పుత్తడి పరుగుకు బ్రేక్
♦ ఫెడ్ రేటుపై అప్రమత్తత!
♦1300 డాలర్ల స్థాయికి చేరి... తిరోగమనం
♦ వారం వారీగా 10 డాలర్ల క్షీణత
♦ ఐదువారాల తర్వాత తగ్గుదల
న్యూయార్క్/ముంబై: అమెరికా ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0.75–1 శాతం) వచ్చే వారం 14వ తేదీన పెరగవచ్చన్న అంచనాలు, డాలర్ బలోపేతం వంటి అంశాలు గతవారం బంగారం ధరపై ప్రభావంచూపించాయి. 9వ తేదీతో ముగిసిన వారంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) మరో 10 డాలర్లు నష్టపోయి 1,269 డాలర్లకు చేరింది. ఐదు వారాల్లో పసిడి వారం వారీగా వెనక్కు తగ్గడం ఇదే తొలిసారి. వరుసగా మూడు వారాల్లో పసిడి దాదాపు 60 డాలర్లకు పైగా పెరగడం గమనార్హం. ఇక డాలర్ ఇండెక్స్ స్వల్పంగా 0.63 పాయింట్లు పెరిగి 97.24కు చేరింది. అమెరికా ఆర్థిక, రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు అలాగే అమెరికా అధ్యక్షుడి డాలర్ ‘బలహీన’ లక్ష్యం విధానాలు పసిడిపై భవిష్యత్తులో ప్రభావితం చూపుతాయన్న అంచనాలూ ఉన్నాయి. 103.88 గరిష్ట స్థాయిని చూసిన డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం 97 స్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే.
భారత్‌లో స్వల్ప పెరుగుదల
అంతర్జాతీయంగా పసిడి భారీగా పడినప్పటికీ, ఆ ప్రభావం దేశంలో స్వల్పంగానే ఉంది. దేశీయంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్ దీనికి ప్రధాన కారణం. ఎంసీఎక్స్‌లో బంగారం ధర 10 గ్రాములకు జూన్ 9వ తేదీతో ముగిసిన వారంలో స్వల్పంగా రూ.148 పెరిగి రూ.29,019కు పెరిగింది. మూడు వారాల్లో ధర దాదాపు రూ. 1,000 పెరిగింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.175 పెరిగి రూ.29,095కి చేరింది. మరోవైపు వెండి కేజీ ధర వారం వారీగా స్వల్పంగా రూ. 165 ఎగసి రూ.40,085కి చేరింది.