ఈ ఏడాది రూపాయికి అచ్చి రాలేదు. ఏడాదిలో డాలర్(Dollar)తో 3 శాతం మేర తన విలువను కోల్పోయింది. అయినప్పటికీ వర్ధమాన దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయే కాస్త మెరుగ్గా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ అస్థిరతలు కనిపించింది రూపాయి(Rupee)లోనే కావడం విశేషం. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడం కరెన్సీ మార్కెట్లో అస్థిరతలను పెంచింది. నిజానికి ఇతర కరెన్సీలతో పోల్చితే రూపాయి పతనం డాలర్‌లోనే తక్కువగా కనిపించింది. అంతేకాదు యూరో, జపాన్ యెన్‌లతో పోలిస్తే రూపాయి బలపడింది.
2024 జనవరి 1న రూపాయి డాలర్ మారకంలో 83.19 వద్ద ఉంటే, డిసెంబర్ 27 నాటికి 85.59కి బలహీనపడింది. విలువ పరంగా రూ.2 కోల్పోయింది. ముఖ్యంగా కీలకమైన 84 స్థాయి దిగువకు అక్టోబర్ 10న రూపాయి పడిపోయింది. డిసెంబర్ 19న 85 స్థాయినీ కోల్పోయి.. డిసెంబర్ 27న ఫారెక్స్(Forex) మార్కెట్లో 85.80 జీవిత కాల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరికి అదే రోజున 85.59 వద్ద స్థిరపడింది. యెన్‌తో రూపాయి ఈ ఏడాది 8.7 శాతం బలపడింది. జనవరి 1న 100 యెన్‌ల రూపాయి మారకం రేటు 58.99గా ఉంటే, డిసెంబర్ 27 నాటికి 54.26కు చేరింది. అంటే 100 యెన్‌లకు ఆరంభంలో 59 రూపాయిలు రాగా, ఏడాది ముగింపు నాటికి 54 రూపాయలకు యెన్(Yen) విలువ తగ్గిపోయింది.
ఇదీ చదవండి: క్రెడిట్ కార్డు మీ శ్రేయోభిలాషి.. శత్రువు!
యూరో(Euro)తో పోల్చి చూసినప్పుడు రూపాయి విలువ 5 శాతం పెరిగి డిసెంబర్ 27 నాటికి 89.11కు చేరింది. ఈ ఏడాది ఆగస్ట్ 27న అయితే 93.75 కనిష్ట స్థాయిని తాకింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లడంతో రూపాయి విలువ అధికంగా క్షీణించినట్టు ఎల్‌కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. అమెరికా స్థూల ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడడం, వీటి ఆధారంగా రేట్ల కోత విషయంలో నిదానంగా వెళ్లాలని యూఎస్ ఫెడ్ నిర్ణయించడం డాలర్ బలపడడానికి కారణాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. చైనా సహా చాలా దేశాలపై టారిఫ్‌ల మోత మోగిస్తానంటూ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, ఇన్వెస్టర్లు, ట్రేడర్లు డాలర్ కొనుగోళ్లకు మొగ్గు చూపించేలా చేసినట్టు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment