
బంగారంపై మోజు తగ్గించుకోండి: ప్రధాని
రూపాయి పతనం ఆందోళనకర పరిణామమని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు.
రూపాయి పతనం ఆందోళనకర పరిణామమని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఊహించని అంతర్జాతీయ పరిణామాలతోనే రూపాయి రికార్డు స్థాయికి పడిపోయిందని ఆయన తెలిపారు. లోక్సభలో దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని ప్రకటన చేశారు. ప్రపంచ దేశాల కరెన్సీ బలహీనపడడానికి అమెరికా ఫెడరల్ బ్యాంకు తీసుకున్న నిర్ణయాలే కారణమని మన్మోహన్ సింగ్ అన్నారు.
బంగారంపై వ్యామోహం తగ్గించుకోవాలని, చమురు ఉత్పత్తులను పొదుపుగా వాడుకోవాలని దేశ ప్రజలను ప్రధాని కోరారు. పసిడి కొనుగోళ్లకు ఎగబడవద్దని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కరెంట్ ఖాతా లోటును 70 బిలియన్ డాలర్లకు తగ్గిస్తామన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
రూపాయి పతనంతో అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్లో ద్రవ్యోల్బణం అధికంగా ఉందని తెలిపారు. రూపాయి విలువ తగ్గడం, ముడి చమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం అధికమయిందని వివరించారు. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ, ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నాయని చెప్పారు.