మారుతి ధరలకు రెక్కలు
గువహటి: మారుతి సుజుకి కంపెనీ అన్ని మోడళ్ల కార్ల ధరలను రూ.3,000 నుంచి రూ.10,000 వరకూ పెంచుతోంది. ఈ పెరిగిన ధరలు వచ్చే నెల మొదటి వారం నుంచి అమల్లోకి వస్తాయని మారుతి సుజుకి ఇండియా(ఎంఎస్‌ఐ) సీఓఓ(మార్కెటింగ్ అండ్ సేల్స్) మయంక్ పరీక్ చెప్పారు. రూపాయి పతనం కారణంగా ధరలు పెంచుతున్నామని పేర్కొన్నారు. ధరలు ఎప్పుడో పెంచాల్సిందని, కానీ భరించగలిగే స్థాయి వరకూ భరించగలిగామని, ఇక భరించలేని స్థాయికి చేరడంతో ధరలు పెంచక తప్పడం లేదని వివరించారు. మారుతి కంపెనీ రూ. 2.35 లక్షల నుంచి రూ.10.21 లక్షల రేంజ్‌లో ఉన్న వాహనాలను విక్రయిస్తోంది. కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా ఈ ఏడాది జనవరిలోనే ఈ కంపెనీ ధరలను రూ.20,000 వరకూ పెంచింది.
ఒక్క మారుతీ కంపెనీయే కాకుండా పలు వాహన కంపెనీలు కూడా రూపాయి పతనం కారణంగా ధరలను పెంచాయి. హ్యుందాయ్, టయోటా, జనరల్ మోటార్స్ తదితర కంపెనీలు ధరలను పెంచాయి. టాటా మోటార్స్ కంపెనీ కూడా ధరలను పెంచాలని యోచిస్తోంది.