రూపాయి పతనంతో నష్టాలే... నష్టాలు | Rupee depreciation double whammy for trade, finds SBI study | Sakshi
Sakshi News home page

రూపాయి పతనంతో నష్టాలే... నష్టాలు

Published Thu, Oct 18 2018 12:33 AM | Last Updated on Thu, Oct 18 2018 12:33 AM

Rupee depreciation double whammy for trade, finds SBI study - Sakshi

న్యూఢిల్లీ: డాలర్‌ మారకంలో రూపాయి విలువ పతనం– ఎగుమతిదారులకు ప్రయోజనకరమన్న వాదన ఉంది. దిగుమతులు తగ్గుతాయన్న విశ్లేషణలూ ఉన్నాయి. అయితే వాస్తవంలో ఇలా జరగాలేదని బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) అధ్యయనం ఒకటి విశ్లేషించింది. వివరంగా చూస్తే...  ఎగుమతుల కోణంలో...: ఎగుమతిదారులు తమ ఎగుమతుల విలువను డాలర్లలో సంపాదించుకుంటారు. ఈ డాలర్లను దేశంలో మార్చుకుంటే, ఎక్కువ రూపాయలు వారి చేతికి అందుతాయి. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత దీనికి కారణం. దేశీయంగా గిట్టుబాటు ధర ఉంటుంది కనక, అంతర్జాతీయంగా భారత్‌ ఎగుమతిదారులు కొంత తక్కువ ‘డాలర్ల’ౖMðనా కాంట్రాక్టులు కుదుర్చుకునే పరిస్థితి ఉంటుందని, దీనివల్ల ప్రపంచ విపణిలో భారత ఎగుమతిదారుకు పోటీతత్వం పెరుగుతుందని, ఆయా పరిస్థితులు దేశం నుంచి ఎగుమతులు మరింత  పెరగటానికి దారి తీస్తాయనేది ఒక విశ్లేషణ.  

దిగుమతుల పరంగా..: ఇక ఏదన్నా ఉత్పత్తి మన దేశానికి దిగుమతి చేసుకుంటే, డాలర్లలో అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల దిగుమతులూ నెమ్మదించే అవకాశం ఉందన్నది అంచనా.  పై రెండు అంశాలనూ పరిగణనలోకి తీసుకుని ఎస్‌బీఐ చేసిన అధ్యయనం... కీలక అంశాలను వెల్లడించింది. రూపాయి బలహీనత వల్ల అటు ఎగుమతులూ పెరగలేదని, ఇటు దిగుమతులూ మందగించలేదని ‘ఇకోరాప్‌’ పేరుతో విడుదలైన ఈ అధ్యయనంలో పేర్కొంది. పైగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) వాణిజ్య లోటు (ఎగుమతులూ– దిగుమతుల మధ్య నికరవ్యత్యాసం) అదనంగా 4 బిలియన్‌ డాలర్లు పెరిగిందని వివరించింది. ‘‘దీనర్ధం ఎగుమతులు తగ్గాయని. దిగుమతులు పెరిగాయని’’ అని పేర్కొంది.   సిద్ధాంతం ప్రకారం– ఒక దేశ కరెన్సీ బలహీనపడితే, ఆ దేశ ఎగుమతులు పెరిగే అవకాశం ఉండడం సహజమే. అయితే రూపాయికన్నా ఎక్కువగా ఇతర దేశాల కరెన్సీలు బలహీనపడుతుండడం వల్ల తాజా పరిస్థితి (రూపాయి పతనం) నుంచి భారత్‌ ప్రయోజనం పొందలేకపోతోంది. పైగా ముడిచమురు సహా కొన్ని ఉత్పత్తులను భారత్‌ తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది.   ఐదు నెలల తర్వాత మొదటిసారి సెప్టెంబర్‌ ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా, –2.15 శాతం క్షీణత నమోదుకావడం మరో అంశం.

నిన్న రికవరీ... నేడు నీరసం! 
న్యూఢిల్లీ: డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. మంగళవారం రూపాయి విలువ బలపడితే, గురువారం మళ్లీ కిందకు జారింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ బుధవారం 13 పైసలు బలహీనపడి, 73.61 వద్ద ముగిసింది. బలహీన దేశీయ ఈక్విటీ మార్కెట్లు, అమెరికన్‌ డాలర్‌ ఇండెక్స్‌ కీలక నిరోధ స్థాయి 95ను దాటడం వంటివి దీనికి నేపథ్యం. ఈ నెల 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు తర్వాత 10,11,12 తేదీల్లో వరుసగా 18, 09, 55 పైసలు చొప్పున మొత్తం 82 పైసలు బలపడింది. అయితే సోమవారం (15వ తేదీ) ట్రేడింగ్‌లో మళ్లీ 26 పైసలు పడిపోయింది. మంగళవారం అంతకుమించి 35 పైసలు లాభపడ్డం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement