పసిడి ‘బుల్’ రన్!
♦ 15 డాలర్లు పడిలేచిన బంగారం
♦ ‘రేటు’ పెంపు ఉండదనే అంచనాలు
♦ భారీగా పడిన డాలర్ ఇండెక్స్
అమెరికా ఆర్థిక పరిణామాలు పసిడిని పటిష్ట స్థాయిలో ఉంచుతున్నాయి. న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో ఆగస్టు 25వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో వారం వారీగా పసిడి ఔన్స్ (31.1 గ్రా.) ధర వారం వారీగా కేవలం ఒక్క డాలర్ పెరిగి 1,296 డాలర్ల వద్ద పటిష్టంగా ఉన్నప్పటికీ, పసిడిది ‘బుల్’ ధోరణే’ అన్నది నిపుణుల అంచనా.
భారీ ఒడిదుడుకులు...: వారమంతా పసిడి భారీ ఒడిదుడుకుల్లో ఉంది. 25వ తేదీ శుక్రవారం అమెరికా సెంట్రల్ బ్యాంక్ చీఫ్ జానెట్ యెలెన్ ఆర్థిక వ్యవస్థపై ప్రకటన చేయనుండటం, అదే రోజు అమెరికా జూలై నెల వినియోగ వస్తువుల గణాంకాలు విడుదల కానుండటంతో వారమంతా హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. శుక్రవారం కీలక నిరోధం 1,300 డాలర్ల స్థాయి వద్ద ఉన్న పసిడికి టెక్నికల్‌గా అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. మరోవైపు యెలెన్ ప్రకటన నేపథ్యంలో 1,280 డాలర్ల స్థాయికి కుప్పకూలింది.
అయితే యెలెన్ తన ప్రకటనలో ‘ఫెడ్ రేటు’ (ప్రస్తుతం 1.00–1.25 శాతం శ్రేణి) ప్రస్తావన చేయకపోవడంతో వారమంతా దాదాపు 93పైన కొనసాగిన డాలర్ ఇండెక్స్ దాదాపు ఒక డాలర్ కుప్పకూలి 92 స్థాయికి చేరుకుంది. దీంతో బంగారం పడినంత వేగంగానే తిరిగి 1,295 స్థాయికి లేచింది. 1,300 నిరోధం కీలకం...: గత వారం 1,303 స్థాయికి చేరి, అక్కడ నిలబడలేకపోయిన పసిడి ఈ నిరోధాన్ని అధిగమించడానికి ఈ వారమంతా ప్రయత్నించింది. 1,340 స్థాయికి చేరడానికి తక్షణ నిరోధం ఇదేనని టెక్నికల్ అనలిస్టుల అభిప్రాయం. ఇక దిగువ దిశలో 1,280, 1,242, 1,204 స్థాయిల వద్ద మద్దతు లభిస్తుందన్నది వారి అంచనా.
దేశీయంగా రూపాయి ఎఫెక్ట్...
నిజానికి అంతర్జాతీయంగా పసిడి దాదాపు అక్కడక్కడే ఉంది కాబట్టి దేశంలో కూడా అదే పరిస్థితి ఉండాలి. అయితే దేశీయంగా ధర పడింది. అమెరికా డాలర్ మారకంలో రూపాయి విలువ వారంవారీగా దాదాపు 24 పైసలు బలపడి 63.85 వద్ద ముగియడం దీనికి కారణం. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో పసిడి వారంలో రూ.118 తగ్గి రూ. రూ.29,167 కి చేరింది. ముంబై ప్రధాన మార్కెట్‌లో వారం వారీగా పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.225 తగ్గి, రూ.29,060కి చేరింది. ఇక 99.5 స్వచ్ఛత విషయంలో ధర ఇదే స్థాయిలో పడి రూ. 28,910కు చేరింది. వెండి కేజీ ధర కూడా భారీగా రూ.590 తగ్గి రూ. 38,710 కి చేరింది.