రూపాయి మళ్లీ 60 దిగువకు
- ఆరు వారాల కనిష్టానికి పతనం
- 60.16 వద్ద ముగింపు
ముంబై: ఇరాక్ సంక్షోభంతో చమురు ధరలు పెరుగుతుండటం దేశీ కరెన్సీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయిల్ కంపెనీల నుంచి డాలర్లకు డిమాండ్ ఎగియడం వల్ల రూపాయి మారకం విలువ అంతకంతకూ క్షీణిస్తోంది. సోమవారం మరో 39 పైసలు క్షీణించి 60 స్థాయి దిగువకి పడిపోయింది. ఆరు వారాల కనిష్టమైన 60.16 వద్ద ముగిసింది.
అటు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం పెరగడం, ఇటు దేశీ స్టాక్‌మార్కెట్లు బలహీనంగా ఉండటం సైతం రూపాయిపై మరింత ఒత్తిడి పెంచాయి. ఇరాక్ సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు తొమ్మిది నెలల గరిష్టానికి ఎగియడంతో చమురు దిగుమతి సంస్థలు తదుపరి కొనుగోళ్ల కోసం తప్పనిసరిగా మరిన్ని డాలర్లను సమకూర్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. ఇది రూపాయి మారకంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వివరించారు.
సోమవారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 59.77తో పోలిస్తే కాస్త బలహీనంగా 59.82 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒక దశలో 59.80కి పెరిగినా చివరికి 0.65 శాతం క్షీణించి 60.16 వద్ద క్లోజయ్యింది. గత శుక్రవారం కూడా దేశీ కరెన్సీ 52 పైసలు (0.88 శాతం) మేర పతనమైన సంగతి తెలిసిందే. భౌగోళికపరమైన రాజకీయ రిస్కులు, దేశీయంగా రుతుపవనాల ఆలస్యం, అంచనాలు మించి పెరిగిన ద్రవ్యోల్బణం .. అన్నీ కలగలిసి రూపాయికి ప్రతికూలంగా మారాయని కోటక్ సెక్యూరిటీస్ కరెన్సీ అనలిస్టు అనింద్య బెనర్జీ తెలిపారు. ఇరాక్ సంక్షోభం నేపథ్యంలో బలహీనంగా ట్రేడవుతున్న రూపాయి.. గడిచిన రెండు రోజుల్లో ఒకటిన్నర శాతం మేర తగ్గిందని వెరాసిటీ గ్రూప్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. డాలర్‌తో రూపాయి ట్రేడింగ్ శ్రేణి స్పాట్ మార్కెట్లో 59.70-60.80 మధ్య ఉండగలదని చెప్పారు.
ఎకానమీకి సమస్య..
రూపాయి అకస్మాత్తుగా బలహీనపడటం, క్రూడ్ ధరలు ఎగుస్తుండటం వంటి పరిణామాలు .. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఎకానమీ, వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. దేశీ కరెన్సీ స్థిరపడితే గానీ పరిస్థితులు మళ్లీ చక్కబడకపోవచ్చని వారు చెప్పారు. అయితే, రూపాయి మారకం త్వరలోనే స్థిరపడగలదని, సెప్టెంబర్ క్వార్టర్‌లో సగటున 58.5గా ఉండొచ్చని జైఫిన్ రీసెర్చ్ చీఫ్ ఎకానమిస్టు దేబోపమ్ చౌదరి తెలిపారు.