న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగల సీజన్‌లో రికార్డు స్థాయిలో అమ్మకాలు ఉంటాయని మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా అంచనా వేస్తున్నాయి. పరిశ్రమ వార్షిక అమ్మకాల్లో పండుగల సీజన్ వాటా సగటున 23–26 శాతంగా ఉందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ మంగళవారం జరిగిన సియామ్ సదస్సులో తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా అన్ని కంపెనీలవి కలిపి 40.5–41 లక్షల యూనిట్లు అమ్ముడవుతాయని చెప్పారు. ఇందులో పండుగల సీజన్ వాటా 10 లక్షల యూనిట్లు ఉంటుందన్నారు. ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమ తొలిసారిగా 10 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటుందని వెల్లడించారు. ఇప్పటి వరకు దేశంలో 2021లో అత్యధికంగా పండుగల సీజన్‌లో 9.34 లక్షల యూనిట్లు నమోదయ్యాయని వివరించారు.
ఆ రెండూ జరగకపోతేనే..
ఓనమ్ విక్రయాల్లో 24 శాతం వృద్ధి సాధించామని శ్రీవాస్తవ పేర్కొన్నారు. గతేడాది 3.55 లక్షల యూనిట్లతో పోలిస్తే 2023 సెపె్టంబరులో 3.61 లక్షల యూనిట్ల హోల్‌సేల్ అమ్మకాలు ఆశిస్తున్నట్టు చెప్పారు. గ్రామీణ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే అధిక వడ్డీ రేట్లు, రుతుపవనాల లోటు వృద్ధికి అడ్డుకట్ట అని తెలిపారు. ఇవి రెండూ జరగకపోతే ఉపశమనం లభిస్తుందని అన్నారు. ‘వడ్డీ రేట్లు పెరగకూడదు. ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే అవి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మైనస్ 8 శాతంగా నమోదవుతున్న వర్షపాతం కారణంగా గ్రామీణుల మనోభావాలు దెబ్బతినకూడదు’ అని ఆయన పేర్కొన్నారు.
హుందాయ్ వృద్ధి 9 శాతం..
గతేడాదితో పోలిస్తే పండుగల సీజన్‌లో 9 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు హుందాయ్ మోటార్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. ఈ ఏడాది అర్ధ భాగం విక్రయాల్లో ఎస్‌యూవీల వాటా 54 శాతం నమోదైందన్నారు. ఎక్స్‌టర్ రాకతో జూలై, ఆగస్ట్‌లో ఇది 64 శాతానికి ఎగసిందని చెప్పారు. వెయిటింగ్ పీరియడ్ తగ్గిందని, తద్వారా సమయానికి డెలివరీలు అందించేందుకు వీలవుతోందని చెప్పారు. బలమైన తాజా డిమాండ్ రాబోయే కాలానికి మంచి సూచిక అన్నారు. పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment