనే టాప్‌లో ఉన్న నాలుగు విమానయాన సంస్థలు ఎల్సీసీలే కావడం గమనార్హం. సౌత్‌వెస్ట్, రయాన్ఎయిర్, ఇండిగో, ఈజీజెట్ ఈ లిస్టులో ఉన్నాయి. 2019 నుంచి అంతర్జాతీయంగా ఎల్‌సీసీల వాటా 13 శాతం మేర పెరిగింది. సంపన్న దేశాలు, చైనాలో ఎఫ్‌ఎస్‌సీలు .. ఇతర దేశాలను చూసినప్పుడు, అతి పెద్ద ఎయిర్‌లైన్స్ మార్కెట్లలో ఒకటైన చైనాలో ఫుల్ సరీ్వస్ ఎయిర్‌లైన్స్‌దే (ఎఫ్ఎస్సీ) హవా ఉంటోంది. అక్కడ ఎల్‌సీసీల మార్కెట్ వాటా కేవలం 12 శాతమే. ఇక బ్రిటన్ మార్కెట్లో పరిస్థితి కాస్త అటూ ఇటుగా ఉంది. ఎఫ్ఎస్సీలతో పోలిస్తే ఎల్సీసీలకు కాస్త మొగ్గు ఎక్కువగా ఉంది. రయాన్ఎయిర్, ఈజీజెట్, విజ్ ఎయిర్ వంటి ఎల్‌సీసీలు అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఎఫ్ఎస్సీలతో పోలిస్తే ఎల్‌సీసీల మార్కెట్ వాటా ఎక్కువగా ఉన్న దేశాలను పరిశీలిస్తే లాటిన్ అమెరికాలో బ్రెజిల్, యూరప్‌లో ఇటలీ, స్పెయిన్ మొదలైనవి ఉన్నాయి. అమెరికా, జర్మనీ, జపాన్ వంటి సంపన్న దేశాల్లో ఎఫ్ఎస్సీలదే ఆధిపత్యం ఉంటోంది. ఫుల్ సరీ్వస్ క్యారియర్లు ఇంకా కరోనా పూర్వ స్థాయికి కోలుకోవాల్సి ఉంది. ఇండిగో భారీగా విస్తరించడం భారత్‌లో ఎల్‌సీసీల మార్కెట్ వాటా వృద్ధికి దోహదపడింది. ఈ ఏడాది జూలై గణాంకాల ప్రకారం దేశీ ప్యాసింజర్ మార్కెట్లో ఇండిగో సంస్థకు 62 శాతం వాటా ఉంది. ఎల్సీసీ విభాగంలో పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇతర ఆదాయంపరంగా సవాళ్లు.. మార్కెట్ వాటాను విస్తరించుకుంటున్నప్పటికీ దేశీయంగా ఎల్‌సీసీలు అనుబంధ ఆదాయాలను మాత్రం పెంచుకోలేకపోతున్నాయి. సీట్లను బట్టి ఫీజులు, ఆహారం, స్పెషల్ చెకిన్లు, సీట్ అప్గ్రేడ్లు, ఎక్స్ట్రా లగేజీ చార్జీలపరమైన ఆదాయం అంతంతే ఉంటోంది. దీన్ని పెంచుకునే అవకాశాలు పరిమితంగానే కనిపిస్తున్నాయి. 2022లో ఇండిగో మొత్తం ఆదాయంలో ఇతరత్రా అనుబంధ ఆదాయం వాటా 7.1 శాతమే. ఈ విషయంలో మొత్తం 64 ఎయిర్‌లైన్స్‌లో ఇండిగో 54వ స్థానంలో ఉంది. అదే అంతర్జాతీయంగా టాప్ 10 ఎల్‌సీసీలను చూస్తే .. రయాన్ఎయిర్ గ్రూప్ ఆదాయాల్లో అనుబంధ ఆదాయం వాటా 35.7 శాతంగా ఉంది. అదే ఈజీజెట్ను చూస్తే ఇది 33.9 శాతంగా, సౌత్‌వెస్ట్ విషయంలో 24.9 శాతంగా ఉంది. ఈ విషయంలో ఇండిగో ఎక్కడో వెనకాల ఉండటం గమనార్హం. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
దేశీ విమాన ప్రయాణికుల్లో వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా మే నెలలో 1.39 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2023 మే నెలతో పోలిస్తే ఇది 5.1 శాతం అధికం. కోవిడ్ ముందస్తు కాలంతో పోలిస్తే 14 శాతం ఎక్కువ అని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదిక వెల్లడించింది. ఏప్రిల్‌లో 1.32 కోట్ల మంది రాకపోకలు సాగించారు. 2024–25లో ట్రెండ్ కొనసాగుతుందని ఇక్రా భావిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌లో సానుకూల ధోరణి కొనసాగుతుందని పేర్కొంది. నివేదిక ప్రకారం.. గత నెలలో వియానయాన సంస్థల సామర్థ్యం 2023 మే నెలతో పోలిస్తే 6 శాతం, 2024 ఏప్రిల్‌తో పోలిస్తే 2 శాతం పెరిగింది. భారత్ నుంచి 2023–24లో 24 శాతం అధికంగా 2.97 కోట్ల మంది విదేశీయానం చేశారు. పరిశ్రమ కోవిడ్‌కు ముందు స్థాయిల కంటే అధిక రాబడి అందుకుంది. -
చైనా నుంచి వస్తే నెగటివ్ రిపోర్ట్ తప్పనిసరి
న్యూఢిల్లీ: చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణకొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చే విమానప్రయాణికులు కచ్చితంగా ముందుగా కోవిడ్ నెగటివ్ రిపోర్ట్‌ను సమర్పించాలని భారత్ నిబంధన పెట్టింది. జనవరి ఒకటో తేదీ నుంచి దీనిని అమలుచేస్తారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం చెప్పారు. అక్కడి నుంచి బయల్దేరడానికి ముందే ఎయిర్‌సువిధ పోర్టల్‌లో సంబంధిత రిపోర్ట్‌ను అప్లోడ్ చేయాలి. ఆ ఆర్టీ–పీసీఆర్ రిపోర్ట్ బయల్దేరడానికి 72 గంటలముందు చేసినదై ఉండాలి. ఒక్కో అంతర్జాతీయ విమానంలోని ప్రయాణికుల్లో 2 శాతం మందికి ర్యాండమ్‌గా ఇక్కడికొచ్చాక టెస్ట్చేస్తామని మంత్రి చెప్పారు. కాగా, భారత్‌లో గత 24 గంటల్లో 268 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 3,552కు చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు కేవలం 0.11 శాతంగా ఉంది. చైనా ప్రయాణికులపై అమెరికా సైతం.. 72 గంటల్లోపు సిద్ధమైన కరోనా నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే అమెరికాలో అడుగుపెట్టాలని చైనా నుంచి రాబోయే అంతర్జాతీయ ప్రయాణికులకు అమెరికా సూచించింది. ఏ దేశ పౌరుడు, వ్యాక్సినేషన్ పూర్తయిందా లేదా అనే వాటితో సంబంధంలేకుండా ప్రతిఒక్కరికీ జనవరి ఐదు నుంచి ఇవే నిబంధనలు వర్తిస్తాయని అమెరికా తెలిపింది. ‘ ఆంక్షలు పెట్టినంతమాత్రాన చైనా నుంచి వైరస్ వ్యాప్తి అమెరికాలోకి ఆగదు. అయితే, చైనాలో కోవిడ్ పరిస్థితిపై మరింత సమాచారం రాబట్టేందుకు, చైనాపై ఒత్తిడి పెంచేందుకే అమెరికా ఇలా చేస్తోంది’ అని జాన్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో వ్యాధుల నిపుణుడు డాక్టర్ డేవిడ్ డౌడీ అభిప్రాయపడ్డారు. చైనా నుంచి సమాచారం సంగతి పక్కనబెట్టి సొంతంగా కోవిడ్ కట్టడి వ్యూహాలకు అమెరికా మరింత పదును పెట్టాలని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో వ్యాధుల నిపుణుడు డాక్టర్ స్ట్రాట్ క్యాంపబెల్ హితవుపలికారు. -
Covid-19: వారికి ఆర్టీపీసీఆర్ తప్పనిసరి
గాంధీనగర్/న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం నడుంబిగించింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశం ఉండటంతో వారిపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ–పీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం చెప్పారు. వారికి ఎయిర్‌పోర్టుల్లోనే థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. జ్వరంతో బాధపడుతూ పాజిటివ్‌గా తేలితే క్వారంటైన్‌కు తరలిస్తారు. వాళ్లు ముందుగానే ఎయిర్ సువిధ పోర్టల్‌లో దరఖాస్తును నింపాల్సి ఉంటుంది. ర్యాండమ్‌గా 2% ప్రయాణికులకు టెస్ట్ ఎయిర్‌పోర్ట్‌లో భారత్‌కు చేరుకున్న ప్రయాణికుల్లో ఒక్కో అంతర్జాతీయ విమానంలో ర్యాండమ్‌గా రెండు శాతం చొప్పున ప్రయాణికులకు కరోనా టెస్ట్ చేయడం శనివారం నుంచి తప్పనిసరి చేశామని మాండవీయ వెల్లడించారు. ఈ నిబంధనలతో కొత్తరకం వేరియంట్ వ్యాప్తిని కనుగొనేందుకు, ముందుగా అప్రమత్తమయ్యేందుకు అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, గోవా, ఇండోర్, పుణె ఎయిర్‌పోర్టుల్లో అంతర్జాతీయ విమానాల్లో దిగిన ప్రయాణికుల్లో 2 శాతం మందికి టెస్టులు చేశారు. అంటే ఒక్కో విమానం నుంచి దిగిన ప్రయాణికుల సంఖ్యలో 2 శాతం మందిని ర్యాండమ్‌గా ఎంపికచేసిన వారికి కోవిడ్ టెస్ట్ చేస్తారు. పౌర విమానయాన శాఖ గణాంకాల ప్రకారం శుక్రవారం 29 అంతర్జాతీయ విమానాల్లో 87వేలకుపైగా ప్రయాణికులు భారత్‌లో అడుగుపెట్టారు. టెస్ట్‌కు అయ్యే ఖర్చును ప్రయాణికుడు భరించనక్కర్లేదు. శాంపిళ్లు ఇచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లిపోవచ్చు. జ్వరంగా ఉండి పాజిటివ్‌గా తేలితే క్వారంటైన్ తప్పదు. రాష్ట్రాలకు కేంద్రం లేఖ ఆక్సిజన్ సిలిండర్లతోపాటు వెంటిలేటర్లు, బీఐపీఏపీ తదితరాలను సిద్దం చేసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ‘‘ద్రవ మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లు, లైఫ్ సపోర్ట్ పరికరాలు అవసరమైనన్ని అందుబాటులో ఉండేలా చూసుకోండి. ఈఎస్ఏ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు సమర్థంగా పనిచేస్తున్నాయో లేదో చూసుకోండి’’ అని సూచించారు. కొత్తగా 201 కేసులు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 201 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,397గా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.15 శాతంగా, వారపు పాజిటివిటీ రేటు 0.14 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగింది. -
ఎయిర్టెల్ యూజర్లకు శుభవార్త!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విదేశీ ప్రయాణం చేసేవారి కోసం ఎయిర్టెల్ వరల్డ్ పాస్ పేరుతో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌ను పరిచయం చేసింది. ఈ ప్యాక్‌తో కస్టమర్లు 184 దేశాల్లో రోమింగ్ సేవలను పొందవచ్చు. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్‌లోనూ ఇవి లభిస్తాయి. ఇంటర్నెట్, కాల్స్ వినియోగం, బిల్లు వంటి విషయాలను వినియోగదార్లు ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌లో తెలుసుకోవచ్చు. ఒకరోజుతో మొదలుకుని 365 రోజుల కాలపరిమితితో ఇవి లభిస్తాయి. ఎంచుకున్న ప్యాక్‌నుబట్టి చార్జీ రూ.649 నుంచి రూ.14,999 వరకు ఉంది. -
omicron variant: విదేశాల నుంచి వస్తే మార్గదర్శకాలివే..
న్యూఢిల్లీ: కరోనా కేసులు ఉధృతరూపం దాలుస్తూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు నడుం బిగించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సంబంధించి ఇప్పటివరకు అమల్లో ఉన్న మార్గదర్శకాలను సవరించింది. కరోనా కేసులు ప్రమాదకరస్థాయిలో ఉన్న ఎట్ రిస్క్ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులందరూ వారం పాటు తప్పనిసరిగా హోం క్వారంటైన్లో ఉండాలంటూ శుక్రవారం సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. జనవరి 11 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని, తదుపరి ఆదేశాలు అందేవరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఇటలీ నుంచి అమృత్‌సర్‌కి వచ్చిన ఎయిరిండియా విమానంలో 125 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ నిబంధన విధించింది. మార్గదర్శకాలివే.. ► ప్రయాణికులు తమ వివరాలను, 14 రోజుల కిందట వరకు చేసిన ప్రయాణాలను ఎయిర్ సువిధ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి ► ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీ–పీసీఆర్ పరీక్షలో నెగెటివ్ రిపోర్ట్ ఇవ్వాలి ► విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరూ విమానాశ్రయంలో దిగిన వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలి. ఫలితం వచ్చిన తర్వాతే బయటకు వెళ్లాలి. ఈ పరీక్ష కోసం ముందుగానే సువిధ పోర్టల్‌లో బుక్ చేసుకోవచ్చు. ► పరీక్షల్లో పాజిటివ్ వస్తే ఐసోలేషన్కుపంపిస్తారు. ► నెగెటివ్ వచ్చినప్పటికీ వారం పాటు క్వారంటైన్ తప్పనిసరి. 8వ రోజు ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకొని రిపోర్ట్‌ని సువిధ వెబ్‌పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ఆ పరీక్షలో నెగిటివ్ వస్తే మరో వారం పాటు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలి. ► ఎట్ రిస్క్ కాని దేశాల నుంచి వచ్చిన వారు (అంతర్జాతీయ ప్రయాణికుల్లో 2% మంది) కూడా విమానాశ్రయంలో రాండమ్ పరీక్షలు చేయించుకొని నెగెటివ్ వచ్చినా హోంక్వారంటైన్ ఉండాలి ► అయిదేళ్లలోపు చిన్నారులకు పరీక్షల నుంచి మినహాయింపు. పెరిగిన ఎట్ రిస్క్ దేశాల జాబితా ఒమిక్రాన్ కేసులు ప్రమాదకరంగా విజృంభిస్తున్న ఎట్‌రిస్క్ దేశాల జాబితాలో మరికొన్నింటిని చేర్చింది. అవి..యూకే సహా అన్ని యూరప్ దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్వానా, చైనా, ఘనా, మారిషస్ న్యూజిలాండ్, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్, ఇజ్రాయెల్, కాంగో, ఇథియోపియా, కజకిస్తాన్, కెన్యా, నైజీరియా, ట్యునీషియా, జాంబియా. -
పరస్పరం గుర్తించాలి: వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ
వాషింగ్టన్: కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను పరస్పరం గుర్తించడం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేయొచ్చని ప్రధాని మోదీ బుధవారం సూచించారు. ఒక దేశంలో జారీ చేసిన వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను మరో దేశం గుర్తించే విధానం ఉండాలన్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు విదేశీయులను తమ భూభాగంలోకి అనుమతించే విషయంలో వేర్వేరు నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఈ నిబంధనల్లో ఏకరూపత రావాలని మోదీ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏర్పాటు చేసిన గ్లోబల్ కోవిడ్ శిఖరాగ్ర సదస్సులో మోదీ వీడియో సందేశం ద్వారా పాలుపంచుకున్నారు. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచినట్లు గుర్తుచేశారు. వ్యాక్సిన్ల తయారీకి అవసరమైన ముడి సరుకుల సరఫరా వ్యవస్థను సరళతరం చేయాలని, దీనివల్ల ఇతర దేశాలకు సైతం వ్యాక్సిన్లను ఎగుమతి చేసేందుకు వీలుకలుగుతుందని చెప్పారు. కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లతో దేశాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని గుర్తుచేశారు. ఈ సమస్య పరిష్కారంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగానే అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేయాలని తెలిపారు. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల పరస్పర గుర్తింపుతో ఇది సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. భారతీయులు స్వదేశంలో టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ యూకేకు వచ్చిన తర్వాత 10 రోజులు క్వారంటైన్లో ఉండాలని యూకే అంటోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను పరస్పర గుర్తించాలని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్‌లో 100 కోట్ల డోసుల ఉత్పత్తి: బైడెన్ కోవాక్స్ నిమిత్తం 2022 చివరికల్లా భారత్‌లో కనీసం 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేసే దిశగా క్వాడ్ సాగుతోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. కోవిడ్–19ను జయించడానికి సమష్టిగా కృషి చేయడం కంటే అత్యవసరమైనది మరేదీ లేదన్నారు. వివిధ దేశాల్లో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి అమెరికా సాంకేతిక, ఆర్థిక సహాయం చేస్తోందన్నారు. -
ఇక ఐడియా రోమింగ్ ఫ్రీ
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి.. న్యూఢిల్లీ: స్వదేశంలో రోమింగ్ చార్జీలను ఎత్తివేస్తూ ఐడియా సెల్యులర్ భారతీ ఎయిర్టెల్ బాటలో నడిచింది. ఏప్రిల్ 1 నుంచి తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు దేశీయంగా రోమింగ్‌లో ఇన్కమింగ్ కాల్స్‌ను ఉచితంగా అందుకోవచ్చని ప్రకటించింది. అంతర్జాతీయ రోమింగ్‌కు సంబంధించి వేల్యూ ప్యాక్‌లను ఈ సందర్భంగా ప్రవేశపెట్టింది. దేశీయ రోమింగ్‌లో కాల్స్, ఎస్ఎంఎస్లపై చార్జీలను ఎత్తివేస్తూ భారతీ ఎయిర్టెల్ ప్రకటించిన నేపథ్యంలో పోటీగా ఐడియా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రోమింగ్‌లో అవుట్గోయింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లను సైతం తక్కువ చార్జీలకే అందిస్తున్నట్టు ఐడియా ప్రకటించింది. సొంత సర్కిల్లో అందుబాటులో ఉన్న డేటా ప్యాక్‌లను అదనపు చార్జీలు లేకుండా రోమింగ్‌లోనూ వాడుకోవచ్చని స్పష్టం చేసింది. అంతర్జాతీయ పర్యాటకులకు రోమింగ్ కోసం రూ.2,499, రూ.5,999 ప్యాక్‌లను ప్రకటించింది. 400 అవుట్గోయింగ్ నిమిషాలు, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, 3జీబీ బండిల్డ్ డేటా, ఉచిత అపరిమిత కాల్స్ వీటిపై అందుకోవచ్చు. కాల వ్యవధి 30 రోజులు. 10 రోజుల వ్యాలిడిటీతో రూ.1,199 ప్యాక్ కూడా ఉంది. -
విమానాశ్రయంలో పనిచేయని ఏటీఎం
దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల గగ్గోలు గోపాలపట్నం : విశాఖ విమానాశ్రయంలో ఎస్బీఐ ఏటీఎం పనిచేయక దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకూ 34 విమాన సర్వీసుల్లో వేలాదిగా ప్రయాణాలు సాగిస్తున్నారు. దేశీయ ప్రయాణికులతో పాటు ఇతర దేశాల ప్రయాణికులు ఇక్కడి ఏటీఎంకి వచ్చి భంగపడుతున్నారు. అవసరానికి ఏటీఎం పనిచేయక పోవడంతో ఇబ్బందిగా ఉందని పలువురు ఆవేదన చెందుతున్నారు