ఇరాక్ సంక్షోభం... భారత్‌కు సంకటం | India's problem of the crisis in Iraq | Sakshi
Sakshi News home page

ఇరాక్ సంక్షోభం... భారత్‌కు సంకటం

Published Thu, Jul 3 2014 3:41 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

ఇరాక్ సంక్షోభం... భారత్‌కు సంకటం - Sakshi

ఇరాక్ సంక్షోభం... భారత్‌కు సంకటం

అగ్రరాజ్యం అమెరికాలో ఆర్థిక మాంద్యం సంభవించినా... చమురు ఉత్పత్తి దేశాల్లో సంక్షోభ
 పరిణామాలు తలెత్తినా... మన భారత ఆర్థిక వ్యవస్థ కొంత మేర కుదుపులకు లోనవ్వాల్సి వస్తోంది.
 ప్రపంచంలో అతిపెద్ద చమురు వినియోగ దేశాల్లో నాలుగో స్థానంలో ఉన్న భారత్... చమురు కోసం
 సౌదీ అరేబియా, దుబాయ్, ఇరాక్ లాంటి గల్ఫ్ దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే ఆయా
 దేశాల్లో ఎలాంటి ప్రతికూలతలు తలెత్తినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భారత్‌పై ప్రభావం పడుతోంది.
 గత నెలరోజులుగా ఇరాక్‌లో నెలకొన్న అంతర్గత సంక్షోభమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం.
 
 స్వాతంత్య్రానంతరం భారత్ మధ్య ప్రాచ్య (Middle East) దేశాలతో దౌత్యపరమైన సంబంధాలను ప్రారంభించింది. ఆ క్రమంలో ప్రధానమైన అతి కొద్ది దేశాల్లో ఇరాక్ ఒకటి. 1952లో రెండు దేశాలు శాశ్వత శాంతి, స్నేహం (Treaty of Perpetual Peace and Friendship) ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇరాక్‌లో బాత్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వాన్ని మొదటగా భారత్ గుర్తించింది. 1965 భారత్-పాక్ యుద్ధ సమయంలోనూ ఇరాక్ తటస్థంగా వ్యవహరించింది. అదే క్రమంలో భారత్, ఇరాక్‌ల మధ్య పటిష్టమైన ఆర్థిక, సైనిక సహకారం కొనసాగుతూ వచ్చింది.
 
 బాసటగా:
 1980వ దశకం ఆరంభంలో 120 ఇరాకీ మిగ్-21 పైలట్లకు భారత వాయుసేన శిక్షణనిచ్చింది. భారత్ అణు పరీక్షలు నిర్వహించే విషయంలో ఇరాక్ బాసటగా నిలిచింది. అప్ప టి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ కాశ్మీర్ వివాదం విషయంలో భారత్‌కు పూర్తి మద్దతునిచ్చారు. 2003లో ఇరాక్‌పై అమెరికా దాడి సమయంలో భారత్ తటస్థంగా వ్యవహరించింది. ఇరాక్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాక్‌తో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. 2005 తర్వాత ఇరాక్‌లో ఎన్నికైన నూతన ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం భారత్‌తో వాణిజ్య సంబంధాల మెరుగుకు ఆసక్తి చూపింది. ఆ మేరకు ఇటీవల ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు మెరుగయ్యాయి. ఇరాక్ ప్రతిరోజు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కు 2,20,000  బ్యారల్స్ చమురును ఎగుమతి చేస్తుంది.
 
 ద్వైపాక్షిక వాణిజ్యం:
 మార్చి, 2003 తర్వాత ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు తగ్గినప్పటికీ.. ఇటీవల కాలంలో వాణిజ్య వృద్ధి అధికంగా నమోదవుతుంది. ఇరాక్ నుంచి భారత్ క్రూడ్ చమురును మాత్రమే కాకుండా ముడి ఉన్ని (ట్చఠీ ఠీౌౌ), సల్ఫర్‌ను దిగుమతి చేసుకుంటుంది. భారత్ ఆగ్రో కెమికల్స్, కాస్మోటిక్స్, రబ్బర్ ఉత్పత్తులు, సిరామిక్స్, పెయింట్స్, ఎలక్ట్రికల్ మెషినరీ, వజ్రాలు, ఆభరణాలు, మెషీన్ టూల్స్, రవాణా పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, హ్యాండిక్రాఫ్ట్, పంచదార, టీ, గార్మెంట్స్, ఫార్మాస్యూటికల్స్‌ను ఇరాక్‌కు ఎగుమతి చేస్తుంది. 2010 నుంచి ఇరాక్‌కు సంబంధించి భారత్ ఎగుమతుల వివరాలు..
     సంవత్సరం    విలువ (మిలియన్‌డాలర్లలో)
     2010-11     678.14
     2011-12    763.97
     2012-13    1278.13
 
 ఇరాక్ నుంచి భారత్ దిగుమతుల వివరాలు..
     సంవత్సరం     విలువ (మిలియన్‌డాలర్లలో)
     2010-11     9008.30
     2011-12     18918.47
     2012-13     19247.31
 ఈ ఎగుమతులు, దిగుమతుల వివరాలను క్షుణ్నంగా పరిశీలిస్తే.. ఈ రెండు అంశాల్లో ప్రతి సంవత్సరం నమోదవుతున్న పురోగతి స్పష్టమవుతోంది. సౌదీ అరేబియా తర్వాత మనకు అధికంగా చమురు సరఫరా చేస్తున్న దేశం ఇరాక్. 2013-14లో భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో ఇరాక్ వాటా 13 శాతంగా ఉంది.
 
 తాజా సంక్షోభం:
 ఇరాక్.. గత నాలుగువారాలుగా మిలిటెంట్ల మారణహోమంతో చిగురుటాకులా వణికిపోతోంది. ప్రధానంగా రెండు మత వర్గాలైన సున్నీలు, షియాల మధ్య చెలరేగిన కార్చిచ్చు వందల మందిని పొట్టనబెట్టుకుంది. ఈ సున్నితమైన అంశాన్ని చల్లార్చడంలో అక్కడి ప్రభుత్వం సైతం విఫలమైందనే చెప్పాలి. ఇరాక్‌లోని సున్నీలు సిరియాలోని సున్నీలతో చేతులు కలపడం ద్వారా ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా’ (ISI) అనే సంస్థతో మొదలైన పౌర యుద్ధం (సివిల్ వార్ ) దేశమంతా వ్యాపించింది. సాయుధ ఐఎస్‌ఐఎస్ మిలిటెంట్లు ప్రధాన ఆదాయ వనరులైన ఆయిల్ రిఫైనరీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.జూన్ 17న ఉత్తర బాగ్దాద్‌లోని సలాహిద్దీన్ ప్రావిన్స్ పరిధిలో బైజీగా పిలిచే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని ఆక్రమించారు. ఇరాక్‌లోని మూడు ప్రధాన రిఫైనరీల్లో బైజీ ఒకటి. అలాగే ఇరాక్‌లో రెండో అతిపెద్ద పట్టణమైన మోసుల్ మిలిటెంట్ల చేతుల్లోకి వెళ్లింది. మధ్య ప్రాచ్య ప్రాంతంలో ఇస్లాం మతంలోని రెండు వర్గాలైన షియా, సున్నీల మధ్య ఏర్పడిన అపనమ్మకాలు ఇరాక్‌లో ప్రస్తుత దుస్థితికి దారితీశాయి.
 
 షియాల ఆధిపత్యంపై తిరుగుబాటు:
 సద్దాం హుస్సేన్ పాలన అనంతరం అమెరికా కనుసన్నల్లో షియా అనుకూల ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం మైనారిటీలైన సున్నీలు, కుర్దుల పట్ల నిర్దయగా వ్యవహరించడం ప్రారంభించింది. దాంతో వారిలో అసంతృప్తి పెరిగి, తిరుగుబాటుకు దారితీసింది. ఐఎస్‌ఐఎస్ మిలింటెంట్లు కొన్ని వందల చదరపు మైళ్ల భూభాగాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. షియాలపై సున్నీల తిరుగుబాటు మొదటిసారి 2006లో జరిగింది. ఈ తిరుగుబాటుకు ఆల్‌ఖైదాకు చెందిన అబూ ముసబ్ అల్ జర్‌క్వి (Abu Musab Al Zarqawi) నాయకత్వం వహించాడు. ఈ దాడుల్లో ముఖ్యంగా షియాల ప్రార్థనా మందిరమైన అల్- అస్కారియా (Al-Askaria) మసీదుపై బాంబుల వర్షం కురిసింది. అమెరికన్ దళాల చేతిలో తిరుగుబాటుకు నేతృత్వం వహించిన వ్యక్తి హతమయ్యాడు. అప్పట్లోనే అమెరికా సైన్యం మళ్లీ ఈ విధమైన తిరుగుబాటు తలెత్తే ప్రమాదం ఉందని భావించింది. ఊహించిన విధంగానే మళ్లీ తిరుగుబాటు ప్రారంభమైంది. ఇరాక్, సిరియాల్లోని సున్నీలు నివసించే ప్రాంతాలను కలిపి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్‌తోపాటు, మరికొన్ని అంశాలను ప్రభుత్వం నెరవేర్చాలని పట్టుబట్టింది.
 
 ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా’ డిమాండ్లు
     ఇరాక్, సిరియా దేశాల్లోని సున్నీలు నివసించే ప్రాంతాలను కలిపి ప్రత్యేక దేశంగా ప్రకటించాలి.
     షరియా చట్టాలను (Sharia laws) అమలు చేయాలి.
     పాఠశాల స్థాయిలో బాలురు, బాలికలను వేరు చేయాలి.
     మహిళలు తప్పనిసరిగా నిఖాబ్ (ూఐఖఅఆ) ధరించాలి.
     సంగీతంపై పూర్తిగా నిషేధం విధించాలి.
     రంజాన్ సమయాల్లో ఉపవాసాన్ని నిర్బంధంగా అమలు చేయాలి.
 
 భారత్‌పై ప్రభావం:
 ఇరాక్‌లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ప్రధాన ఆదాయ వనరులు, ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టు వంటి చమురు శుద్ధి కర్మాగారాలపై తిరుగుబాటు దళాలు దాడులకు పాల్పడుతున్నాయి. అంతటితో ఆగకుండా జనహననానికి ఐఎస్‌ఐఎస్‌తిరుగుబాటు బృందం తెగబడుతోంది. 40 మంది భారతీయులను నిర్బంధించింది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితిని భారత్ నిశితంగా గమనిస్తోంది. ఇరాక్ సంక్షోభం కారణంగా క్రూడ్ చమురు ధర బ్యారల్‌కు 115 డాలర్లకు చేరుకుంది. ఇప్పటికే ద్రవ్యోల్బణ సమస్యను ఎదుర్కొంటున్న భారత్‌కు పెరుగుతున్న చమురు ధరలు దడ పుట్టిస్తున్నాయి. గతేడాదిలో భారత్ చమురు దిగుమతుల బిల్లు 165 బిలియన్ డాలర్లకు పైగా ఉంది.
 
  ప్రస్తుతం చమురు ధరలు 15 శాతం పెరగడంతో దిగుమతుల బిల్లులో 10 నుంచి 15 బిలియన్ డాలర్ల అదనపు పెరుగుదల ఏర్పడుతుందని భావిస్తున్నారు. పెరిగిన చమురు ధరల భారాన్ని ప్రజలపై విధిస్తే వినియోగదారుని ధరల సూచీ (CPI- consumer price index) రెండంకెలకు చేరుతుందని అంచనా. ప్రస్తుత సంక్షోభ నేఫథ్యంలో ఇరాక్‌లో ఉపాధి పొందుతున్న భారతీయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. హర్యానా, పంజాబ్ వంటి ఉత్తర భారత రాష్ట్రాలకు చెందిన కార్మికులతో పాటు, కేరళ నుంచి వైద్య రంగంలో ఉపాధి కోసం ఇరాక్‌లో నివసిస్తున్న నర్సింగ్ సిబ్బంది కూడా ఈ అలజడుల్లో చిక్కుకున్నారు.
 
 పరిస్థితి ఇలాగే కొనసాగితే...
 ప్రస్తుతం ఇరాక్ సంక్షోభ ప్రభావం భారత్‌లో క్రూడ్ ఆయిల్ ధరలపై, భారత కరెన్సీ, వృద్ధిరేటు వివిధ రంగాల్లో ప్రవేశపెట్టిన సంస్కరణలతోపాటు నూతన ప్రభుత్వం ప్రతిపాదించే బడ్జెట్ వంటి అంశాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే క్రూడ్ చమురు ధర బ్యారల్‌కు 120 డాలర్లకు చేరుకోగలదని భారత ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో చమురు ధర పెరుగుదల భారత్ బడ్జెట్‌పై 200 బిలియన్ రూపాయల ప్రభావం చూపగలదు. ప్రభుత్వ అంచనా ప్రకారం జూన్ 18న క్రూడ్ చమురు ధర బ్యారల్‌కు 111.25 డాలర్లకు పెరిగింది. వార్షిక సగటు ధర కంటే ఈ ధర ఎక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. రూపాయిపై ద్రవ్యోల్బణ ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల రూపాయి బలహీనపడి.. డాలర్‌తో పోల్చినప్పుడు జూన్ 18న రూ. 60.55 చేరింది. ఇరాక్ సంక్షోభం కారణంగా భారత్ స్టాక్ ధరలు ఒక శాతం కంటే ఎక్కువగా తగ్గాయి. సంక్షోభం తీవ్ర రూపం దాల్చితే  భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. పెరుగుతున్న ప్రపంచ క్రూడ్ చమురు ధర కారణంగా దేశం లో ద్రవ్యోల్బణ సమస్య తీవ్రమయ్యే పరిస్థితి ఉంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే చర్యలో భాగంగా రిజర్‌‌వ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచుతుంది. ఈ స్థితి ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద చమురు వినియోగ దేశంగా నిలిచిన భారత్, సంక్షోభం తీవ్రమైతే చమురు దిగుమతులకు ఇతర ఓపెక్ (OPEC-Organization of the Petroleum Exporting Countries) దేశాలపై ఆధారపడాల్సివస్తుంది.
 
  ఇరాక్ ప్రభుత్వం  ఇప్పటికీ చమురు క్షేత్రాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉంది. రోజుకు 15,00,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేయగలిగే రుమైలా (ఖఠఝ్చజ్చీ) ఆయిల్ ఫీల్డ్ దక్షిణ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో భారత్ కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతుందని భావించలేం.
 - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
 
 భారత్ ధ్రువీకరించిన (Confirmed) చమురు నిల్వలు 20 ఏళ్ల వరకు దేశ అవసరాలను తీర్చగలవు. ఏప్రిల్ 2012లో భారత్‌లో చమురు నిల్వలు 761 మిలియన్ టన్నులు. భారత్‌లో చమురు ఉత్పత్తి వార్షిక సగటు 38 మిలియన్ టన్నులుగా ఉంటుంది.
 -గౌతమ్ సిన్హా (మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్)
 
 భారత్‌లో ట్యాంకులు, పైప్‌లైన్‌లలో చమురు, ఇంధనం నిల్వ సామర్థ్యం పెంచుకునే విధంగా రిఫైనరీలు పెరగొచ్చు. 2013-14లో నిల్వ సామర్థ్యం 22.2 మిలియన్ టన్నులు కాగా 2014-15లో ఈ సామర్థ్యం 30.82 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. పార్లమెంటరీ కమిటీ అభిప్రాయంలో ఈ నిల్వ భారత్ 70 రోజుల చమురు అవసరాలను తీర్చగలవు.
 -అక్టోబర్, 2013 మింట్ నివేదిక
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement