భారీగా పెరిగిన ధర నుంచి ఒకపక్క లాభాల స్వీకరణ జరుగుతున్న నేపథ్యంలో, రేటు పెంపు తథ్యమని అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ బుధవారం ఇచ్చిన సంకేతాలు, దీనితో డాలర్ ఇండెక్స్ ‘తక్షణ’ బలోపేతం వంటి అంశాలు పసిడికి గత వారం భారీ షాకిచ్చాయి. న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 22వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 25 డాలర్లు నష్టపోయింది. చివరకు 1,301 డాలర్ల వద్ద ముగిసింది.
రెండు వారాల్లో ఇక్కడ నష్టం 52 డాలర్లు. సెప్టెంబర్ 8తో ముగిసిన వారంలో న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 1,362 డాలర్లను తాకింది. అయితే అదేరోజు చివరకు 10 డాలర్లు తగ్గి 1,352 డాలర్ల వద్ద ముగిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పసిడి సమీప కాలంలో 1,300 – 1,350 డాలర్ల శ్రేణిలో కొంత కాలం కన్సాలిడేషన్ జరగవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బులిష్ ధోరణే...
గురువారం ఒకదశలో 1,300 డాలర్ల కీలక మద్దతుస్థాయిని కోల్పోయి, 1,293 డాలర్లకు చేరిన పసిడి తిరిగి ఒక్కరోజులోనే కీలక మద్దతుస్థాయి 1,300 డాలర్ల స్థాయిపైన ముగియడం ఈ మెటల్ బులిష్ ధోరణికి సంకేతమన్నది నిపుణుల విశ్లేషణ. మున్ముందూ ఇదే ధోరణి కొనసాగుతుందని అంచనా. అమెరికాతో ఉత్తరకొరియా ఘర్షణాత్మక వైఖరి, తాజాగా ఇరాన్ మిసైల్ ప్రయోగం వంటివి ఇందుకు తక్షణ కారణాలు కాగా, దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక అనిశ్చితి ధోరణి పసిడి బులిష్ ట్రెండ్‌ను కొనసాగిస్తాయని భావిస్తున్నారు.
ఈ ఏడాది చివర్లో ఒకసారి, వచ్చే ఏడాది మూడుసార్లు ఫెడ్ ఫెండ్ రేటు (ప్రస్తుతం 1.00–1.25 శాతం) పెంపు సంకేతాలను ఇచ్చిన వెన్వెంటనే బుధవారం 91.40 స్థాయిల్లో ఉన్న డాలర్ ఇండెక్స్ 92.50 స్థాయికి చేరింది. అయినా ఆ స్థాయిలో నిలబడలేక క్రమంగా 92 దిగువకు వచ్చేసింది. శుక్రవారం 91.95 వద్ద ముగిసింది. క్రితం వారం ముగింపు 91.85. పసిడికి దిగువస్థాయిలో 1,300 డాలర్లు, 1,280 డాలర్లు తక్షణ నిరోధాలన్నది విశ్లేషకుల అంచనా. 1,400 డాలర్లు చేరడానికి 1,370 డాలర్లు నిరోధంగా టెక్నికల్ అనలిస్టులు పేర్కొంటున్నారు.
దేశీయంగా రూ.30,000 దిగువకు...
వారం వారీగా డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనత (64.90), నైమెక్స్‌లో తగ్గిన బంగారం స్పీడ్ వంటి అంశాలు దేశీయ పసిడిపై కూడా ప్రభావం చూపించాయి. ముంబై స్పాట్ మార్కెట్‌లో దాదాపు రెండు వారాల్లో ధర రూ.700 తగ్గింది. అంతక్రితం రెండు వారాల్లో పెరిగిన మొత్తంలో (రూ.1,400) దాదాపు సగం కోల్పోయింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే ్చంజ్‌లో పసిడి గడచిన వారంలో రూ.271 తగ్గి, రూ.29,585 కి చేరింది. ముంబై ప్రధాన మార్కెట్‌లో వారం వారీగా పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.280 తగ్గి, రూ.29,775కి చేరింది. ఇక 99.5 స్వచ్ఛత విషయంలో ధర ఇదే స్థాయిలో పడి రూ. 29,625కు దిగింది. ఇక వెండి కేజీ ధర కూడా భారీగా రూ.1,005 తగ్గి రూ.39,450కి చేరింది.