rupee vs dollar
-
రూపాయికి కలిసిరాని ఏడాది!
ఈ ఏడాది రూపాయికి అచ్చి రాలేదు. ఏడాదిలో డాలర్(Dollar)తో 3 శాతం మేర తన విలువను కోల్పోయింది. అయినప్పటికీ వర్ధమాన దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయే కాస్త మెరుగ్గా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ అస్థిరతలు కనిపించింది రూపాయి(Rupee)లోనే కావడం విశేషం. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడం కరెన్సీ మార్కెట్లో అస్థిరతలను పెంచింది. నిజానికి ఇతర కరెన్సీలతో పోల్చితే రూపాయి పతనం డాలర్‌లోనే తక్కువగా కనిపించింది. అంతేకాదు యూరో, జపాన్ యెన్లతో పోలిస్తే రూపాయి బలపడింది.2024 జనవరి 1న రూపాయి డాలర్ మారకంలో 83.19 వద్ద ఉంటే, డిసెంబర్ 27 నాటికి 85.59కి బలహీనపడింది. విలువ పరంగా రూ.2 కోల్పోయింది. ముఖ్యంగా కీలకమైన 84 స్థాయి దిగువకు అక్టోబర్ 10న రూపాయి పడిపోయింది. డిసెంబర్ 19న 85 స్థాయినీ కోల్పోయి.. డిసెంబర్ 27న ఫారెక్స్(Forex) మార్కెట్లో 85.80 జీవిత కాల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరికి అదే రోజున 85.59 వద్ద స్థిరపడింది. యెన్‌తో రూపాయి ఈ ఏడాది 8.7 శాతం బలపడింది. జనవరి 1న 100 యెన్ల రూపాయి మారకం రేటు 58.99గా ఉంటే, డిసెంబర్ 27 నాటికి 54.26కు చేరింది. అంటే 100 యెన్లకు ఆరంభంలో 59 రూపాయిలు రాగా, ఏడాది ముగింపు నాటికి 54 రూపాయలకు యెన్(Yen) విలువ తగ్గిపోయింది.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డు మీ శ్రేయోభిలాషి.. శత్రువు!యూరో(Euro)తో పోల్చి చూసినప్పుడు రూపాయి విలువ 5 శాతం పెరిగి డిసెంబర్ 27 నాటికి 89.11కు చేరింది. ఈ ఏడాది ఆగస్ట్ 27న అయితే 93.75 కనిష్ట స్థాయిని తాకింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లడంతో రూపాయి విలువ అధికంగా క్షీణించినట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. అమెరికా స్థూల ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడడం, వీటి ఆధారంగా రేట్ల కోత విషయంలో నిదానంగా వెళ్లాలని యూఎస్ ఫెడ్ నిర్ణయించడం డాలర్ బలపడడానికి కారణాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. చైనా సహా చాలా దేశాలపై టారిఫ్‌ల మోత మోగిస్తానంటూ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, ఇన్వెస్టర్లు, ట్రేడర్లు డాలర్ కొనుగోళ్లకు మొగ్గు చూపించేలా చేసినట్టు చెబుతున్నారు. -
రూపాయికీ బైడెన్ ‘జో’ష్
ముంబై: డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ 46వ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టనున్న వార్తలతో డాలరు ఇండెక్స్ నీరసిస్తోంది. తాజాగా ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు రెండు నెలల కనిష్టానికి చేరింది. దీంతో వరుసగా మూడో రోజు దేశీ కరెన్సీ పుంజుకుంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో తొలుత 74 దిగువన 73.96 వద్ద ప్రారంభమైంది. తదుపరి ఒక దశలో రూపాయి 73.84 దిగువకు బలపడింది. ప్రస్తుతం 17 పైసల లాభంతో 74.03 వద్ద ట్రేడవుతోంది. వారాంతాన రూపాయి 18 పైసలు జమ చేసుకుని 74.20 వద్ద ముగిసింది. బ్యాంకుల సపోర్ట్ జో బైడెన్ విజయంతో ప్రపంచవ్యాప్తంగా తిరిగి వాణిజ్యం ఊపందుకునే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీనికితోడు ఇప్పటికే అమెరికన్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ సరళతర మానిటరీ విధానాలకు సిద్ధమని ప్రకటించింది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ 190 బిలియన్ డాలర్ల అదనపు సహాయాన్ని ప్రకటించింది. దీంతో బాండ్ల కొనుగోలు ద్వారా అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీ దాదాపు 900 బిలియన్ పౌండ్లకు చేరనున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ అంశాల కారణంగా వాణిజ్య ఆధారిత కరెన్సీల కొనుగోలుకి ట్రేడర్లు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలహీనపడినట్లు తెలియజేశారు. ప్రధానంగా చైనీస్ యువాన్ 28 నెలల గరిష్టాన్ని తాకగా.. న్యూజిలాండ్ డాలరు 19 నెలల గరిష్టానికి చేరింది. కాగా.. దేశీ స్టాక్ మార్కెట్లో ఇటీవల విదేశీ పెట్టుబడులు వెల్తువెత్తుతున్నాయి. దీంతో రూపాయి బలపడుతున్నట్లు ఫారెక్స్ వర్గాలు వివరించాయి. ఈ నెల తొలి 5 రోజుల్లో నగదు విభాగంలో ఎఫ్ పీఐలు రూ. 8,381 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. -
రూపాయి మళ్లీ 60 దిగువకు
ఆరు వారాల కనిష్టానికి పతనం 60.16 వద్ద ముగింపు ముంబై: ఇరాక్ సంక్షోభంతో చమురు ధరలు పెరుగుతుండటం దేశీ కరెన్సీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయిల్ కంపెనీల నుంచి డాలర్లకు డిమాండ్ ఎగియడం వల్ల రూపాయి మారకం విలువ అంతకంతకూ క్షీణిస్తోంది. సోమవారం మరో 39 పైసలు క్షీణించి 60 స్థాయి దిగువకి పడిపోయింది. ఆరు వారాల కనిష్టమైన 60.16 వద్ద ముగిసింది. అటు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం పెరగడం, ఇటు దేశీ స్టాక్‌మార్కెట్లు బలహీనంగా ఉండటం సైతం రూపాయిపై మరింత ఒత్తిడి పెంచాయి. ఇరాక్ సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు తొమ్మిది నెలల గరిష్టానికి ఎగియడంతో చమురు దిగుమతి సంస్థలు తదుపరి కొనుగోళ్ల కోసం తప్పనిసరిగా మరిన్ని డాలర్లను సమకూర్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. ఇది రూపాయి మారకంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వివరించారు. సోమవారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 59.77తో పోలిస్తే కాస్త బలహీనంగా 59.82 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒక దశలో 59.80కి పెరిగినా చివరికి 0.65 శాతం క్షీణించి 60.16 వద్ద క్లోజయ్యింది. గత శుక్రవారం కూడా దేశీ కరెన్సీ 52 పైసలు (0.88 శాతం) మేర పతనమైన సంగతి తెలిసిందే. భౌగోళికపరమైన రాజకీయ రిస్కులు, దేశీయంగా రుతుపవనాల ఆలస్యం, అంచనాలు మించి పెరిగిన ద్రవ్యోల్బణం .. అన్నీ కలగలిసి రూపాయికి ప్రతికూలంగా మారాయని కోటక్ సెక్యూరిటీస్ కరెన్సీ అనలిస్టు అనింద్య బెనర్జీ తెలిపారు. ఇరాక్ సంక్షోభం నేపథ్యంలో బలహీనంగా ట్రేడవుతున్న రూపాయి.. గడిచిన రెండు రోజుల్లో ఒకటిన్నర శాతం మేర తగ్గిందని వెరాసిటీ గ్రూప్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. డాలర్‌తో రూపాయి ట్రేడింగ్ శ్రేణి స్పాట్ మార్కెట్లో 59.70-60.80 మధ్య ఉండగలదని చెప్పారు. ఎకానమీకి సమస్య.. రూపాయి అకస్మాత్తుగా బలహీనపడటం, క్రూడ్ ధరలు ఎగుస్తుండటం వంటి పరిణామాలు .. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఎకానమీ, వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. దేశీ కరెన్సీ స్థిరపడితే గానీ పరిస్థితులు మళ్లీ చక్కబడకపోవచ్చని వారు చెప్పారు. అయితే, రూపాయి మారకం త్వరలోనే స్థిరపడగలదని, సెప్టెంబర్ క్వార్టర్లో సగటున 58.5గా ఉండొచ్చని జైఫిన్ రీసెర్చ్ చీఫ్ ఎకానమిస్టు దేబోపమ్ చౌదరి తెలిపారు.