బంగారం... కొనసాగుతున్న అప్‌ట్రెండ్!
రెండు వారాల్లో 38 డాలర్లు లాభం
న్యూయార్క్/ముంబై: అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో 26వ తేదీతో ముగిసిన వారంలో బంగారం ఔన్స్ (31.1గ్రా) ధర 11 డాలర్లు పెరిగి 1,266 డాలర్లకు చేరింది. రెండు వారాల్లో ఇక్కడ ధర 38 డాలర్లు పెరిగింది. ఉత్తరకొరియా యుద్ధ వాతావరణం తీవ్రత నేపథ్యంలో అంతక్రితం నాలుగు వారాల పాటు వరుసగా 61 డాలర్లు తగ్గిన పసిడి, మళ్లీ గడచిన రెండు వారాల నుంచీ పరుగుపెడుతోంది. అంతర్జాతీయంగా కీలక పరిణామాల నేపథ్యంలో... పసిడి దూకుడు మున్ముందూ తథ్యమన్న అంచనాలున్నాయి. ఆ అంశాలు చూస్తే...
♦ తక్షణం ఫెడ్ రేటు (ప్రస్తుతం 0.75–1%) పెంచదన్న సంకేతాలు.
♦ ట్రంప్ అస్పష్ట ఆర్థిక, డాలర్ బలహీన విధానాలు. రాజకీయ ఒత్తిళ్లు.
♦ ఉత్తరకొరియా పరిణామాలు
♦ ఈ వారాంతంలో జీ–7 దేశాల సమావేశం
బ్రిటన్‌లో జూన్ 8న జరిగే ఎన్నికలు.
దేశీయంగానూ లాభాలే...: అంతర్జాతీయ ప్రభావం దేశీ ఫ్యూచర్స్ మార్కెట్‌పైనా పడింది. ఎంసీఎక్స్‌లో బంగారం ధర 10 గ్రాములకు 26వ తేదీతో ముగిసిన వారంలో రూ.253 పెరిగి రూ.28,888కు ఎగసింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.200 పెరిగి రూ.28,985కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో బలపడి రూ.28,835కి చేరింది.