న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఈసారి కూడా కీలక పాలసీ వడ్డీరేట్లను యథాతథంగానే కొనసాగించవచ్చని బ్యాంకర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు(క్రూడ్) ధరలు ఎగబాకుతుండటం, దేశీయంగా ద్రవ్యోల్బణం రిస్కులు పొంచిఉండటమే దీనికి ప్రధాన కారణమనేది వారి అంచనా.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018–19) తొలి ద్వైమాసిక పరపతి విధాన సమీక్షను ఈ నెల 4–5 తేదీల్లో ఆర్‌బీఐ చేపట్టనుంది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) దీన్ని నిర్వహిస్తుంది. 5న విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. మరోపక్క, బడ్జెట్లో ద్రవ్యలోటు లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం కాస్త కుదించిన(ఆర్థిక క్రమశిక్షణ గాడితప్పడం) నేపథ్యంలో ఆర్‌బీఐ పాలసీలో ఎలాంటి చర్యలు చేపడుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
కత్తిమీద సామే...
రిటైల్ ద్రవ్యోల్బణం దిగొస్తుండటంతో వృద్ధికి ఊతమిచ్చేందుకు వీలుగా వడ్డీరేట్లను తగ్గించాలంటూ ఆర్‌బీఐపై కార్పొరేట్లు తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. డిసెంబర్‌లో 5.2 శాతానికి ఎగబాకిన రిటైల్ ద్రవ్యోల్బణం... జనవరిలో మళ్లీ కాస్త శాంతించి 5.02 శాతానికి, ఫిబ్రవరిలో మరింత తగ్గి 4.4 శాతానికి దిగొచ్చింది.
అయితే, ఒకపక్క క్రూడ్ ధర పెరుగుదల ధోరణి(ఇటీవలే బ్రెంట్ క్రూడ్ 70 డాలర్లను తాకింది), ప్రపంచవ్యాప్తంగా వడ్డీరేట్లు ఎగబాకుతుండటంతో పాలసీ నిర్ణయం విషయంలో ఆర్‌బీఐకి సవాళ్లు ఎదురవుతున్నాయి. తాజా సమీక్షలో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మరో పావు శాతం వడ్డీరేటును పెంచడంతోపాటు(1.75 శాతానికి) ఈ ఏడాది మరో రెండు సార్లు పెంచుతామన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం రెపోరేటు(బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక నిధులపై వసూలు చేసే వడ్డీరేటు) 6 శాతం, రివర్స్ రెపో రేటు(బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద ఉంచే నిధులపై లభించే వడ్డీరేటు) 5.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(బ్యాంకుల తమ డిపాజిట్ నిధుల్లో ఆర్‌బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన పరిమాణం) 4 శాతంగా కొనసాగుతున్నాయి.
ఎవరేమంటున్నారు...
బ్రోకరేజి సంస్థలు: ఆర్‌బీఐ పాలసీ సమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగానే కొనసాగిస్తూ.. తటస్థ వైఖరిని అవలంభించే అవకాశం ఉందని అమెరికా బ్రోకరేజి దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకులు అంచనా వేశారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్(బీఓఎఫ్‌ఏ–ఎంఎల్) కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే, వర్షాలు బాగా కురిస్తే... ఆగస్టులో రేట్ల కోతకు ఆస్కారం ఉందని పేర్కొంది. మార్చి త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 4.6 శాతంగా నమోదుకావచ్చని... ఆర్‌బీఐ అంచనా(5.1 శాతం) కంటే ఇది తక్కువేని తెలిపింది.
బ్యాంకర్లు: 2018–19 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5% స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందని... ఈ నేపథ్యంలో కొన్నాళ్లపాటు వడ్డీరేట్లలో మార్పులు ఉండకపోవచ్చని కోటక్ మహీంద్రా బ్యాంక్ అభిప్రాయపడింది. ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో కుదుపులు, ముడిచమురు ధరలు అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో రుతుపవనాలపై స్పష్టత వచ్చే వరకూ ఆర్‌బీఐ వడ్డీరేట్లపై యథాతథ ధోరణిని అవలబించవచ్చు’ అని పేర్కొంది.
పారిశ్రామిక మండళ్లు: అంతర్జాతీయంగా క్రూడ్ ధర పెరుగుదలతో పాటు రైతులకు ఉత్పాదక వ్యయంపై ఒకటిన్నర రెట్లు మద్దతు ధరను(ఎంఎస్‌పీ) అందిస్తామంటూ బడ్జెట్లో కేంద్రం ప్రకటించడం కూడా ద్రవ్యోల్బణం ఎగబాకేందుకు ఆజ్యం పోస్తుందని పారిశ్రామిక మండళ్లు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రేట్ల కోతకు ఆస్కారం లేదని, ఆర్‌బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులూ చేయకపోవచ్చని అసోచామ్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment