రూ. 406 లక్షల కోట్లకు చేరిక
బుల్ బ్యాక్ ర్యాలీ నేపథ్యం
బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లకు డిమాండ్
ముంబై: స్టాక్ సూచీల నష్టాలు ఒకరోజుకు పరిమితమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. అంచనాలకు మించి క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటనతో బ్యాంకులు, ఫైనాన్స్ రంగాల షేర్లలో భారీ కొనుగోళ్లు నెలకొన్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలు కలిసొచ్చాయి. క్రూడాయిల్ ధరలు దిగిరావడం, ఇరాన్– ఇజ్రాయెల్ ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టడం, డాలర్ ఇండెక్స్ బలహీనత వంటి అంశాలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 941 పాయింట్లు పెరిగి 74,671 వద్ద నిలిచింది. నిఫ్టీ 223 పాయింట్లు బలపడి 22,643 వద్ద నిలిచింది.
సెన్సెక్స్ పరుగుతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.2.48 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్టం రూ.406 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఈ సూచీలోని 30 షేర్లలో హెచ్‌సీఎల్ టెక్(– 6%), ఐటీసీ (–0.44%), విప్రో(–0.37%), బజాజ్‌ఫిన్‌సర్వ్(–0.10%) మాత్రమే నష్టపోయాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో స్థిరంగా ముందుకు కదిలాయి. ఒక దశలో సెన్సెక్స్ 941 పాయింట్లు ఎగసి 74,671 వద్ద, నిఫ్టీ బలపడి 236 పాయింట్లు దూసుకెళ్లి 22,656 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. ఐటీ, ఆటో, రియల్టీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈ మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 0.79%, 0.07% చొప్పున రాణించాయి.
ఆల్‌టైం హైకి బ్యాంక్ నిఫ్టీ: ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంక్, పీఎస్‌బీ షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్టానికి చేరుకోవడంతో ట్రేడింగ్‌లో బ్యాంక్ నిఫ్టీ సైతం 49,474 వద్ద ఆల్ టైం హైని నమోదు చేసింది. చివరికి 1,223 పాయింట్ల లాభంతో 49,424 వద్ద ముగిసింది. మొత్తం ఈ సూచీలో 12 షేర్లలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్(3.30%), బంధన్ బ్యాంక్(0.20%) మాత్రమే నష్టపోయాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ఃరూ.8 లక్షల కోట్లు
క్యూ4లో నికర లాభం 18% వృద్ధితో ఐసీఐసీఐ బ్యాంకు షేరుకు డిమాండ్ నెలకొంది. బీఎస్‌ఈలో 4.5%పెరిగి రూ.1,159 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 5% ఎగిసి రూ.1,163 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. మార్కెట్ విలువ రూ.36,555 కోట్లు పెరిగి రూ.8 లక్షల కోట్లపైన రూ.8.14 లక్షల కోట్లకు చేరింది క్యాపిటలైజేషన్ పరంగా రూ.8 లక్షల కోట్లు దాటిన అయిదో కంపెనీగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment