చైనాలో కరోనా కల్లోలం భారత్‌లోనూ భయభ్రాంతులకు కారణమవుతోంది. దేశంలో నాలుగో వేవ్ మొదలైపోతుందని ప్రచారం జరుగుతోంది. ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బిఎఫ్.7 చైనా, అమెరికా, యూరప్ దేశాల్లో విస్తృతంగా వ్యాపిస్తూండడంతో కేంద్రం అప్రమత్తమై కరోనా నిబంధనల్ని పాటించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే చైనాతో పోల్చుకుంటే మనకు ప్రమాదం దాదాపుగా ఉండదని అంటువ్యాధి నిపుణులు భరోసా ఇస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి జాగ్రత్తలతో ఈ వేరియెంట్‌ను కూడా సులువుగా ఎదుర్కోవచ్చంటున్నారు. మనకి ఫోర్త్ వేవ్ ముప్పు పెద్దగా ఉండకపోవడానికి గల కారణాలేంటో చూద్దాం...
కరోనా వ్యాక్సినేషన్
భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ విస్తృతంగా జరిగింది. కరోనా సోకిన తొలి రోజుల్లో కేంద్రం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకునేలా చూసింది. అత్యధికులు రెండు డోసుల్ని తీసుకుంది. అక్టోబర్ నాటికి 220 కోట్ల వ్యాక్సినేషన్లు తీసుకున్నారు. మనం అధికంగా ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీతో రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఎక్కువ మంది తీసుకుంటే, చైనా అచేతన వైరస్‌తో తయారు చేసిన కరోనా వాక్, సినోఫామ్ వ్యాక్సిన్లు ఇచ్చింది. కరోనా వేరియెంట్లను ఎదుర్కోవడంలో ఇవి విఫలమవుతున్నాయని అంటున్నారు.
అత్యధికులకు కరోనా
కరోనా మహమ్మారి మొదలైన దగ్గర్నుంచి భారత్‌లో ఇప్పటి వరకు 4.5 కోట్ల కేసులు నమోదయ్యాయి. కరోనాలో ఉన్న అన్ని వేరియెంట్లు దాదాపుగా భారత్‌లో వ్యాపించడంతో ప్రజలందరిలోనూ ఈ వేరియెంట్లను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి బలపడింది. అదే చైనాలో ఇప్పటివరకు ఏ వేరియెంట్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. జీరో కోవిడ్ విధానం కారణంగా ఇప్పటివరకు 20 లక్షల కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో అధిక శాతం ప్రజల్లో కరోనా వైరస్‌ను తట్టుకునే యాంటీబాడీలు ఉత్పన్నం కాలేదు.
– సాక్షి, నేషనల్ డెస్క్
సెప్టెంబర్ నుంచే బీఎఫ్.7 కేసులు
మన దేశంలో ఒమిక్రాన్ ఉపవేరియెంట్ బీఎప్.7 కేసులు ఈ ఏడాది సెప్టెంబర్‌లో వెలుగులోకి వచ్చాయి. కానీ పెద్దగా వ్యాప్తి చెందలేదు. ఇప్పటికే భారత్‌లో తొలి వేవ్ 2020 ఆగస్టు–సెప్టెంబర్‌లో సార్స్–కోవ్–2తో చాలా ఇబ్బందులు పడ్డాం. 2021 ఏప్రిల్–మే నెలల్లో సెకండ్‌వేవ్‌లో డెల్టా వేరియెంట్ దేశాన్ని వణికించింది. మందులకి, ఆక్సిజన్‌కి కరువు వచ్చి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జనవరిలో ఒమిక్రాన్ వేరియెంట్‌తో థర్డ్ వేవ్ కాస్త తక్కువ ప్రభావాన్నే చూపించింది. అందుకే ఈ సబ్ వేరియెంట్ ఏమంత ప్రభావం చూపించదని ఇన్సాకాగ్ మాజీ చీఫ్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.
బూస్టర్ డోసులు
ఈ ఏడాది జనవరి నుంచి దేశంలో కోవిడ్–19 వ్యాక్సిన్ బూస్టర్ డోసులు ఇవ్వడం ప్రారంభించారు. జనాభాలో 28% మందివరకు బూస్టర్ డోసులు తీసుకున్నట్టు నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. చైనాలో 50% మంది బూస్టర్ డోసు తీసుకున్నప్పటికీ 80 ఏళ్లకు పైబడిన 90 లక్షల మంది తీసుకోలేదు. వారికే ఎక్కువగా వైరస్ సోకడం గమనార్హం. మన దేశంలో ప్రజలు కూడా బూస్టర్ డోసులు తీసుకుంటే మంచిదని వైరాలజిస్ట్ గగన్‌దీప్ కాంత్ సూచించారు. బూస్టర్ డోసు వేరే కంపెనీది తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత పరిస్థితేమిటి?
మన దేశంలో గత కొద్ది నెలలుగా కరోనా కేసులు తగ్గిపోతూ వస్తున్నాయి. ప్రస్తుతం రోజుకి సగటున 150 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. అదే మిగిలిన ప్రపంచ దేశాల్లో రోజుకి సగటున 5.9 లక్షల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా వేరియెంట్‌లు అన్ని దేశాలపై ఒకే విధమైన ప్రభావాన్ని చూపించడం లేదు. ఎక్స్‌ఎక్స్‌బీ వేరియెంట్‌తో మన దేశంలో కేసులు 8% నుంచి ఒకానొక దశలో 69శాతానికి చేరినప్పటికీ ఆ తర్వాత వ్యాప్తి తగ్గిపోయింది. నవంబర్ 10న అత్యధికంగా 4,500 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ వేరియెంట్ కూడా ప్రమాదకరం కాదని తేలిపోయింది.
Covid-19 Fourth Wave: చైనాలో కరోనా కల్లోలం.. ‘మనకు ముప్పు లేదు’
Published Sat, Dec 24 2022 4:48 AM | Last Updated on Sat, Dec 24 2022 9:01 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment