ద్రవ్యోల్బణానికి ఇరాక్ సెగ : ముకేశ్
ముంబై: ఇరాక్ సంక్షోభంతో ఇంధన ధరలు పెరుగుతాయనీ, తద్వారా ద్రవ్యోల్బణం పెకైగుస్తుందనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చెప్పారు. గురువారం ముంబైలో జరిగిన ఇండియా మర్చెంట్స్ చాంబర్ (ఐఎంసీ) 106వ వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇరాక్‌లో అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి ముడి చమురు ధరలు 4 శాతం పెరిగాయన్నారు. సంక్షోభం మరింత తీవ్రరూపం దాలిస్తే క్రూడ్ దిగుమతి బిల్లు రెండు వేల కోట్ల డాలర్లమేరకు పెరిగి 20 వేల కోట్ల డాలర్లకు చేరే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నట్లు తెలిపారు.
భారత ఆర్థికాభివృద్ధిని ఎవరూ ఆపలేరనీ, అయితే విద్య, మౌలిక సౌకర్యాల్లో వెనుకంజలో ఉండడం అభివృద్ధికి అవరోధంగా మారిందనీ అంబానీ వ్యాఖ్యానించారు. తానెప్పటికీ ఆశావాదిగానే ఉంటానన్నారు. భారత్ 2020 నాటికి సాధించగలదనుకున్నది 2010 నాటికే సాధించిందని అన్నారు. సమాచార రంగం వచ్చే 5-10 ఏళ్లలో భారతీయుల జీవనాన్ని సంపూర్ణంగా మార్చేస్తుందని జోస్యం చెప్పారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఐఎంసీ నూతన అధ్యక్షునిగా ప్రబోధ్ ఠక్కర్, ఉపాధ్యక్షునిగా దిలీప్ పిరమల్‌ను ఎన్నుకున్నట్లు సమావేశంలో ప్రకటించారు.