ఆర్‌బీఐ నిర్ణయం... మార్కెట్లకు మార్గదర్శకం! | RBI policy to set the course of market movement | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ నిర్ణయం... మార్కెట్లకు మార్గదర్శకం!

Published Mon, Jun 4 2018 1:18 AM | Last Updated on Mon, Jun 4 2018 7:55 AM

RBI policy to set the course of market movement - Sakshi

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ పాలసీ కమిటీ సమీక్షా సమావేశం నిర్ణయాలు, అంతర్జాతీయ అంశాలు ఈ వారం మార్కెట్లను నడిపించనున్నాయి. అలాగే, స్థూల ఆర్థిక అంశాల ప్రభావం కూడా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ‘‘అంతర్జాతీయంగా బాండ్‌ ఈల్డ్స్, చమురు ధరలు, వాణిజ్య ఘర్షణలపై మార్కెట్‌ దృష్టి ఉంటుంది. అలాగే, అధిక చమురు ధరల ప్రభావం, ద్రవ్యోల్బణంపై కనీస మద్దతు ధరల ప్రభావం నేపథ్యంలో దేశీయంగా పాలసీ రేట్లపై ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

వరుసగా మూడో ఏడాది సాధారణ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనాలు ప్రకటించింది. అయితే, సకాలంలో సరైన వర్షపాతం అన్నది కీలకాంశంగా చూడాల్సి ఉంటుంది’’అని కోటక్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ టీనా విర్మాణి తెలిపారు. ఆర్‌బీఐ పాలసీ సమీక్ష నిర్ణయం ఈ నెల 6న వెలువడనుంది. ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల నేపథ్యంలో 2017 ఆగస్ట్‌ నుంచి ఆర్‌బీఐ కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తోంది.

ఇక, సేవల రంగం పీఎంఐ డేటా కూడా మార్కెట్‌పై ప్రభావం చూపిస్తుందంటున్నారు నిపుణులు. ‘‘అధిక చమురు ధరల ప్రభావంతో  ధరలు పెరిగి ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఎంపీసీ రేట్లను పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ రేట్ల పెంపు భయాలు ఈ వారం మార్కెట్లను నియంత్రించొచ్చు’’ అని శామ్‌కో సెక్యూరిటీస్‌ సీఈవో జిమీత్‌ మోదీ తెలిపారు.  

‘మే’లో ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలు  
గత నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మన క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి రూ.29,714 కోట్లను ఉపసంహరించుకెళ్లారు. 18 నెలల్లో ఈ స్థాయిలో నిధులు వెనక్కి వెళ్లిపోవడం మే నెలలోనే జరిగింది. ఏప్రిల్‌ నెలలోనూ రూ.15,561 కోట్లను ఎఫ్‌పీఐలు ఉపసంహరించుకోవడం గమనార్హం. మేనెలలో ఈక్విటీల నుంచి ఎఫ్‌పీఐలు రూ.10,060 కోట్లను నికరంగా వెనక్కి తీసుకున్నారు.

డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.19,654 కోట్లను తీసేసుకున్నారు. 2016 నవంబర్‌లో ఎఫ్‌పీఐలు మన క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి భారీ స్థాయిలో రూ.39,396 కోట్లను వెనక్కి తీసేసుకున్న తర్వాత మరోసారి గరిష్ట స్థాయి అవుట్‌ఫ్లో ఈ మే నెలలో చోటు చేసుకుంది. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌పీఐల నికర అమ్మకాలు రూ.2,100 కోట్లు కాగా, డెట్‌ మార్కెట్లో రూ.30,000 కోట్లుగా ఉన్నాయి.

చమురు ధరలు పెరగడంతో ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ప్రాఫిట్‌ బుకింగ్, సెబీ నిబంధనల మేరకు అదనపు పత్రాలను సమర్పించాల్సి రావడం వంటి అంశాలు ఎఫ్‌పీఐలు అధికంగా ఉపసంహరించుకోవడానికి కారణాలుగా ‘గ్రో’ సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement