కొనసాగుతున్న బంగారం దూకుడు
న్యూఢిల్లీ/న్యూయార్క్: అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో వరుసగా రెండవ వారమూ పసిడి పరుగు కొనసాగించింది. డాలర్ బలోపేతం కావటం, ఫెడ్ రేటు పెంచుతుందన్న అంచనాలతో రెండు వారాల క్రితం దాదాపు 1,204 డాలర్ల స్థాయికి పడిపోయిన ఔన్స్ (31.1 గ్రా) ధర... అమెరికాలోని తాజా రాజకీయ ప్రతికూల వార్తలతో 14వ తేదీతో ముగిసిన వారంలో 1,227 డాలర్లకు ఎగసింది. అటు తర్వాత 21వ తేదీతో ముగిసిన వారంలో మరో 27 డాలర్లు ఎగసి 1,254 డాలర్లకు చేరింది. అంటే రెండు వారాల్లో దాదాపు 50 డాలర్లు పెరిగింది. ప్రస్తుతం పసిడి 1,260 డాలర్ల కీలక రెసిస్టెన్స్ వద్ద ఉంది. పడితే మొదట 1,240 డాలర్లను తాకి అదీ పోతే మళ్లీ 1,205 డాలర్ల స్థాయికి చేరుతుందనేది విశ్లేషకుల అంచనా. ఇదే సమయంలో డాలర్ ఇండెక్స్ రెండు వారల్లో భారీగా పడిపోయి, శుక్రవారం ముగిసిన వారంలో 93.78 స్థాయికి చేరింది. ఇది ఏడాది కనిష్ట స్థాయి.
డాలర్ ఇండెక్స్ ఎందుకు పడింది?
అమెరికా రాజకీయ అనిశ్చితులు, డాలర్‌పై దాని ప్రతికూల ప్రభావం దీనిక్కారణం. చౌక ఆరోగ్య భద్రతా చట్టం రద్దు, తాజా చట్టం అమెరికా సెనేట్ ఆమోదాన్ని పొందలేకపోవడం డాలర్ ఇండెక్స్‌పై ప్రతికూల ప్రభావం చూపించింది. పన్ను సంస్కరణలు, ద్రవ్య క్రమశిక్షణ, డీ–రెగ్యులైజేషన్‌కు సంబంధించి ప్రభుత్వం సామర్థ్యాల విషయంలో సందేహాలు లేవనెత్తాయి. రష్యాతో ట్రంప్ సంబంధాలపై విచారణ వార్తలు ఒక పక్క షికార్ చేస్తున్నాయి. ఈ వ్యవహారం అంతా సమీప భవిష్యత్తులో డాలర్ బలహీనతకు, పసిడి బలోపేతానికి దోహదపడే అంశాలని ఫారెక్స్ లైవ్.కామ్‌లో సీనియర్ కరెన్సీ వ్యూహకర్త ఆడెబ్ బూటన్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మరోదఫా ఫెడ్ రేటు పెంపు అవకాశాలపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంమీద రెండు వారాల క్రితం బేరిష్‌లోకి జారిపోతుందనుకున్న పసిడి, తిరిగి బులిష్ ట్రెండ్‌ను సంతరించుకోవడం విశేషం.
దేశంలో రూ.500 అప్..: అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగానే ముంబై ప్రధాన మార్కెట్‌లో వారం వారీగా పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.485 ఎగసి రూ.28,495కి చేరింది. ఇక 99.5 స్వచ్ఛత విషయంలో ధర ఇదే స్థాయిలో ఎగసి రూ. 28,345కు ఎగసింది. వెండి కేజీ ధర మాత్రం భారీగా 1,315 ఎగసి రూ.37,805కు చేరింది.