Iraq crisis
-
నకిలీ ఖలీఫా మిథ్యా సామ్రాజ్యం
ఖలీఫాగా ప్రకటించుకున్న ఐఎస్ఐఎస్ నేత బాగ్దాదీ తమను వ్యతిరేకించే సున్నీ మత పెద్దలను సైతం హతమారుస్తున్నారు. నైనివే రాష్ట్రంలో ఈ సున్నీ ఉగ్రమూకలను సున్నీలే తరిమికొడుతున్నారు. ఇరాక్ సంక్షోభం షియా, సున్నీ ఘర్షణ అనేది భ్రమని తేలుతోంది. నేడు ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రముఖ వ్యక్తి ఎవరు? నిస్సంశయంగా డాక్టర్ ఇబ్రహీం అల్ బద్రి. పేరును మార్చి, మారు వేషం దాల్చి ఇరాక్ అగ్నిగుండం మంటల్లో వెలిగిపో తున్న అబూ బకర్ అల్ బాగ్దాదీ. ప్రపంచవ్యాప్త ఇస్లామిక్ సామ్రాజ్యపు ‘ఖలీఫా’గా అవతరించడానికి ముందు ఆయన నామధేయం అదే. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంత్ అధినేతగా వెలుగులోకి వచ్చి ప్రపంచానికి అధినాయకునిగా మారిపోయిన ఇబ్రహీం... మహ్మద్ ప్రవక్త మామ, మధ్య యుగాల నాటి ప్రముఖ ఖలీఫా అబూ బకర్ అల్ బాగ్దాదీ వేషం కట్టారు. కానీ నిజంగా ఖలీఫాల కాలమైతే అతన్ని ఇస్లాం నుంచి వెలివేసేవారే. ఖలీఫా అబూ బకర్ నుండి చిట్ట చివరి ఖలీఫా అబ్దుల్ మెసిద్ (1868-1944) వరకు అంతా గొప్ప వివేచనాపరులు, పండితులు. ప్రపంచ వైజ్ఞానిక, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు ఇస్లాం నాగరికత అందిం చిన గొప్ప వారసత్వ సంపదకు కారకులు. వారందరికీ భిన్నంగా నేటి నకిలీ ఖలీఫా ‘ప్రతి ఒక్కరినీ చంపండి’ అనే సందేశాన్ని, మసీదులను, ఇస్లామిక్ సాంస్కృతిక వారసత్వ సంపదను కూల్చే కర్తవ్యాన్ని ప్రబోధిస్తున్నాడు. ఇరాక్ సంక్షోభమంతా షియా, సున్నీల గొడవగా అంత ర్జాతీయ మీడియా పలికింది. కానీ ఈ కొత్త దేవుడికి అలాం టి వివక్ష లేదు. ఎవరినైనా చంపడమే. ఈ నెల 6న ‘ఖలీఫా ఇబ్రహీం’ ప్రపంచానికి తొలిసారిగా దర్శనమిచ్చిన మొసుల్ లోని సుప్రసిద్ధ నురిద్దిన్ మసీదు ఇమాం మొహ్మద్ అల్ మన్సూరీ సహా మొసుల్‌కు చెందిన 13 మంది సున్నీ మత పెద్దలను జూన్ 12, 14 తేదీల్లో హతమార్చారని ఐరాస మానవహక్కుల సంస్థ తెలిపింది. ఉగ్రవాదానికి కుల, మత, జాతి విభేదాలు ఉండవు. మొసుల్లోని సున్నీ మతపెద్దలను హతమార్చి అదే నురిద్దిన్ మసీదు నుండి కొత్త దేవుడు ప్రపంచానికి దర్శనమిచ్చాడు. పశ్చిమం నుంచి తూర్పు వరకు ముస్లింల ప్రపంచ విజయ యాత్రే తన లక్ష్యమని ప్రకటించాడు. ఇరాక్‌లోని నూర్ అల్ మలికి ప్రభుత్వాన్ని ఆదుకో డానికి అమెరికా పంపానన్న దాదాపు మూడు వందల మంది సైనిక నిపుణులు అమెరికా రాయబార కార్యాలయం దాటి కాలు బయటపెట్టిన పాపాన పోలేదు. మానవ రహిత ద్రోన్ విమానాల దాడులకు ముహూర్తం కోసం అది వేచి చూస్తేనే ఉంది. ఏ ముహూర్తాల గొడవ లేకుండా ఇరాన్ తన ప్రత్యేక సైనిక దళాలను రంగంలోకి దించి కొత్త దేవుడి సేనలకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ‘ఖలీఫా ఇబ్రహీం’ పుట్టి పెరి గిన సమారాలోని సుప్రసిద్ధ షియా మసీదును ఐఎస్ఐఎస్ దాడుల నుంచి కాపాడినది ఇరాన్ దళాలే. రష్యా కావాల్సిన ఆయుధ సంపత్తినంతటినీ అడగకుండానే పంపుతోంది. ఐఎస్ఐఎస్ తిరుగుబాటు వెనుక ఉన్నది సౌదీ అరేబియా అని అంతర్జాతీయ మీడియా ఢంకా బజాయించింది. ఆశ్చ ర్యకరంగా ఐఎస్ఐఎస్ ధాటికి ఇరాక్ సేనలు సరిహద్దుల నుంచి ఉపసంహరించుకోవడంతోనే... ఇరాక్ సరిహద్దులకు అది 30 వేల సైన్యాన్ని తరలించింది. అఫ్ఘాన్ నుండి సిరియా వరకు అమెరికా ఎక్కడికి పంపమంటే అక్కడికి సున్నీ జిహా దీలను తరలించడానికి సిద్ధంగా ఉండిన సౌదీ ఐఎస్ఐఎస్ ‘జిహాదీల’ విజయయాత్రకు ఎందుకు భయపడుతోంది? మలికికి సహాయం అందించే విషయంలో అమెరికా కొంగ జపానికి, ఇరాక్ పరిణామాలు సౌదీ వెన్నులో చలి పుట్టించడానికి కారణం ఒక్కటే. గాజాపై యుద్ధం సాగిస్తున్న ఇజ్రాయెల్‌ను ‘ఖలీఫా’ మాటవరసకైనా ఖండించడం లేదు. ఆ దాడుల్లో అమాయక పౌరులు మరణిస్తుండటంపై వెల్లువె త్తుతున్న నిరసనకు భయపడి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యా హూ గాజా పౌర మరణాల పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ మొసలి కన్నీరు కార్చారు. ‘ఖలీఫా ఇబ్రహీం’ వద్ద అవి కూడా లేవు. తెలిసిగానీ తెలియకగానీ అభినవ ఖలీఫా యూదు ఇజ్రాయెల్‌కు ఆనందం కలిగించేలా అరబ్బు ప్రపంచంలో చిచ్చు రగిల్చాడు. ఇబ్రహీం కడుతున్న ఖలీఫా సామ్రాజ్యం పేక మేడ అప్పుడే కూలడం మొదలెంది. నైనివే రాష్ట్రంలో సున్నీ మిలీషియాలు ఐఎస్ఐఎస్ మూకలను తరమడం ప్రారంభించారు. సున్నీలలో అతి పెద్ద పార్టీ నేత ఆ రాష్ట్ర గవర్నర్ అల్ నుజాయిఫ్ ఐఎస్ఐఎస్ వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహిస్తున్నారు. తాజాగా బాగ్దాద్ లో మలికికి వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటు జరగనున్న దని పాశ్చాత్య మీడియా లీకులిస్తోంది. సీఐఏ... ఐఎస్ఐఎస్ ఆట ముగించి సైనిక కుట్ర ఆటకు తెరదీసిందా? కావచ్చు. కానీ అది సృష్టించిన ఐఎస్ఐఎస్ దానికి వ్యతిరేకంగానే పో రాటానికి దిగే రోజుల కోసం అది ఎదురు చూడక తప్పదు. పిళ్లా వెంకటేశ్వరరావు -
ఇరాక్ సంక్షోభం... భారత్‌కు సంకటం
అగ్రరాజ్యం అమెరికాలో ఆర్థిక మాంద్యం సంభవించినా... చమురు ఉత్పత్తి దేశాల్లో సంక్షోభ పరిణామాలు తలెత్తినా... మన భారత ఆర్థిక వ్యవస్థ కొంత మేర కుదుపులకు లోనవ్వాల్సి వస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద చమురు వినియోగ దేశాల్లో నాలుగో స్థానంలో ఉన్న భారత్... చమురు కోసం సౌదీ అరేబియా, దుబాయ్, ఇరాక్ లాంటి గల్ఫ్ దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే ఆయా దేశాల్లో ఎలాంటి ప్రతికూలతలు తలెత్తినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భారత్‌పై ప్రభావం పడుతోంది. గత నెలరోజులుగా ఇరాక్‌లో నెలకొన్న అంతర్గత సంక్షోభమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. స్వాతంత్య్రానంతరం భారత్ మధ్య ప్రాచ్య (Middle East) దేశాలతో దౌత్యపరమైన సంబంధాలను ప్రారంభించింది. ఆ క్రమంలో ప్రధానమైన అతి కొద్ది దేశాల్లో ఇరాక్ ఒకటి. 1952లో రెండు దేశాలు శాశ్వత శాంతి, స్నేహం (Treaty of Perpetual Peace and Friendship) ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇరాక్‌లో బాత్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వాన్ని మొదటగా భారత్ గుర్తించింది. 1965 భారత్-పాక్ యుద్ధ సమయంలోనూ ఇరాక్ తటస్థంగా వ్యవహరించింది. అదే క్రమంలో భారత్, ఇరాక్‌ల మధ్య పటిష్టమైన ఆర్థిక, సైనిక సహకారం కొనసాగుతూ వచ్చింది. బాసటగా: 1980వ దశకం ఆరంభంలో 120 ఇరాకీ మిగ్-21 పైలట్లకు భారత వాయుసేన శిక్షణనిచ్చింది. భారత్ అణు పరీక్షలు నిర్వహించే విషయంలో ఇరాక్ బాసటగా నిలిచింది. అప్ప టి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ కాశ్మీర్ వివాదం విషయంలో భారత్‌కు పూర్తి మద్దతునిచ్చారు. 2003లో ఇరాక్‌పై అమెరికా దాడి సమయంలో భారత్ తటస్థంగా వ్యవహరించింది. ఇరాక్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాక్‌తో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. 2005 తర్వాత ఇరాక్‌లో ఎన్నికైన నూతన ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం భారత్‌తో వాణిజ్య సంబంధాల మెరుగుకు ఆసక్తి చూపింది. ఆ మేరకు ఇటీవల ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు మెరుగయ్యాయి. ఇరాక్ ప్రతిరోజు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కు 2,20,000 బ్యారల్స్ చమురును ఎగుమతి చేస్తుంది. ద్వైపాక్షిక వాణిజ్యం: మార్చి, 2003 తర్వాత ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు తగ్గినప్పటికీ.. ఇటీవల కాలంలో వాణిజ్య వృద్ధి అధికంగా నమోదవుతుంది. ఇరాక్ నుంచి భారత్ క్రూడ్ చమురును మాత్రమే కాకుండా ముడి ఉన్ని (ట్చఠీ ఠీౌౌ), సల్ఫర్‌ను దిగుమతి చేసుకుంటుంది. భారత్ ఆగ్రో కెమికల్స్, కాస్మోటిక్స్, రబ్బర్ ఉత్పత్తులు, సిరామిక్స్, పెయింట్స్, ఎలక్ట్రికల్ మెషినరీ, వజ్రాలు, ఆభరణాలు, మెషీన్ టూల్స్, రవాణా పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, హ్యాండిక్రాఫ్ట్, పంచదార, టీ, గార్మెంట్స్, ఫార్మాస్యూటికల్స్‌ను ఇరాక్‌కు ఎగుమతి చేస్తుంది. 2010 నుంచి ఇరాక్‌కు సంబంధించి భారత్ ఎగుమతుల వివరాలు.. సంవత్సరం విలువ (మిలియన్‌డాలర్లలో) 2010-11 678.14 2011-12 763.97 2012-13 1278.13 ఇరాక్ నుంచి భారత్ దిగుమతుల వివరాలు.. సంవత్సరం విలువ (మిలియన్‌డాలర్లలో) 2010-11 9008.30 2011-12 18918.47 2012-13 19247.31 ఈ ఎగుమతులు, దిగుమతుల వివరాలను క్షుణ్నంగా పరిశీలిస్తే.. ఈ రెండు అంశాల్లో ప్రతి సంవత్సరం నమోదవుతున్న పురోగతి స్పష్టమవుతోంది. సౌదీ అరేబియా తర్వాత మనకు అధికంగా చమురు సరఫరా చేస్తున్న దేశం ఇరాక్. 2013-14లో భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో ఇరాక్ వాటా 13 శాతంగా ఉంది. తాజా సంక్షోభం: ఇరాక్.. గత నాలుగువారాలుగా మిలిటెంట్ల మారణహోమంతో చిగురుటాకులా వణికిపోతోంది. ప్రధానంగా రెండు మత వర్గాలైన సున్నీలు, షియాల మధ్య చెలరేగిన కార్చిచ్చు వందల మందిని పొట్టనబెట్టుకుంది. ఈ సున్నితమైన అంశాన్ని చల్లార్చడంలో అక్కడి ప్రభుత్వం సైతం విఫలమైందనే చెప్పాలి. ఇరాక్‌లోని సున్నీలు సిరియాలోని సున్నీలతో చేతులు కలపడం ద్వారా ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా’ (ISI) అనే సంస్థతో మొదలైన పౌర యుద్ధం (సివిల్ వార్ ) దేశమంతా వ్యాపించింది. సాయుధ ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు ప్రధాన ఆదాయ వనరులైన ఆయిల్ రిఫైనరీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.జూన్ 17న ఉత్తర బాగ్దాద్‌లోని సలాహిద్దీన్ ప్రావిన్స్ పరిధిలో బైజీగా పిలిచే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని ఆక్రమించారు. ఇరాక్‌లోని మూడు ప్రధాన రిఫైనరీల్లో బైజీ ఒకటి. అలాగే ఇరాక్‌లో రెండో అతిపెద్ద పట్టణమైన మోసుల్ మిలిటెంట్ల చేతుల్లోకి వెళ్లింది. మధ్య ప్రాచ్య ప్రాంతంలో ఇస్లాం మతంలోని రెండు వర్గాలైన షియా, సున్నీల మధ్య ఏర్పడిన అపనమ్మకాలు ఇరాక్‌లో ప్రస్తుత దుస్థితికి దారితీశాయి. షియాల ఆధిపత్యంపై తిరుగుబాటు: సద్దాం హుస్సేన్ పాలన అనంతరం అమెరికా కనుసన్నల్లో షియా అనుకూల ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం మైనారిటీలైన సున్నీలు, కుర్దుల పట్ల నిర్దయగా వ్యవహరించడం ప్రారంభించింది. దాంతో వారిలో అసంతృప్తి పెరిగి, తిరుగుబాటుకు దారితీసింది. ఐఎస్ఐఎస్ మిలింటెంట్లు కొన్ని వందల చదరపు మైళ్ల భూభాగాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. షియాలపై సున్నీల తిరుగుబాటు మొదటిసారి 2006లో జరిగింది. ఈ తిరుగుబాటుకు ఆల్‌ఖైదాకు చెందిన అబూ ముసబ్ అల్ జర్క్వి (Abu Musab Al Zarqawi) నాయకత్వం వహించాడు. ఈ దాడుల్లో ముఖ్యంగా షియాల ప్రార్థనా మందిరమైన అల్- అస్కారియా (Al-Askaria) మసీదుపై బాంబుల వర్షం కురిసింది. అమెరికన్ దళాల చేతిలో తిరుగుబాటుకు నేతృత్వం వహించిన వ్యక్తి హతమయ్యాడు. అప్పట్లోనే అమెరికా సైన్యం మళ్లీ ఈ విధమైన తిరుగుబాటు తలెత్తే ప్రమాదం ఉందని భావించింది. ఊహించిన విధంగానే మళ్లీ తిరుగుబాటు ప్రారంభమైంది. ఇరాక్, సిరియాల్లోని సున్నీలు నివసించే ప్రాంతాలను కలిపి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్‌తోపాటు, మరికొన్ని అంశాలను ప్రభుత్వం నెరవేర్చాలని పట్టుబట్టింది. ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా’ డిమాండ్లు ఇరాక్, సిరియా దేశాల్లోని సున్నీలు నివసించే ప్రాంతాలను కలిపి ప్రత్యేక దేశంగా ప్రకటించాలి. షరియా చట్టాలను (Sharia laws) అమలు చేయాలి. పాఠశాల స్థాయిలో బాలురు, బాలికలను వేరు చేయాలి. మహిళలు తప్పనిసరిగా నిఖాబ్ (ూఐఖఅఆ) ధరించాలి. సంగీతంపై పూర్తిగా నిషేధం విధించాలి. రంజాన్ సమయాల్లో ఉపవాసాన్ని నిర్బంధంగా అమలు చేయాలి. భారత్‌పై ప్రభావం: ఇరాక్‌లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ప్రధాన ఆదాయ వనరులు, ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టు వంటి చమురు శుద్ధి కర్మాగారాలపై తిరుగుబాటు దళాలు దాడులకు పాల్పడుతున్నాయి. అంతటితో ఆగకుండా జనహననానికి ఐఎస్ఐఎస్తిరుగుబాటు బృందం తెగబడుతోంది. 40 మంది భారతీయులను నిర్బంధించింది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితిని భారత్ నిశితంగా గమనిస్తోంది. ఇరాక్ సంక్షోభం కారణంగా క్రూడ్ చమురు ధర బ్యారల్‌కు 115 డాలర్లకు చేరుకుంది. ఇప్పటికే ద్రవ్యోల్బణ సమస్యను ఎదుర్కొంటున్న భారత్‌కు పెరుగుతున్న చమురు ధరలు దడ పుట్టిస్తున్నాయి. గతేడాదిలో భారత్ చమురు దిగుమతుల బిల్లు 165 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. ప్రస్తుతం చమురు ధరలు 15 శాతం పెరగడంతో దిగుమతుల బిల్లులో 10 నుంచి 15 బిలియన్ డాలర్ల అదనపు పెరుగుదల ఏర్పడుతుందని భావిస్తున్నారు. పెరిగిన చమురు ధరల భారాన్ని ప్రజలపై విధిస్తే వినియోగదారుని ధరల సూచీ (CPI- consumer price index) రెండంకెలకు చేరుతుందని అంచనా. ప్రస్తుత సంక్షోభ నేఫథ్యంలో ఇరాక్‌లో ఉపాధి పొందుతున్న భారతీయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. హర్యానా, పంజాబ్ వంటి ఉత్తర భారత రాష్ట్రాలకు చెందిన కార్మికులతో పాటు, కేరళ నుంచి వైద్య రంగంలో ఉపాధి కోసం ఇరాక్‌లో నివసిస్తున్న నర్సింగ్ సిబ్బంది కూడా ఈ అలజడుల్లో చిక్కుకున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే... ప్రస్తుతం ఇరాక్ సంక్షోభ ప్రభావం భారత్‌లో క్రూడ్ ఆయిల్ ధరలపై, భారత కరెన్సీ, వృద్ధిరేటు వివిధ రంగాల్లో ప్రవేశపెట్టిన సంస్కరణలతోపాటు నూతన ప్రభుత్వం ప్రతిపాదించే బడ్జెట్ వంటి అంశాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే క్రూడ్ చమురు ధర బ్యారల్‌కు 120 డాలర్లకు చేరుకోగలదని భారత ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో చమురు ధర పెరుగుదల భారత్ బడ్జెట్‌పై 200 బిలియన్ రూపాయల ప్రభావం చూపగలదు. ప్రభుత్వ అంచనా ప్రకారం జూన్ 18న క్రూడ్ చమురు ధర బ్యారల్‌కు 111.25 డాలర్లకు పెరిగింది. వార్షిక సగటు ధర కంటే ఈ ధర ఎక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. రూపాయిపై ద్రవ్యోల్బణ ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల రూపాయి బలహీనపడి.. డాలర్‌తో పోల్చినప్పుడు జూన్ 18న రూ. 60.55 చేరింది. ఇరాక్ సంక్షోభం కారణంగా భారత్ స్టాక్ ధరలు ఒక శాతం కంటే ఎక్కువగా తగ్గాయి. సంక్షోభం తీవ్ర రూపం దాల్చితే భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. పెరుగుతున్న ప్రపంచ క్రూడ్ చమురు ధర కారణంగా దేశం లో ద్రవ్యోల్బణ సమస్య తీవ్రమయ్యే పరిస్థితి ఉంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే చర్యలో భాగంగా రిజర్వ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచుతుంది. ఈ స్థితి ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద చమురు వినియోగ దేశంగా నిలిచిన భారత్, సంక్షోభం తీవ్రమైతే చమురు దిగుమతులకు ఇతర ఓపెక్ (OPEC-Organization of the Petroleum Exporting Countries) దేశాలపై ఆధారపడాల్సివస్తుంది. ఇరాక్ ప్రభుత్వం ఇప్పటికీ చమురు క్షేత్రాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉంది. రోజుకు 15,00,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేయగలిగే రుమైలా (ఖఠఝ్చజ్చీ) ఆయిల్ ఫీల్డ్ దక్షిణ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో భారత్ కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతుందని భావించలేం. - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత్ ధ్రువీకరించిన (Confirmed) చమురు నిల్వలు 20 ఏళ్ల వరకు దేశ అవసరాలను తీర్చగలవు. ఏప్రిల్ 2012లో భారత్‌లో చమురు నిల్వలు 761 మిలియన్ టన్నులు. భారత్‌లో చమురు ఉత్పత్తి వార్షిక సగటు 38 మిలియన్ టన్నులుగా ఉంటుంది. -గౌతమ్ సిన్హా (మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్) భారత్‌లో ట్యాంకులు, పైప్లైన్లలో చమురు, ఇంధనం నిల్వ సామర్థ్యం పెంచుకునే విధంగా రిఫైనరీలు పెరగొచ్చు. 2013-14లో నిల్వ సామర్థ్యం 22.2 మిలియన్ టన్నులు కాగా 2014-15లో ఈ సామర్థ్యం 30.82 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. పార్లమెంటరీ కమిటీ అభిప్రాయంలో ఈ నిల్వ భారత్ 70 రోజుల చమురు అవసరాలను తీర్చగలవు. -అక్టోబర్, 2013 మింట్ నివేదిక -
నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్..
హైదరాబాద్: ఆయిల్, గ్యాస్ రంగాల కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 154 పాయింట్ల నష్టంతో 25158 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు క్షీణించి 7526 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్, లార్సెన్, భెల్, హెచ్ సీఎల్ టెక్, విప్రో, కంపెనీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఓఎన్ జీసీ అత్యధికంగా 5 శాతానికి పైగా నష్టపోగా, రిలయన్స్, డీఎల్ఎఫ్, ఎన్ టీపీసీ, బీపీసీఎల్ కంపెనీలు 2 శాతానికి పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
55 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్!
భారత స్టాక్ మార్కెట ప్రధాన సూచీలు స్వల్ప నష్టాలతో ముగిసింది. ఇరాక్ లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్న నేపథ్యంలో చమురు ధరలు ఒడిదుడుకులు లోనవుతున్నాయి. జూన్ నెల డెరివేటివ్ కాంట్రాక్టులు గురువారం ముగియనున్న నేపథ్యంలో సెన్సెక్స్ 55 పాయింట్లు కోల్పోయి 25313 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11 పాయింట్లు క్షీణించి 7569 వద్ద ముగిసాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో బజాజ్ ఆటో, మారుతి సుజుకీ, గెయిల్, కోల్ ఇండియా, హెచ్ యూఎల్ కంపెనీలు లాభాల్ని నమోదు చేసుకోగా, ఐటీసీ, ఓఎన్ జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్ సీ, లార్సెన్ కంపెనీలు స్వల్ప లాభాలతో ముగిసాయి. -
ఐటీసీ డీలా, ఓఎన్జీసీ అప్
నాలుగో రోజూ నష్టాలే - సెన్సెక్స్ 74 పాయింట్లు డౌన్ - ఇంట్రాడేలో 25,000 దిగువకు - 7,500 దిగువన నిఫ్టీ ముగింపు ఇరాక్ సంక్షోభం కొనసాగుతుండటంతో దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి నీరసించాయి. రుతుపవనాల మందగమనం, ముడిచమురు ధరల పెరుగుదల వంటి అంశాలు సెంటిమెంట్‌ను బలహీనపరచడంతో వరుసగా నాలుగో రోజు మార్కెట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ 74 పాయింట్లు క్షీణించి 25,031 వద్ద నిలవగా, 18 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 7,493 వద్ద ముగిసింది. ఇది రెండున్నర వారాల కనిష్టంకాగా, రైల్వే ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణానికి రెక్కలు వస్తాయన్న అందోళనలు కూడా ఇన్వెస్టర్లను అమ్మకాలవైపు మళ్లించాయని నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఒక దశలో సెన్సెక్స్ 225 పాయింట్లకుపైగా పతనమై 24,878 వద్ద కనిష్టాన్ని తాకింది. అయితే తొలుత 100 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ మొదలయ్యింది. సెన్సెక్స్ 4 రోజుల్లో 489 పాయింట్లను కోల్పోయింది. ఎక్సైజ్ డ్యూటీ ఎఫెక్ట్ సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతారన్న వార్తలతో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ 6%పైగా దిగజారింది. మరోవైపు ఆయిల్ దిగ్గజం ఓఎన్జీసీ దాదాపు 5% ఎగసింది. మిగిలిన సెన్సెక్స్ దిగ్గజాలలో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్‌యూఎల్ 2.5-1% మధ్య నష్టపోగా, హీరోమోటో, భెల్, సెసాస్టెరిలైట్, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ బ్యాంక్ అదే స్థాయిలో పుంజుకున్నాయి. శుక్రవారం రూ. 221 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 214 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. అంతర్జాతీయ సహకారంపై సెబీ దృష్టి న్యూఢిల్లీ: ప్రపంచ స్టాక్ మార్కెట్లలో కీలక పాత్ర పోషించే విధంగా దేశీ క్యాపిట ల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకు అనుగుణంగా నియంత్రణ విధానాలను అభివృద్ధి చేయనుంది. కీలక కేసులకు సంబంధించి విదేశీ సంస్థల నుంచి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు తగిన విధానాలను పటిష్టం చేయనుంది. ఇందుకు మద్దతుగా పూర్తిస్థాయిలో అంతర్జాతీయ వ్యవహారాల టీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. యూఎస్, యూకే వంటి అభివృద్ధి చెందిన మార్కెట్లలో అనుసరిస్తున్న నిఘా విధానాలను సెబీ సమగ్రంగా పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. చక్కెర షేర్లకు గిరాకీ చక్కెరపై దిగుమతి డ్యూటీని ప్రభుత్వం 15% నుంచి 40%కు పెంచడంతోపాటు, మిల్లులకు రూ. 4,400 కోట్ల వరకూ వడ్డీరహిత రుణాలను అదనంగా ఇవ్వనుండటంతో చక్కెర షేర్లకు గిరాకీ పుట్టింది. శ్రీరేణుకా, బజాజ్ హిందుస్తాన్, బలరామ్‌పూర్ చినీ, ధంపూర్, ఆంధ్రా షుగర్స్, ఈఐడీ ప్యారీ, త్రివేణీ, సింభోలీ, ద్వారికేష్, శక్తి షుగర్స్ 10-5% మధ్య పురోగమించాయి. కాగా, మార్కెట్లు నీరసించినప్పటికీ చిన్న షేర్లు వెలుగులో నిలిచాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 0.6% బలపడగా, ట్రేడైన షేర్లలో 1,562 లాభపడ్డాయి. 1,387 షేర్లు నష్టపోయాయి. -
ద్రవ్యోల్బణానికి ఇరాక్ సెగ : ముకేశ్
ముంబై: ఇరాక్ సంక్షోభంతో ఇంధన ధరలు పెరుగుతాయనీ, తద్వారా ద్రవ్యోల్బణం పెకైగుస్తుందనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చెప్పారు. గురువారం ముంబైలో జరిగిన ఇండియా మర్చెంట్స్ చాంబర్ (ఐఎంసీ) 106వ వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇరాక్‌లో అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి ముడి చమురు ధరలు 4 శాతం పెరిగాయన్నారు. సంక్షోభం మరింత తీవ్రరూపం దాలిస్తే క్రూడ్ దిగుమతి బిల్లు రెండు వేల కోట్ల డాలర్లమేరకు పెరిగి 20 వేల కోట్ల డాలర్లకు చేరే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నట్లు తెలిపారు. భారత ఆర్థికాభివృద్ధిని ఎవరూ ఆపలేరనీ, అయితే విద్య, మౌలిక సౌకర్యాల్లో వెనుకంజలో ఉండడం అభివృద్ధికి అవరోధంగా మారిందనీ అంబానీ వ్యాఖ్యానించారు. తానెప్పటికీ ఆశావాదిగానే ఉంటానన్నారు. భారత్ 2020 నాటికి సాధించగలదనుకున్నది 2010 నాటికే సాధించిందని అన్నారు. సమాచార రంగం వచ్చే 5-10 ఏళ్లలో భారతీయుల జీవనాన్ని సంపూర్ణంగా మార్చేస్తుందని జోస్యం చెప్పారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఐఎంసీ నూతన అధ్యక్షునిగా ప్రబోధ్ ఠక్కర్, ఉపాధ్యక్షునిగా దిలీప్ పిరమల్‌ను ఎన్నుకున్నట్లు సమావేశంలో ప్రకటించారు. -
మార్కెట్‌కు ఇరాక్ దెబ్బ
275 పాయింట్లు పతనం 25,246 వద్దకు సెన్సెక్స్ గరిష్టం 25,609- కనిష్టం 25,114 ఒక దశలో 400 పాయింట్లు డౌన్ అన్ని రంగాలకూ నష్టాలే ఇరాక్ అంతర్యుద్ధం శృతిమించడంతో ఉన్నట్టుండి ఇన్వెస్టర్లలో ఆందోళనలు చెలరేగాయి. దీంతో ముందురోజుకి పూర్తి విరుద్ధమైన రీతిలో మిడ్ సెషన్నుంచీ అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి మార్కెట్లు లాభాల నుంచి నష్టాలలోకి మళ్లాయి. ఉదయం సెషన్లో 25,609 పాయింట్ల గరిష్టస్థాయిని తాకిన సెన్సెక్స్ మిడ్ సెషన్లో కనిష్టంగా 25,114ను చవిచూసింది. అంటే గరిష్ట స్థాయి నుంచి దాదాపు 500 పాయింట్ల పతనం! క్రితం ముగింపునుంచి చూస్తే 400 పాయింట్ల నష్టం! ఆపై కొంతమేర కోలుకున్నప్పటికీ చివరికి 275 పాయింట్ల నష్టంతో 25,246 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా ఇదే విధంగా కదిలి ట్రేడింగ్ ముగిసేసరికి 74 పాయింట్లు పోగొట్టుకుంది. 7,558 వద్ద నిలిచింది. బీఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ నష్టపోగా... రియల్టీ, పవర్, ఆయిల్, బ్యాంకింగ్, ఆటో, ఐటీ 2-1% మధ్య తిరోగమించాయి. ఇరాక్‌లో యుద్ధ భయాలు ముదరడంతో ఆయిల్ ధరలు మరోసారి పెకైగశాయి. ఇరాక్ బైజీలోని ప్రధాన ఆయిల్ రిఫైనరీను మిలటెంట్లు ఆక్రమించినట్లు వార్తలు వెలువడటంతో ఒక్కసారిగా సెంటిమెంట్ దిగజారిందని విశ్లేషకులు పేర్కొన్నారు. బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 114 డాలర్లకు చేరగా, నెమైక్స్ చమురు 107 డాలర్లకు చేరువైంది. ఇక మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి కూడా 0.6% బలహీనపడి 60.40కు పతనమైంది. ఇది కూడా అమ్మకాలకు కారణమైనట్లు నిపుణులు తెలిపారు. ఆరు షేర్లు మాత్రమే సెన్సెక్స్‌లో ఆరు షేర్లు మాత్రమే లాభపడగా... సిప్లా, హిందాల్కో, గెయిల్ 3-1.5% మధ్య పుంజుకున్నాయి. అయితే మరోవైపు భెల్, టీసీఎస్, ఎన్టీపీసీ, ఆర్ఐఎల్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, హీరోమోటో, హెచ్‌యూఎల్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.5-1.5% మధ్య తిరోగమించాయి. ఇక బీఎస్ఈ-500 సూచీలో ఆమ్టెక్ ఇండియా, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, జీలెర్న్, బీజీఆర్ ఎనర్జీ, ఇండియా సిమెంట్స్, ఎరా ఇన్ఫ్రా, జేపీ అసోసియేట్స్, జేఎం ఫైనాన్షియల్, హెచ్‌పీసీఎల్, అలహాబాద్ బ్యాంక్, బజాజ్ హిందుస్తాన్ 7.5-4.5% మధ్య పతనమయ్యాయి. మొత్తం ట్రేడైన షేర్లలో 1,631 నష్టపోగా, 1,400 బలపడ్డాయి. -
టర్కీ పర్యటనకు నాటో చీఫ్
అంకారా: నాటో సెక్రటరీ జనరల్ ఆండర్స్ ఫోగ్ రొస్ముసెన్ టర్కీ పర్యటనకు వెళ్లనున్నారు. టర్కీ దేశస్తులను ఇరాక్‌లో బంధీలుగా ఉంచిన సంఘనటపై చర్చించనున్నారు. ఇలాంటి చర్యల వలన న్యాయం జరగదని, బంధీలను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. టర్కీ పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు అబ్దుల్లా గుల్, ప్రధాని రెసెప్ టయ్యిప్లతో నాటో చీఫ్ బేటీ కానున్నారు. ఇరాక్‌కు చెందిన తీవ్రవాదులు బుధవారం టర్కీ కాన్సులేట్‌పై దాడి చేసి 49 మందిని కిడ్నాప్ చేశారు. వీరిలో దౌత్యాధికారులు, సైనికులు, విద్యార్థులు ఉన్నారు. వీరితో పాటు ఓ పవర్ ప్లాంట్ నుంచి మరో 31 మంది టర్కీ దేశస్తులను కిడ్నాప్ చేశారు. -
ఇరాక్‌లో అంతర్యుద్ధం తీవ్రం
బాగ్దాద్‌కు చేరువైన తిరుగుబాటు దళాలు జీహాదీల స్వాధీనంలో మొసుల్,తిక్రిత్ నగరాలు బాగ్దాద్, కర్బాలాలే తదుపరి లక్ష్యమన్న ఐఎస్ఐఎల్ సద్దాం సైన్యాధికారులతో బలోపేతమైన జీహాదీ దళం బాగ్దాద్/లండన్: ఇరాక్ సంక్షోభం ముదురుతోంది. సోమవారం ప్రారంభమైన అంతర్యుద్ధం శనివారం నాటికి మరింత తీవ్రమైంది. అల్ కాయిదా ప్రభావిత సున్నీ జీహాదీ తిరుగుబాటు దళాలు మొసుల్, తిక్రిత్ నగరాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాయి. తిరుగుబాటులో దేశ ఉత్తరప్రాంతంలో బలంగా ఉన్న కుర్దులు కూడా పాలుపంచుకుంటున్నారు. ఉత్తర, ఉత్తరమధ్య ఇరాక్‌లోని అనేక ప్రాంతాలపై పట్టు సాధిస్తూ బాగ్దాద్‌ను కైవసం చేసుకునే దిశగా జీహాదీ దళాలు ముందుకు కదులుతున్నాయి. బాగ్దాద్‌కు అవి కేవలం 100 కి.మీల దూరంలో ఉన్నాయని సమాచారం. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ మద్దతుదారులైన ఈ ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్(ఐఎస్ఐఎల్)’ దళాలనుఇరాక్ సైన్యం ఎదుర్కోలేకపోతోంది. షియా గిరిజన యోధులు మాత్రం వారిని కొంతవరకు నిలువరిస్తున్నారు. ఐఎస్ఐఎల్ దళాలను ప్రజలు సాయుధులై కలసికట్టుగా ఎదుర్కోవాలని షియాల అత్యున్నత మత పెద్ద అయోతుల్లా అలీ అల్ సిస్తానీ శుక్రవారం పిలుపునిచ్చారు. సున్నీ జీహాదీలను ఎదుర్కొనేందుకు వేలాది షియాలు స్వచ్ఛందంగా ముందుకువస్తున్నారు. అలాగే, షియాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న, సుశిక్షితులైన ప్రభుత్వ దళాలున్న బాగ్దాద్‌ను కేవలం వేలల్లో ఉన్న జీహాదీ తిరుగుబాటుదారులు కైవసం చేసుకోలేరని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, బాగ్దాద్‌కు ఉత్తరంవైపు ప్రభుత్వ సైనికదళాలు కాపలాను కట్టుదిట్టం చేశాయి. చెక్‌పోస్ట్‌లు నిర్మించి, సాయుధులను కాపలాగా పెట్టాయి. కాగా, బాగ్దాద్‌తో పాటు షియాలకు పవిత్ర నగరమైన కర్బాలాలే తమ తదుపరి లక్ష్యమని ఐఎస్ఐఎల్ ప్రతినిధి అబూ మొహమ్మద్ అల్ అద్నానీ ప్రకటించారు. సున్నీలు, కుర్దులు అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రధానమంత్రి నౌరి అల్ మాలికి ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేని పరిస్థితి నెలకొంది. దళాలు పంపించబోం: అమెరికా, బ్రిటన్ తిరుగుబాటుదారులను అణచివేసేందుకు తమ దేశం నుంచి సైనిక దళాలను పంపించడం లేదని అమెరికా, బ్రిటన్లు స్పష్టం చేశాయి. ఇరాక్ తమకు అత్యంత ముఖ్యమైన దేశం అయినప్పటికీ.. ఆ దేశ సంక్షోభాన్ని ఆ దేశస్తులే పరిష్కరించుకోవాలని అమెరికా స్పష్టం చేసింది. సైనిక దళాలను పంపించడం కాకుండా.. ఇరాక్ ప్రభుత్వానికి సహకరించే ఇతర మార్గాల గురించి ఆలోచిస్తున్నామని అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. ఇరాక్‌లో అస్థిరతను అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని బ్రిటన్ తెలిపింది. అయితే, ఇరాక్ ప్రభుత్వానికి మద్దతుగా తమ దళాలను ఇరాక్ పంపించడం లేదని స్పష్టం చేసింది. అంతర్యుద్ధంతో సతమతమవుతున్న, జీహాదీలతో పోరాడుతున్న ఇరాక్ ప్రజలకు రూ. 29.84కోట్ల విలువైన సామగ్రిని బ్రిటన్ పంపిస్తోంది. -
'ఆయుధాలు పట్టి పోరాడండి..'
కర్పాలా(ఇరాక్): దేశంపై దాడులకు తెగపడుతున్న ఉగ్రవాదులపై ఆయుధాలు చేపట్టి పోరాడాలని షియాల మతపెద్ద గ్రాండ్ అయాతుల్లా ఆలీ అల్ సిస్తానీ పిలుపునిచ్చారు. పవిత్ర స్థలాలను, ప్రజలను, దేశాన్ని కాపాడుకునేందుకు పౌరులు ఆయుధాలు పట్టుకుని ఉగ్రవాదులపై తిరగపడాలని మత పెద్దలు పిలుపునిస్తున్నారు. ధర్మం కోసం యుద్దం చేస్తున్న భద్రత దళాలకు స్వచ్చందంగా మద్దతు తెలుపాలని కర్బాలా నగరంలో జరిగిన మత సమావేశంలో సూచించారు. దేశం కోసం పోరాడుతూ త్యాగం చేసిన వారి కుటుంబాలకు, వ్యక్తులకు సముచిత గౌరవిస్తామన్నారు.