మార్కెట్లకు ఫెడ్‌ దెబ్బ | Sensex falls for 2nd day, down 337 points post Fed rate hike | Sakshi
Sakshi News home page

మార్కెట్లకు ఫెడ్‌ దెబ్బ

Published Fri, Sep 23 2022 4:45 AM | Last Updated on Fri, Sep 23 2022 4:45 AM

Sensex falls for 2nd day, down 337 points post Fed rate hike - Sakshi

ముంబై: ఆర్థికవేత్తల ఆందోళనలను నిజం చేస్తూ యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లను మూడోసారి 0.75 శాతం పెంచడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు డీలా పడ్డాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్‌ 337 పాయింట్లు క్షీణించింది. 59,120 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 89 పాయింట్ల వెనకడుగుతో 17,630 వద్ద స్థిరపడింది. ప్రస్తుతం 3.25 శాతంగా ఉన్న ఫండ్స్‌ రేట్లను ఈ ఏడాది చివరికల్లా 4.4 శాతానికి చేర్చే వీలున్నట్లు ఫెడ్‌ సంకేతాలివ్వడంతో ప్రపంచ కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 111ను దాటింది.

ఫలితంగా రూపాయి ఇంట్రాడేలో 100 పైసలు కోల్పోయి చరిత్రాత్మక కనిష్టం 80.96కు చేరింది. వీటికితోడు ఉక్రెయిన్‌పై దాడికి రష్యా సైనిక బలగాలను పెంచుతుండటంతో సెంటిమెంటు దెబ్బతిన్నట్లు మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. దీంతో మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్‌ 624 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 17,723–17,532 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. అయితే ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగడంతో ఒక దశలో సెన్సెక్స్‌ నామమాత్ర లాభాల్లోకి ప్రవేశించడం గమనార్హం!

మీడియా అప్‌
ఫెడ్‌ బాటలో ఇతర కేంద్ర బ్యాంకులూ కఠిన విధానాలను అవలంబించనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో వర్ధమాన మార్కెట్లలో కరెన్సీలు, ఈక్విటీలు నీరసిస్తున్నట్లు తెలియజేశారు. ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా బ్యాంకింగ్‌ 1.4 శాతం నీరసించగా.. మీడియా, ఎఫ్‌ఎంసీజీ, వినియోగ వస్తువులు, ఆటో రంగాలు 1.9–0.7 శాతం మధ్య బలపడ్డాయి. బ్లూచిప్స్‌లో పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, యాక్సిస్, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఎస్‌బీఐ లైఫ్, ఐసీఐసీఐ, బజాజ్‌ ఫిన్, శ్రీసిమెంట్, బీపీసీఎల్‌ 3–1.2 శాతం మధ్య నష్టపోయాయి. అయితే టైటన్, హెచ్‌యూఎల్, ఏషియన్‌ పెయింట్స్, మారుతీ, ఐషర్, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, ఐటీసీ 2.8–1.4 శాతం మధ్య ఎగశాయి.

చిన్న షేర్లు ఓకే..
తాజాగా చిన్న షేర్లకు డిమాండ్‌  నెలకొంది. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌క్యాప్స్‌ 0.5–0.3 శాతం చొప్పున బలపడ్డాయి.  నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,510 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 263 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి.

స్టాక్‌ హైలైట్స్‌
► పట్టణీకరణతోపాటు వినియోగం పెరుగుతుండటంతో జాకీ బ్రాండ్‌ దుస్తుల కంపెనీ పటిష్ట ఫలితాలు సాధించనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 53,225 వద్ద ముగిసింది.
► రూ. 10 ముఖ విలువగల షేర్లను రూ. 1 ముఖ విలువగల 10 షేర్లుగా విభజిస్తుండటంతో ఐటీ సేవల కంపెనీ శాక్‌సాఫ్ట్‌ షేరు 12 శాతం దూసుకెళ్లి రూ. 1,278 వద్ద స్థిరపడింది.
► ప్రమోటర్‌ సంస్థ విల్మర్‌ తాజాగా వర్కింగ్‌ క్యాపిటల్‌ తదితర అవసరాలకు మద్దతునివ్వడంతో శ్రీ రేణుకా షుగర్స్‌ 6.5% ఎగసి 60.50 వద్ద క్లోజైంది.


ఆల్‌టైమ్‌ కనిష్టానికి రూపాయి
► ఒకేరోజు 83 పైసలు డౌన్‌
► 80.79 వద్ద ముగింపు


అమెరికా ఫెడ్‌ ఫండ్‌ రేటు పెంపు నేపథ్యంలో డాలర్‌ మారకంలో రూపాయి విలువ గురువారం ఒకేరోజు భారీగా 83 పైసలు బలహీనపడి, 80.79 రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో గడచిన ఏడు నెలల్లో (ఫిబ్రవరి 24న 99 పైసలు పతనం) రూపాయి ఒకేరోజు ఈ స్థాయిలో బలహీనపడ్డం ఇదే తొలిసారి. అమెరికా ఫెడ్‌ రేటు పెంపుతోపాటు, రష్యా–ఉక్రెయిన్‌ భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం భయాలు కూడా రూపాయిని వెంటాడుతున్నట్లు ఫారెక్స్‌ ట్రేడర్లు తెలిపారు.

బుధవారం రూపాయి ముగింపు 79.96.  ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 80.27 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ ఒక దశలో ఆల్‌టైమ్‌ ఇంట్రాడేలో 80.96కు కూడా పడిపోయింది. ఫెడ్‌ ఫండ్‌ రేటు పెంపు నేపథ్యంలో ఇక ఇన్వెస్టర్ల దృష్టి ప్రస్తుతం బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌పై ఉన్నట్లు ట్రేడర్లు పేర్కొన్నారు. మరోపక్క, అంతర్జాతీయ మార్కెట్‌లో ఆరు ప్రధాన కరెన్సీల ప్రాతిపదిక లెక్కించే డాలర్‌ ఇండెక్స్‌ 20యేళ్ల గరిష్టం 111 వద్ద ట్రేడవుతోంది. రూపాయి విలువ భారీ నష్టంతో 81.18 వద్ద ట్రేడవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement