ఆర్థిక అనిశ్చితిలో పసిడి మెరుపు
♦ వారంలో డాలర్ ఇండెక్స్ 2.05 పతనం
♦ 27 డాలర్లు దూసుకుపోయిన పసిడి
న్యూయార్క్/ముంబై: పసిడి మళ్లీ వారం తిరిగే (19వ తేదీతో ముగిసిన వారానికి) సరికి మళ్లీ రయ్యిమని 27 డాలర్ల దూకుడుతో 1,255 డాలర్లకు ఎగసింది. అమెరికా– ఉత్తరకొరియా ప్రకటనల ఉద్రిక్తతలు సడలిన నేపథ్యంలో... అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో వరుసగా నాలుగు వారాల్లో 61 డాలర్లు పతనమై, 13వ తేదీతో ముగిసిన వారంలో 1,228 డాలర్ల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. 1,220 డాలర్ల వద్ద పసిడికి పటిçష్ట మద్దతు లభిస్తోందని, 1,260 స్థాయిలో వద్ద నిరోధం ఉంటుందని నిపుణుల అంచనా.
కారణం ఇదీ...
అమెరికా రాజకీయ పరిస్థితులు, తద్వారా ఆర్థిక సంక్షోభ భయాలు మొత్తంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గత వారం ప్రతికూల ప్రభావం చూపాయి. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్‌పై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జోక్యం, గత ఏడాది అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం అవకాశాలపై విచారణకు ప్రత్యేక కౌన్సిల్ వంటి అంశాలు ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై తద్వారా ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపడంతో ఇన్వెస్టర్లు మళ్లీ తమ పెట్టుబడులకు తక్షణ రక్షణగా గత వారం బంగారాన్ని ఆశ్రయించారని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికితోడు డాలర్ ఇండెక్స్ తగ్గుదల అవసరముందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా వ్యాఖ్యలు కూడా పసిడి పుంజుకోడానికి బాటలు వేశాయి.
డాలర్ మళ్లీ కిందచూపు...
అమెరికాలో ఏర్పడే ఆర్థిక, రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు అలాగే అమెరికా అధ్యక్షుని డాలర్ ‘బలహీన’ లక్ష్యం విధానాలు పసిడిపై భవిష్యత్తులో తప్పనిసరిగా ప్రభావితం చూపుతాయన్న అంచనాలూ ఉన్నాయి. 100.51, 99.75, 99.04, 98.42 ఇలా... నాలుగు వారాలుగా తగ్గుతూ వచ్చిన డాలర్ ఇండెక్స్ మే 13వ తేదీతో ముగిసిన వారంలో మాత్రం స్వల్పంగా కోలుకుని 99.05 వద్ద ముగిసింది. అయితే మళ్లీ వారం తిరిగే సరికి భారీగా 2.05 డాలర్లు పతనమై 97.00 వద్ద ముగియడం గమనార్హం.