futures market
-
పసిడి.. పరుగో పరుగు!
న్యూయార్క్/న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పసిడి పరుగు కొనసాగుతోంది. నైమెక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) ధర క్రితం ముగింపుతో పోలి్చతే సోమవారం 12 డాలర్లు పెరిగి సరికొత్త రికార్డు 2,659.7 డాలర్లను తాకింది. ఈ వార్త రాస్తున్న రాత్రి 9 గంటల సమయంలో దాదాపు అదే స్థాయిలో ట్రేడవుతోంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫండ్ రేటు కోతతో మార్కెట్లో ద్రవ్య లభ్యత పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, పలు దేశాల్లో కొనసాగుతున్న ద్రవ్యోల్బణం భయాలు పసిడి పరుగుకు కారణం. ఇక దేశీయంగా కూడా పసిడి ధర పటిష్టంగానే కొనసాగుతున్నప్పటికీ, కస్టమ్స్ సుంకాల తగ్గింపు, రూపాయి బలోపేత ధోరణి పసిడి పరుగును కొంత నిలువరిస్తున్నాయి. న్యూఢిల్లీలో 10 గ్రాముల ధర రూ. 600 ఎగసి రూ. 76,950కి చేరింది. దేశీయ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధర రూ.255 పెరిగి రూ.74,295కు చేరింది. -
రికార్డులను తిరగరాస్తున్న బంగారం ధరలు
న్యూఢిల్లీ: బంగారం ధర గత వారం రోజులుగా ఏరోజుకారోజు కొత్త రికార్డులకు చేరుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో సోమవారం పూర్తి స్వచ్చత 10 గ్రాముల ధర రూ.350 పెరిగి 71,700కు చేరింది. అంతర్జాతీయంగా కూడా ధరలు సరికొత్త రికార్డులను తాకడం దీనికి నేపథ్యం. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.1 గ్రాములు) ధర జూన్‌తో ముగిసే కాంట్రాక్ట్ ఒక దశలో భారీగా క్రితం ముగింపుతో పోల్చితే 27 డాలర్లు పెరిగి 2,372డాలర్లపైకి ఎగసింది. అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు, ఈజీ మనీ, ద్రవ్యోల్బణం భయాలు, సెంట్రల్ బ్యాంక్‌ల కొనుగోళ్లు, భౌగోళిక ఉద్రిక్తతలు పసిడి పరుగునకు కారణమవుతున్నాయి. 2024లో దేశంలో పసిడి 10 గ్రాములకు రూ.7,700 పెరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో పసిడి విలువ 10 గ్రాములకు ఏకంగా రూ.71,080కి ఎగసింది. సోమవారం ఈ వార్త రాసే సమయానికి క్రితం ముగింపుతో పోలి్చతే రూ.158 లాభంతో రూ.70,794 వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా... ఇదిలావుండగా, వెండి కూడా న్యూఢిల్లీలో కొత్త గరిష్టాలను చూసింది. సోమవారం కేజీకి రూ.800 ఎగసి రూ.84,000 స్థాయిని చూసింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో వెండి కేజీ ధర (మే కాంట్రాక్ట్) ఒక దశలో 82,109ని తాకింది. ఈ వార్త రాసే రాత్రి 9 గంటల సమయానికి ధర రూ.942 ఎగసి రూ.81,805 వద్ద ట్రేడవుతోంది. -
బంగారం కొండ దిగుతోంది..!
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా దిగివస్తున్న బంగారం ధరలు మరోసారి డీలా పడ్డాయి. అటు స్పాట్, ఇటు ఫ్యూచర్స్ మార్కెట్లో వరుసగా ఆరో రోజు క్షీణించాయి. ఈ బాటలో విదేశీ మార్కెట్లోనూ వెనకడుగులో కదులుతున్నాయి. న్యూఢిల్లీ స్పాట్ మార్కెట్లో బంగారం(24 క్యారట్స్) 10 గ్రాములు తాజాగా రూ. 239 నష్టపోయి రూ. 45,568కు చేరింది. ఎంసీఎక్స్‌లోనూ రాత్రి 8 గంటల ప్రాంతంలో రూ. 98 నీరసించి రూ. 46,028 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 45,861 వరకూ క్షీణించింది. ఇది 8 నెలల కనిష్టంకావడం గమనార్హం! ఇక న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) 0.2 శాతం తక్కువగా 1,772 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇవి ఏప్రిల్ ఫ్యూచర్స్కాగా.. స్పాట్ మార్కెట్లో 1,773 డాలర్ల వద్ద కదులుతోంది. ఇవి మూడు నెలల కనిష్టం! దశాబ్ద కాలంలోనే అత్యధిక రాబడి... కొత్త ఏడాది(2021)లో బంగారం ధరలు వెనకడుగు వేస్తున్నప్పటికీ గత కేలండర్ ఏడాది(2020)లో 25 శాతంపైగా జంప్‌చేశాయి. ప్రపంచదేశాలను వణికించిన కోవిడ్–19 నేపథ్యంలో గతేడాది పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు భారీ సహాయక ప్యాకేజీలను అమలు చేయడంతో లిక్విడిటీ పెరిగి పసిడిలోకి పెట్టుబడులు మళ్లినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంతో ఆర్థిక వ్యవస్థలు మాంద్యం బారినపడటం ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెప్పారు. సాధారణంగా సంక్షోభ పరిస్థితుల్లో బంగారాన్ని రక్షణాత్మక పెట్టుబడిగా భావించే సంగతి తెలిసిందే. దీంతో పసిడిలో పెట్టుబడులకు వివిధ దేశాల కేంద్ర బ్యాం కులతోపాటు.. ఈటీఎఫ్ సంస్థలు, ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం జోరుకు కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫలితంగా 2020లో దశాబ్ద కాలంలోనే అత్యధికంగా రాబడి ఇచ్చినట్లు తెలిపారు. గరిష్టం నుంచి రూ. 10,000 పతనం గత ఆగస్ట్‌లో 10 గ్రాముల పసిడి ఎంసీఎక్స్‌లో రూ. 56,200ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. తదుపరి ఆటుపోట్ల మధ్య కన్సాలిడేషన్ బాటలో సాగింది. అయితే ఇటీవల అమ్మకాలు పెరగడంతో డీలా పడుతూ వచ్చింది. దీంతో 2021లో ఇప్పటివరకూ 8 శాతం లేదా రూ. 4,000 క్షీణించింది. వెరసి రికార్డ్ గరిష్టం నుంచి చూస్తే ఆరు నెలల్లో 18 శాతం(రూ. 10,000) కోల్పోయింది. ఇక విదేశీ మార్కెట్లోనూ ఆగస్ట్ 7న ఔన్స్ 2072 డాలర్లను అధిగమించింది. ఆర్థిక వ్యవస్థకు దన్నునిచ్చే బాటలో యూఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల డాలర్లకుపైగా ప్యాకేజీకి సన్నాహాలు చేస్తుండటం పసిడి ధరలపై ఒత్తిడిని పెంచుతున్నట్లు మిల్‌వుడ్ కేన్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక సీఈవో నిష్ భట్ అభిప్రాయపడ్డారు. ఈల్డ్స్ పుంజుకుంటే పసిడిని హోల్డ్ చేసే వ్యయాలు పెరుగుతాయని, దీంతో ట్రేడర్లు అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలియజేశారు. ఆర్థిక రికవరీ సంకేతాలు... ట్రెజరీ ఈల్డ్స్ బలపడటం అంటే యూఎస్ ఆర్థిక రికవరీకి సంకేతంగా భావిస్తామని భట్ పేర్కొన్నారు. సాంకేతికంగా చూస్తే రూ. 46,000 ధర.. ఫిబోనకీ రీట్రేస్మెంట్ ప్రకారం 50 శాతానికి దగ్గరగా ఉన్నట్లు క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ నిపుణులు క్షితిజి పురోహిత్ పేర్కొన్నారు. రోజువారీ చార్టుల ప్రకారం చూస్తే 200 రోజుల చలన సగటు(డీఎంఏ) కంటే దిగువన కదులుతున్నట్లు వివరించారు. రూ. 46,000 స్థాయిలో పసిడిలో కొనుగోళ్లకు పలువురు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపే వీలున్నట్లు అంచనా వేశారు. స్వల్పకాలిక ట్రెండ్ బలహీనంగా ఉన్నప్పటికీ రూ. 44,500 వద్ద పటిష్ట మద్దతు లభించగలదని అంచనా వేశారు. సహాయక ప్యాకేజీ కారణంగా యూఎస్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టవచ్చన్న అంచనాలు పెరిగినట్లు కొటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. అయితే ఇటీవల పసిడి క్షీణత నేపథ్యంలో మరింత పతనంకావచ్చన్న అంచనాలు సరికాదని అభిప్రాయపడింది. వెరసి ఫ్రెష్ షార్ట్‌సెల్లింగ్‌ను చేపట్టకపోవడం మేలని ట్రేడర్లకు సూచించింది. ఇవీ కారణాలు.. ► పసిడి వెనకడుగుకు పలు కారణాలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవల యూఎస్ ట్రెజరీ బాండ్ల ధరలు బలహీనపడటంతో ఈల్డ్స్ పుంజుకుంటున్నాయి. దీనికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడుతుండటం కూడా పసిడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు తెలియజేశారు. ► యూఎస్ కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ భారీ ఉపశమన ప్యాకేజీకి శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోనున్న అంచనాలు పెరుగుతున్నాయి. జీడీపీ రికవరీ సాధిస్తే అధిక రిస్క్– అధిక రిటర్నుల సాధనాలకు పెట్టుబడులు మళ్లుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో బంగారంకంటే ఈక్విటీలు తదితరాలకు ప్రాధాన్యత పెరుగుతుందని తెలియజేశారు. ► ఇటీవల కోవిడ్–19 కట్టడికి గ్లోబల్ ఫార్మా కంపెనీలు పలు దేశాలలో వ్యాక్సిన్లను విడుదల చేయడంతో పరిస్థితులు తిరిగి సాధారణ స్థాయికి చేరుకోనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో పసిడిలో సెంటిమెంటు బలహీనపడిందని విశ్లేషకులు తెలియజేశారు. ► దేశీయంగా చూస్తే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పసిడిపై కస్టమ్స్ డ్యూటీని 2.5% తగ్గించడం కూడా దీనికి జత కలసింది. వెరసి తాజాగా పసిడి ధరలు సాంకేతికంగా కీలకమైన రూ. 46,000 మార్క్ దిగువకు చేరినట్లు పేర్కొన్నారు. -
బంగారం.. క్రూడ్ బేర్..!
ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై అనిశ్చితి ఈక్విటీ మార్కెట్లపైనే కాకుండా కమోడిటీలపైనా ప్రభావం చూపింది. గత కొద్ది నెలలుగా లాభాల బాటన పయనిస్తున్న పసిడి ధర, న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్స్‌కు (31.1గ్రా) సోమవారం భారీగా పతనమైంది. ఈ వార్త రాసే 10.30 గంటల సమయంలో 50 డాలర్లకుపైగా (3 శాతం) నష్టంతో 1908 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతక్రితం ఒక దశలో కీలక మద్దతుస్థాయి 1900 డాలర్ల దిగువకుసైతం పడిపోయి, 1,886 డాలర్లను కూడా తాకింది. కరోనా తీవ్రత నేపథ్యంలో పసిడి ధర తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్ చేసిన జూలై 27 తర్వాత ఏ రోజుకారోజు పసిడి పురోగతి బాటనే పయనిస్తూ, వారంరోజుల్లోనే ఆల్‌టైమ్ గరిష్టం 2,089 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. అటు తర్వాత లాభాల స్వీకరణతో క్రమంగా రెండు వందల డాలర్ల వరకూ తగ్గింది. అయితే దీర్ఘకాలంలో పసిడిది బులిష్ ధోరణేనన్నది నిపుణుల అభిప్రాయం. మరోవైపు దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్‌లో అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా పసిడి 10 గ్రాముల ధర సోమవారం ఈ వార్త రాసే సమయానికి రూ.1,400 నష్టంలో రూ. 50,324 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే, మంగళవారం భారత్ స్పాట్ మార్కెట్లలో ధర భారీగా తగ్గే వీలుంది. క్రూడ్ కూడా...: మరోవైపు నైమెక్స్‌లో లైట్ స్వీట్ ధర కూడా బేరల్‌కు 2 శాతం నష్టంతో 39 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బ్రెంట్ ధర కూడా దాదాపు ఇదే స్థాయి నష్టంతో 41 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
నెట్ఫ్లిక్స్కూ కోవిడ్-19 షాక్
గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2020) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అయితే మూడో త్రైమాసికానికి(జులై- సెప్టెంబర్) అంచనాలను కుదించింది. కోవిడ్-19 కట్టడికి అమలు చేసిన లాక్‌డవున్, ప్రత్యర్ధి సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీ.. ఇందుకు కారణమయ్యాయి. గురువారం మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెల్లడించడంతో ఫ్యూచర్స్‌లో నెట్‌ఫ్లిక్స్ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి నాస్డాక్ ఫ్యూచర్స్‌లో నెట్‌ఫ్లిక్స్ షేరు 9.5 శాతం కుప్పకూలింది. 477 డాలర్లకు చేరింది. దీంతో నేటి(శుక్రవారం) ట్రేడింగ్‌లో ఈ ప్రభావం కనిపించే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. గురువారం ట్రేడింగ్‌లో నెట్‌ఫ్లిక్స్ షేరు 0.8 శాతం బలపడి 527 డాలర్లకు ఎగువన ముగిసింది. క్యూ2 రికార్డ్ లాక్‌డవున్‌ల కారణంగా ఈ ఏడాది క్యూ2(ఏప్రిల్- జూన్)లో నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 10 మిలియన్ కొత్త కస్టమర్లను పొందింది. దీంతో కొత్త కస్టమర్ల సంఖ్య 26 మిలియన్లకు చేరింది. అయితే క్యూ3లో కొత్త పెయిడ్ కస్టమర్ల సంఖ్య 2.5 మిలియన్లకు తగ్గనున్నట్లు అంచనా వేసింది. స్ట్రీమింగ్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 5.3 మిలియన్ కొత్త కస్టమర్లు జతకాగలరని విశ్లేషకులు అంచనా వేశారు. అమెజాన్ ప్రైమ్‌తోపాటు ఇటీవల డిస్నీప్లస్ రేసులోకి రావడంతో పోటీ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి అర్ధభాగంతో పోలిస్తే ద్వితీయార్ధంలో పనితీరు మందగించనున్నట్లు నెట్‌ప్లిక్స్ అభిప్రాయపడింది. ఆదాయం అప్ క్యూ2లో నెట్‌ఫ్లిక్స్ ఆదాయం 25 శాతం పెరిగి 6.15 బిలియన్ డాలర్లను తాకగా.. నికర లాభం రెండు రెట్లు ఎగసి 72 కోట్ల డాలర్లకు చేరింది. క్యూ3లో 6.33 బిలియన్ డాలర్ల ఆదాయం, 95.4 కోట్ల డాలర్ల నికర లాభాన్ని నెట్‌ఫ్లిక్స్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కంటెంట్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న టెడ్ శరండోస్ను కో-సీఈవోగా ప్రమోట్ చేస్తున్నట్లు నెట్‌ప్లిక్స్ తాజాగా పేర్కొంది. తద్వారా కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఈవో రీడ్ హ్యాస్టింగ్కు కార్యకలాపాల నిర్వహణలో మరింత సహకారాన్ని అందించనున్నట్లు తెలియజేసింది. -
పసిడికి డాలర్ ‘బులిష్’ షాక్
వారంలో పసిడి 12 డాలర్లు డౌన్! అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోందని, ఫెడ్ ఫండ్ రేటు (అమెరికా సెంట్రల్ బ్యాంక్ రేటు.. ప్రస్తుతం 1–1.25 శాతం శ్రేణి) ఈ ఏడాది ఒకసారి, వచ్చే ఏడాది మూడుసార్లు పెంపు తథ్యమని అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఇస్తున్న సంకేతాలు పసిడిపై ప్రతికూల ప్రభావాన్ని కొనసాగిస్తున్నాయి. న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 29వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 12 డాలర్లు నష్టపోయింది. 1,286 డాలర్ల వద్ద ముగిసింది. అయితే దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక అనిశ్చితి ధోరణి, ఉత్తరకొరియాతో ఘర్షణాత్మక పరిస్థితి వంటి అంశాలు– పసిడి బులిష్ ట్రెండ్‌ను కొనసాగిస్తాయని భావిస్తున్నారు. దేశీయంగా పండుగల డిమాండ్ వారం వారీగా డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనత (65.34), నైమెక్స్‌లో తగ్గిన బంగారం స్పీడ్ వంటి అంశాలు దేశీయంగా ప్రభావం చూపినా, వారం వారీగా ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్లో పసిడి పూర్తి నష్టాల్లోకి జారలేదు. దేశీయంగా పండుగ సీజన్ డిమాండ్ ఇందుకు ఒక కారణం. ముంబై ప్రధాన మార్కెట్లో వారం వారీగా పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర స్వల్పంగా రూ.70 పెరిగి రూ.29,845కి చేరింది. -
కీలక నిరోధం దాటిన బంగారం
► 1300 డాలర్ల పైకి... ► ఏకంగా 34 డాలర్ల లాభం ∙ ► ఈ ఏడాది పసిడికి ఇదే గరిష్టస్థాయి అమెరికా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, డాలర్ ఒడిదుడుకులు, ఫెడ్ ఫండ్ రేటును ప్రస్తుత 1.00–1.25 శాతం శ్రేణి నుంచి పెంచే అవకాశాలు తక్షణం లేకపోవడం వంటి అంశాలు బంగారానికి బలాన్నిస్తున్నాయి. సెప్టెంబర్ 1తో ముగిసిన వారంలో న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర కీలక నిరోధ స్థాయి 1300 డాలర్లను దాటింది. ఈ స్థాయి వద్ద గడచిన రెండు వారాల నుంచీ పసిడికి గట్టి నిరోధం ఎదురవుతున్న సంగతి తెలిసిందే. వారం చివరిలో ఒకదశలో 1334 డాలర్ల స్థాయిని తాకినప్పటికీ, చివరకు 1,329 డాలర్ల వద్ద ముగిసింది. క్రితం వారంతో పోలిస్తే పసిడి ఏకంగా 34 డాలర్లు పెరిగింది. పడితే కొనచ్చు...: అమెరికా ఆర్థిక రంగానికి వెలువడిన పలు సానుకూల, ప్రతికూల గణాంకాల తరహాలోనే డాలర్, పసిడి పరస్పర వ్యతిరేక దిశల్లో వారమంతా ఒడిదుడుకులమయంగా తిరిగాయి. ఒక దశలో డాలర్ ఇండెక్స్ 93 డాలర్ల స్థాయికి పెరిగితే, పసిడి 1,280 డాలర్ల స్థాయికి పడిపోయింది. అయితే వెంటనే డాలర్ బలహీనతతో తిరిగి పసిడి భారీగా పైకెగసి, కీలక 1,300 డాలర్ల నిరోధాన్ని అధిగమించింది. వారం ముగిసేసరికి డాలర్ ఇండెక్స్ 92.82 డాలర్ల స్థాయిలో ఉంది. అంతక్రితం వారంకన్నా పెరిగినా, మున్ముందు డాలర్ బలహీనత ఖాయమని, ఇది పసిడి బులిష్కు సానుకూల అంశమని నిపుణులు చెబుతున్నారు. పసిడికి దిగువస్థాయిలో 1300 డాలర్లు, 1280 డాలర్లు తక్షణ నిరోధాలన్నది వారి అంచనా. 1400 డాలర్లు చేరడానికి 1340, 1375 డాలర్లు నిరోధంగా టెక్నికల్ అనలిస్టులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, సమీప కాలంలో పసిడి దూకుడు కొనసాగుతుందని అంచనావేస్తున్నారు. అయితే ప్రస్తుత స్థాయి నుంచి 70 డాలర్ల వరకూ లాభాల స్వీకరణ జరిగే అవకాశం ఉందనీ, అలా జరిగితే అది కొనుగోళ్లకు అవకాశమని కూడా నిపుణుల అంచనా. దేశీయంగా రూ. 845 అప్ వారం వారీగా డాలర్ మారకంలో రూపాయి విలువ దాదాపు అక్కడక్కడే (63.85) ఉండడం, నైమెక్స్‌లో బంగారం పరుగు పెట్టడం వంటి అంశాలు దేశీయంగా పసిడిపై కూడా భారీగా ప్రభావం చూపించాయి. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో పసిడి వారంలో రూ.656 పెరిగి రూ. రూ.29,823కి చేరింది. ముంబై ప్రధాన మార్కెట్లో వారం వారీగా పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.845 ఎగసి, రూ.29,905కి చేరింది. ఇక 99.5 స్వచ్ఛత విషయంలో ధర ఇదే స్థాయిలో పడి రూ. 29,755కు పెరిగింది. ఇక వెండి కేజీ ధర కూడా భారీగా రూ.1,245 ఎగసి రూ.39,995 కి చేరింది. -
పసిడి ‘బుల్’ రన్!
♦ 15 డాలర్లు పడిలేచిన బంగారం ♦ ‘రేటు’ పెంపు ఉండదనే అంచనాలు ♦ భారీగా పడిన డాలర్ ఇండెక్స్ అమెరికా ఆర్థిక పరిణామాలు పసిడిని పటిష్ట స్థాయిలో ఉంచుతున్నాయి. న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో ఆగస్టు 25వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో వారం వారీగా పసిడి ఔన్స్ (31.1 గ్రా.) ధర వారం వారీగా కేవలం ఒక్క డాలర్ పెరిగి 1,296 డాలర్ల వద్ద పటిష్టంగా ఉన్నప్పటికీ, పసిడిది ‘బుల్’ ధోరణే’ అన్నది నిపుణుల అంచనా. భారీ ఒడిదుడుకులు...: వారమంతా పసిడి భారీ ఒడిదుడుకుల్లో ఉంది. 25వ తేదీ శుక్రవారం అమెరికా సెంట్రల్ బ్యాంక్ చీఫ్ జానెట్ యెలెన్ ఆర్థిక వ్యవస్థపై ప్రకటన చేయనుండటం, అదే రోజు అమెరికా జూలై నెల వినియోగ వస్తువుల గణాంకాలు విడుదల కానుండటంతో వారమంతా హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. శుక్రవారం కీలక నిరోధం 1,300 డాలర్ల స్థాయి వద్ద ఉన్న పసిడికి టెక్నికల్‌గా అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. మరోవైపు యెలెన్ ప్రకటన నేపథ్యంలో 1,280 డాలర్ల స్థాయికి కుప్పకూలింది. అయితే యెలెన్ తన ప్రకటనలో ‘ఫెడ్ రేటు’ (ప్రస్తుతం 1.00–1.25 శాతం శ్రేణి) ప్రస్తావన చేయకపోవడంతో వారమంతా దాదాపు 93పైన కొనసాగిన డాలర్ ఇండెక్స్ దాదాపు ఒక డాలర్ కుప్పకూలి 92 స్థాయికి చేరుకుంది. దీంతో బంగారం పడినంత వేగంగానే తిరిగి 1,295 స్థాయికి లేచింది. 1,300 నిరోధం కీలకం...: గత వారం 1,303 స్థాయికి చేరి, అక్కడ నిలబడలేకపోయిన పసిడి ఈ నిరోధాన్ని అధిగమించడానికి ఈ వారమంతా ప్రయత్నించింది. 1,340 స్థాయికి చేరడానికి తక్షణ నిరోధం ఇదేనని టెక్నికల్ అనలిస్టుల అభిప్రాయం. ఇక దిగువ దిశలో 1,280, 1,242, 1,204 స్థాయిల వద్ద మద్దతు లభిస్తుందన్నది వారి అంచనా. దేశీయంగా రూపాయి ఎఫెక్ట్... నిజానికి అంతర్జాతీయంగా పసిడి దాదాపు అక్కడక్కడే ఉంది కాబట్టి దేశంలో కూడా అదే పరిస్థితి ఉండాలి. అయితే దేశీయంగా ధర పడింది. అమెరికా డాలర్ మారకంలో రూపాయి విలువ వారంవారీగా దాదాపు 24 పైసలు బలపడి 63.85 వద్ద ముగియడం దీనికి కారణం. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో పసిడి వారంలో రూ.118 తగ్గి రూ. రూ.29,167 కి చేరింది. ముంబై ప్రధాన మార్కెట్లో వారం వారీగా పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.225 తగ్గి, రూ.29,060కి చేరింది. ఇక 99.5 స్వచ్ఛత విషయంలో ధర ఇదే స్థాయిలో పడి రూ. 28,910కు చేరింది. వెండి కేజీ ధర కూడా భారీగా రూ.590 తగ్గి రూ. 38,710 కి చేరింది. -
వరుసగా మూడో వారమూ పసిడి పరుగు
కొనసాగిన డాలర్ బలహీనత అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ వారం జరిగిన తన పాలసీ సమీక్ష సందర్భంగా ఫెడ్ ఫండ్ రేటును పెంచకపోవడంతో (ప్రస్తుతం 1–1.25 శాతం) పసిడిలోకి ఇన్వెస్టర్ల పెట్టుబడులు వరుసగా మూడవ వారమూ కొనసాగాయి. అమెరికాలో వృద్ధి వేగం ఊహించినంతగా లేదన్నది దీనికి నేపథ్యం. 28వ తేదీతో ముగిసిన వారంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్– నైమెక్స్‌లో ఔన్స్ (31.1 గ్రా.) ధర 14 డాలర్లు ఎగసి, 1,269 డాలర్లకు చేరింది. గడచిన మూడు వారాల్లో ఇక్కడ పసిడి దాదాపు 64 డాలర్లు పెరిగింది. ఇదే వారంలో డాలర్ ఇండెక్స్ తన పతనాన్ని కొనసాగిస్తూ, మరో 0.60 పాయిం ట్లు తగ్గి 93.20కి చేరింది. డాలర్ బలోపేతం కావటం, ఫెడ్ రేటు పెంచుతుందన్న అంచనాలతో మూడు వారాల క్రితం దాదాపు 1,204 డాలర్ల స్థాయికి పడిపోయిన ఔన్స్ (31.1 గ్రా.) ధర... అమెరికాలోని తాజా రాజకీయ, ఆర్థిక ప్రతికూల వార్తలతో తిరిగి భారీగా పైకి లేచింది. ఈ వారంలో ఒకదశలో కీలక మద్దతు 1,240ని తాకిన పసిడి, అటు తర్వాత ఒక దశలో 1,272ను సైతం తాకింది. దేశంలో పరుగుకు రూపాయి బ్రేకులు... అంతర్జాతీయంగా పసిడి దూకుడు ప్రదర్శించినప్పటికీ, ఆ స్థాయిలో దేశంలో బంగారం పెరగలేదు. డాలర్ మారకంలో రూపాయి విలువ వారంలో దాదాపు 30 పైసలు బలపడి 64.13కు చేరింది. దీనితో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో పసిడి వారంలో కేవలం రూ.41 పెరిగి రూ.28,580కి చేరింది. ఇక ముంబై ప్రధాన మార్కెట్లో వారం వారీగా పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.95 ఎగసి రూ.28,590కి చేరింది. ఇక 99.5 స్వచ్ఛత విషయంలో ధర ఇదే స్థాయిలో ఎగసి రూ. 28,440కు ఎగసింది. వెండి కేజీ ధర కూడా స్వల్పంగా రూ.170 ఎగసి రూ.37,975కు చేరింది. -
కొనసాగుతున్న బంగారం దూకుడు
న్యూఢిల్లీ/న్యూయార్క్: అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో వరుసగా రెండవ వారమూ పసిడి పరుగు కొనసాగించింది. డాలర్ బలోపేతం కావటం, ఫెడ్ రేటు పెంచుతుందన్న అంచనాలతో రెండు వారాల క్రితం దాదాపు 1,204 డాలర్ల స్థాయికి పడిపోయిన ఔన్స్ (31.1 గ్రా) ధర... అమెరికాలోని తాజా రాజకీయ ప్రతికూల వార్తలతో 14వ తేదీతో ముగిసిన వారంలో 1,227 డాలర్లకు ఎగసింది. అటు తర్వాత 21వ తేదీతో ముగిసిన వారంలో మరో 27 డాలర్లు ఎగసి 1,254 డాలర్లకు చేరింది. అంటే రెండు వారాల్లో దాదాపు 50 డాలర్లు పెరిగింది. ప్రస్తుతం పసిడి 1,260 డాలర్ల కీలక రెసిస్టెన్స్ వద్ద ఉంది. పడితే మొదట 1,240 డాలర్లను తాకి అదీ పోతే మళ్లీ 1,205 డాలర్ల స్థాయికి చేరుతుందనేది విశ్లేషకుల అంచనా. ఇదే సమయంలో డాలర్ ఇండెక్స్ రెండు వారల్లో భారీగా పడిపోయి, శుక్రవారం ముగిసిన వారంలో 93.78 స్థాయికి చేరింది. ఇది ఏడాది కనిష్ట స్థాయి. డాలర్ ఇండెక్స్ ఎందుకు పడింది? అమెరికా రాజకీయ అనిశ్చితులు, డాలర్‌పై దాని ప్రతికూల ప్రభావం దీనిక్కారణం. చౌక ఆరోగ్య భద్రతా చట్టం రద్దు, తాజా చట్టం అమెరికా సెనేట్ ఆమోదాన్ని పొందలేకపోవడం డాలర్ ఇండెక్స్‌పై ప్రతికూల ప్రభావం చూపించింది. పన్ను సంస్కరణలు, ద్రవ్య క్రమశిక్షణ, డీ–రెగ్యులైజేషన్కు సంబంధించి ప్రభుత్వం సామర్థ్యాల విషయంలో సందేహాలు లేవనెత్తాయి. రష్యాతో ట్రంప్ సంబంధాలపై విచారణ వార్తలు ఒక పక్క షికార్ చేస్తున్నాయి. ఈ వ్యవహారం అంతా సమీప భవిష్యత్తులో డాలర్ బలహీనతకు, పసిడి బలోపేతానికి దోహదపడే అంశాలని ఫారెక్స్ లైవ్.కామ్‌లో సీనియర్ కరెన్సీ వ్యూహకర్త ఆడెబ్ బూటన్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మరోదఫా ఫెడ్ రేటు పెంపు అవకాశాలపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంమీద రెండు వారాల క్రితం బేరిష్‌లోకి జారిపోతుందనుకున్న పసిడి, తిరిగి బులిష్ ట్రెండ్‌ను సంతరించుకోవడం విశేషం. దేశంలో రూ.500 అప్..: అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగానే ముంబై ప్రధాన మార్కెట్లో వారం వారీగా పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.485 ఎగసి రూ.28,495కి చేరింది. ఇక 99.5 స్వచ్ఛత విషయంలో ధర ఇదే స్థాయిలో ఎగసి రూ. 28,345కు ఎగసింది. వెండి కేజీ ధర మాత్రం భారీగా 1,315 ఎగసి రూ.37,805కు చేరింది. -
పుత్తడి పరుగుకు బ్రేక్
♦ ఫెడ్ రేటుపై అప్రమత్తత! ♦1300 డాలర్ల స్థాయికి చేరి... తిరోగమనం ♦ వారం వారీగా 10 డాలర్ల క్షీణత ♦ ఐదువారాల తర్వాత తగ్గుదల న్యూయార్క్/ముంబై: అమెరికా ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0.75–1 శాతం) వచ్చే వారం 14వ తేదీన పెరగవచ్చన్న అంచనాలు, డాలర్ బలోపేతం వంటి అంశాలు గతవారం బంగారం ధరపై ప్రభావంచూపించాయి. 9వ తేదీతో ముగిసిన వారంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) మరో 10 డాలర్లు నష్టపోయి 1,269 డాలర్లకు చేరింది. ఐదు వారాల్లో పసిడి వారం వారీగా వెనక్కు తగ్గడం ఇదే తొలిసారి. వరుసగా మూడు వారాల్లో పసిడి దాదాపు 60 డాలర్లకు పైగా పెరగడం గమనార్హం. ఇక డాలర్ ఇండెక్స్ స్వల్పంగా 0.63 పాయింట్లు పెరిగి 97.24కు చేరింది. అమెరికా ఆర్థిక, రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు అలాగే అమెరికా అధ్యక్షుడి డాలర్ ‘బలహీన’ లక్ష్యం విధానాలు పసిడిపై భవిష్యత్తులో ప్రభావితం చూపుతాయన్న అంచనాలూ ఉన్నాయి. 103.88 గరిష్ట స్థాయిని చూసిన డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం 97 స్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. భారత్‌లో స్వల్ప పెరుగుదల అంతర్జాతీయంగా పసిడి భారీగా పడినప్పటికీ, ఆ ప్రభావం దేశంలో స్వల్పంగానే ఉంది. దేశీయంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్ దీనికి ప్రధాన కారణం. ఎంసీఎక్స్‌లో బంగారం ధర 10 గ్రాములకు జూన్ 9వ తేదీతో ముగిసిన వారంలో స్వల్పంగా రూ.148 పెరిగి రూ.29,019కు పెరిగింది. మూడు వారాల్లో ధర దాదాపు రూ. 1,000 పెరిగింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.175 పెరిగి రూ.29,095కి చేరింది. మరోవైపు వెండి కేజీ ధర వారం వారీగా స్వల్పంగా రూ. 165 ఎగసి రూ.40,085కి చేరింది. -
బంగారం... కొనసాగుతున్న అప్‌ట్రెండ్!
రెండు వారాల్లో 38 డాలర్లు లాభం న్యూయార్క్/ముంబై: అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో 26వ తేదీతో ముగిసిన వారంలో బంగారం ఔన్స్ (31.1గ్రా) ధర 11 డాలర్లు పెరిగి 1,266 డాలర్లకు చేరింది. రెండు వారాల్లో ఇక్కడ ధర 38 డాలర్లు పెరిగింది. ఉత్తరకొరియా యుద్ధ వాతావరణం తీవ్రత నేపథ్యంలో అంతక్రితం నాలుగు వారాల పాటు వరుసగా 61 డాలర్లు తగ్గిన పసిడి, మళ్లీ గడచిన రెండు వారాల నుంచీ పరుగుపెడుతోంది. అంతర్జాతీయంగా కీలక పరిణామాల నేపథ్యంలో... పసిడి దూకుడు మున్ముందూ తథ్యమన్న అంచనాలున్నాయి. ఆ అంశాలు చూస్తే... ♦ తక్షణం ఫెడ్ రేటు (ప్రస్తుతం 0.75–1%) పెంచదన్న సంకేతాలు. ♦ ట్రంప్ అస్పష్ట ఆర్థిక, డాలర్ బలహీన విధానాలు. రాజకీయ ఒత్తిళ్లు. ♦ ఉత్తరకొరియా పరిణామాలు ♦ ఈ వారాంతంలో జీ–7 దేశాల సమావేశం బ్రిటన్‌లో జూన్ 8న జరిగే ఎన్నికలు. దేశీయంగానూ లాభాలే...: అంతర్జాతీయ ప్రభావం దేశీ ఫ్యూచర్స్ మార్కెట్‌పైనా పడింది. ఎంసీఎక్స్‌లో బంగారం ధర 10 గ్రాములకు 26వ తేదీతో ముగిసిన వారంలో రూ.253 పెరిగి రూ.28,888కు ఎగసింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.200 పెరిగి రూ.28,985కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో బలపడి రూ.28,835కి చేరింది. -
ఆర్థిక అనిశ్చితిలో పసిడి మెరుపు
♦ వారంలో డాలర్ ఇండెక్స్ 2.05 పతనం ♦ 27 డాలర్లు దూసుకుపోయిన పసిడి న్యూయార్క్/ముంబై: పసిడి మళ్లీ వారం తిరిగే (19వ తేదీతో ముగిసిన వారానికి) సరికి మళ్లీ రయ్యిమని 27 డాలర్ల దూకుడుతో 1,255 డాలర్లకు ఎగసింది. అమెరికా– ఉత్తరకొరియా ప్రకటనల ఉద్రిక్తతలు సడలిన నేపథ్యంలో... అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో వరుసగా నాలుగు వారాల్లో 61 డాలర్లు పతనమై, 13వ తేదీతో ముగిసిన వారంలో 1,228 డాలర్ల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. 1,220 డాలర్ల వద్ద పసిడికి పటిçష్ట మద్దతు లభిస్తోందని, 1,260 స్థాయిలో వద్ద నిరోధం ఉంటుందని నిపుణుల అంచనా. కారణం ఇదీ... అమెరికా రాజకీయ పరిస్థితులు, తద్వారా ఆర్థిక సంక్షోభ భయాలు మొత్తంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గత వారం ప్రతికూల ప్రభావం చూపాయి. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్‌పై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జోక్యం, గత ఏడాది అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం అవకాశాలపై విచారణకు ప్రత్యేక కౌన్సిల్ వంటి అంశాలు ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై తద్వారా ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపడంతో ఇన్వెస్టర్లు మళ్లీ తమ పెట్టుబడులకు తక్షణ రక్షణగా గత వారం బంగారాన్ని ఆశ్రయించారని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికితోడు డాలర్ ఇండెక్స్ తగ్గుదల అవసరముందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా వ్యాఖ్యలు కూడా పసిడి పుంజుకోడానికి బాటలు వేశాయి. డాలర్ మళ్లీ కిందచూపు... అమెరికాలో ఏర్పడే ఆర్థిక, రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు అలాగే అమెరికా అధ్యక్షుని డాలర్ ‘బలహీన’ లక్ష్యం విధానాలు పసిడిపై భవిష్యత్తులో తప్పనిసరిగా ప్రభావితం చూపుతాయన్న అంచనాలూ ఉన్నాయి. 100.51, 99.75, 99.04, 98.42 ఇలా... నాలుగు వారాలుగా తగ్గుతూ వచ్చిన డాలర్ ఇండెక్స్ మే 13వ తేదీతో ముగిసిన వారంలో మాత్రం స్వల్పంగా కోలుకుని 99.05 వద్ద ముగిసింది. అయితే మళ్లీ వారం తిరిగే సరికి భారీగా 2.05 డాలర్లు పతనమై 97.00 వద్ద ముగియడం గమనార్హం. -
చమురు ధరలు మరింత కిందకు..
♦ మంగళవారం 3 శాతం పతనం లండన్: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మరింతగా తగ్గుతున్నాయి. మంగళవారం ఫ్యూచర్స్ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర దాదాపు 3.5 శాతం వరకూ పతనమై 30.43 డాలర్ల ధరను తాకింది. పదేళ్లలో ఎన్నడూ చూడని ధర ఇదని, ధరలు మరింతగా తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ చమురు ధరలు 20 శాతం మేర పడిపోయాయి. సరఫరాలు అధికంగా ఉండడం, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం, ఆ దేశ స్టాక్ మార్కెట్ క్షీణించడం, డాలర్ బలపడుతుండడం వంటి కారణాల వల్ల చమురు ధరలు తగ్గుతున్నాయి. -
25 వేల దిగువకు పడిపోయిన బంగారం
బంగారం కొనాలనుకుంటే.. ఇదే మంచి తరుణం. డబ్బులు సిద్ధంగా పెట్టుకోండి. పది గ్రాముల బంగారం ధర 25 వేల రూపాయల దిగువకు పడిపోయింది. ఫ్యూచర్స్ మార్కెట్లో 524 రూపాయలు పడిపోయి.. ఐదేళ్ల కాలంలో ఎప్పుడూ లేనంత దిగువ స్థాయికి చేరుకుంది. ఎంసీఎక్స్‌లో ఆగస్టు డెలివరీకి సంబంధించిన బంగారం కాంట్రాక్టు ధర 2.06 శాతం తగ్గి 10 గ్రాములకు రూ. 24,974 వద్ద ట్రేడయింది. ఈ ధర వద్ద 597 లాట్లు అమ్ముడయ్యాయి. అక్టోబర్‌లో డెలివరీకి సంబంధించిన బంగారం పది గ్రాముల ధర రూ. 25,200 వద్ద 30 లాట్లు ట్రేడయింది. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ట్రెండు కారణంగానే ఇక్కడ కూడా ధరలు తగ్గుతున్నాయని అనలిస్టులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లు చూసుకుంటే.. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం 1,086.18 డాలర్ల వద్ద ట్రేడయింది. 2010 మార్చి తర్వాత ఇదే అత్యల్ప ధర. చైనాలో కూడా 2009 తర్వాత అత్యల్ప స్థాయిలో బంగారం ట్రేడయింది.