అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి భారీగా పడుతున్న నేపథ్యంలో పదహారో ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగఢియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ దీర్ఘకాలంలో రూపాయి క్షీణత భారతదేశానికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. 1991లో జరిగిన ఆర్థిక సంస్కరణలతో పోలుస్తూ, స్వల్పకాలంలో రూపాయి విలువ క్షీణిస్తుందని ఆందోళన చెందకూడదని చెప్పారు. ప్రస్తుతం రూపాయి విలువ పడిపోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు భవిష్యత్తులో మంచి చేస్తుందని అంచనా వేశారు.
‘1991లో రూపాయి విలువ క్షీణించడం సవాలుతో కూడుకుంది. కానీ ఈ చర్య భారతదేశ ఆర్థిక సరళీకరణకు మార్గం సుగమం చేసింది. 1991లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.17-18 ఉండగా, 2002-2003 నాటికి రూ.46కు పడిపోయింది. ఈ తరుగుదల 2002లో 50 బిలియన్ డాలర్ల నుంచి 2011-2012 నాటికి 300 బిలియన్ డాలర్లకు భారతదేశ ఎగుమతులు పెరిగేందుకు దోహదపడింది’ అని పనగారియా తెలిపారు. రూపాయి క్షీణించడం వల్ల దిగుమతులపై లైసెన్సింగ్ విధానాలను ప్రభుత్వం మరింత సరళతరం చేసే వీలుంటుందన్నారు. దాంతోపాటు దిగుమతి సుంకాల తగ్గింపులు ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు.
ఇదీ చదవండి: ‘విలీనానికి ఆర్‌బీఐ ఎన్‌ఓసీ అవసరం లేదు’
రూపాయి క్షీణత దిగుమతి ఖర్చులు పెరిగేందుకు, ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అయితే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఈ స్వల్పకాలిక సవాళ్లను అధిగమిస్తాయని పనగఢియా అభిప్రాయపడ్డారు. స్వల్పకాలంలో రూపాయి విలువ మరింత పడిపోకుండా కట్టడి చేస్తూనే దీర్ఘకాలంలో క్షీణించడానికి అనుమతించే ప్రస్తుత విధానాన్ని ఆయన ప్రశంసించారు. ఇది భారతదేశ ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. 2009-2015 మధ్య కాలంలో రూపాయి మారకం రేటు నిర్వహణలో భారత్ తెలివిగా వ్యవహరించిందని పనగఢియా పేర్కొన్నారు. ఈ సమయంలో రూపాయి మార్కెట్లో తన సొంత విలువను ఏర్పరుచుకోవడానికి వీలు కల్పించినట్లు తెలిపారు. ఈ విధానం వల్ల క్వాంటిటేటివ్ ఈజింగ్(సులభతర వాణిజ్యం)ను తగ్గించడం వంటి సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, అంతిమంగా దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో సాయపడిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment