ఐక్యరాజ్యసమితి.. సంస్కరణలు!
అతిస్వల్వకాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాగించినన్ని విదేశీ పర్యటనలు గతంలో ఎవరూ చేపట్టలేదు. అడుగుపెట్టిన ప్రతి దేశంలో, ప్రసంగించిన అనేక అంతర్జాతీయ వేదికలపై భారత గళాన్ని వినిపించారు. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి ఆయా దేశాల మద్దతును కూడగట్టడం మోదీ దౌత్య దార్శనికతకు నిదర్శనం. ఈ నేపథ్యంలో మోదీ అమెరికా పర్యటన, ఐరాసలో ప్రసంగం, ఐరాసలో చేపట్టిన చర్యలు తదితర అంశాలపై విశ్లేషణ..
అనేక వసంతాల నుంచి ప్రపంచ దేశాలతోపాటు భారత్ కూడా భద్రతా మండలి సంస్కరణలపై తన ఆకాంక్షలను వినిపిస్తూనే ఉంది. ఈ అంశంపై భావసారూప్యత ఉన్న దేశాలైన జర్మనీ, జపాన్, బ్రెజిల్‌లతో కలిసి చాలాకాలం కిందటే జీ-4(గ్రూప్-4) పేరిట ఏర్పాటుచేసిన కూటమిలో కూడా భారత్ సభ్యదేశంగా ఉంది. అమెరికా, రష్యా, బ్రిటన్ లాంటి అగ్ర రాజ్యాల మద్దతు కూడగట్టుకున్నట్లు బహిరంగంగా ప్రకటించింది. కానీ సంస్కరణలు, ముఖ్యంగా భద్రతా మండలి విస్తరణ జరగలేదు. ఇటీవల ఐరాస 70వ సభ్య సమావేశం జరిగిన నేపథ్యంలో మోదీ అమెరికా పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
మోదీ దౌత్యవిధానం
మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి మద్దతు కూడగట్టటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో విస్తృత భేటీలు జరిపారు. సాధారణ సభలో ప్రతి సభ్య దేశం ఓటు అతి ముఖ్యమైనదే. ఈజిప్టు, జోర్డాన్, భూటాన్, స్వీడన్, సైప్రస్, శ్రీలంకతోపాటు పలువురు దేశాధినేతలతో సమావేశమై మద్దతు కోరారు. బంగ్లాదేశ్, గయానాల అధ్యక్షులను కలిశారు. ఆఖరికి లక్ష జనాభా మాత్రమే ఉన్న ఐరాస సభ్యదేశం సెయింట్ విన్సెంట్ గ్రనడైస్ నేతనూ కలిశారు.
భద్రతా మండలిలో సంస్కరణల ఆవశ్యకత
ఐరాసలో అత్యంత శక్తిమంతమైన విభాగం భద్రతా మండలి. అంతర్జాతీయంగా శాంతి భద్రతల పరిరక్షణను ఇదే పర్యవేక్షిస్తుంది. ప్రపంచ దేశాలపై ఆంక్షలు విధించే అధికారం ఉంది. సమితిలో ప్రస్తుతం 193 సభ్యదేశాలు ఉండగా, మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలు (అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్), పది తాత్కాలిక సభ్యదేశాలు ఉన్నాయి. శాశ్వత సభ్యదేశాలకు ‘వీటో’ అధికారం ఉంటుంది. తాత్కాలిక సభ్యదేశాలను రెండేళ్ల సభ్యత్వ కాలానికి రొటేషన్ పద్ధతిలో సర్వసభ్య సభ ఓటింగ్ ద్వారా ఎంపికచేస్తుంది. మండలిలో కీలక నిర్ణయాలకు కనీసం 9 సభ్యదేశాల ఆమోదం అవసరం. అయితే ఏదైనా నిర్ణయానికి అవసరమైనన్ని సభ్యదేశాల ఆమోదం ఉన్నప్పటికీ.. శాశ్వత సభ్యదేశాల్లో ఏదైనా దేశం వ్యతిరేకించి వీటో చేస్తే ఆ నిర్ణయం ఆమోదం పొందదు.
పపంచ దేశాల సమాఖ్య లాంటి ఐరాస కేవలం 5 దేశాలు.. ముఖ్యంగా ఒకట్రెండు దేశాల కనుసన్నల్లో నడుస్తుంటే విశ్వ మానవ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తుందన్న అంశానికి విలువ లేదు.
పేదల ప్రయోజనాలను, పర్యావరణాన్ని గౌరవించే మరింత మానవీయమైన అంతర్జాతీయ వ్యవస్థగా ఐరాస రూపొందాలి.
బలహీనులకు అభివృద్ధి ఫలాలను దూరం చేసే ఆర్థిక వ్యవస్థల నుంచి ప్రపంచ దేశాల సుస్థిర అభివృద్ధికి దోహదకారి కావాలి.
అన్ని రకాల దుర్వినియోగాలకు, అధిక వడ్డీ రేట్లకు అడ్డుకట్ట వేయగలగాలి.
శరణార్థుల సమస్య, వివిధ వర్గాలపై వేధింపులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ భద్రత, ఎబోలా లాంటి మహమ్మారుల వంటి సవాళ్ల నుంచి బయటపడి ఉన్నతమైన ప్రపంచ నిర్మాణానికి అనుగుణమైన సంస్థగా రూపొందాలి.
ఇందుకోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు ఆవశ్యకంగా మారాయి.
సంస్కరణలపై భారత్ వైఖరి
ఐరాస ఆవిర్భవించిన 70 వసంతాల నాటికి భద్రతామండలి కూర్పులో మార్పురావటం అభిలషనీయమని గతంలోనే స్పష్టీకరించిన మోదీ, ఈసారి తన ప్రసంగంలో ఆ అంశాన్ని సూటిగా ప్రస్తావించారు. అత్యావశ్యక సంస్కరణలు అమలు పరిస్తేనే సమితికి మన్నన దక్కుతుందంటూ వర్ధమాన ప్రపంచవాణిని గట్టిగా వినిపించారు. దేశాల మధ్య అసమానతలు తగ్గించటం, సముద్ర వనరుల స్థిర వినియోగం వంటి సమున్నత లక్ష్యాలు మునుపటి సహస్రాబ్ది తరహా వైఫల్యాలు ఎదురుకాకూడదు అనుకుంటే వర్ధమాన ప్రపంచానికి సముచిత ప్రాతినిధ్యం దక్కాల్సిందే. సంక్షోభిత స్థితిగతుల్ని, ఘర్షణాత్మక వాతావరణాన్ని చెదరగొట్టి దేశాల మధ్య స్నేహ సౌహార్ధాలు ఇనుమడింపజేయటంలో సమితి పేలవ రికార్డు ఇలాగే కొనసాగితే.. ఆ సంస్థ ఉనికికే ముప్పు వాటిల్లుతుంది. దాన్ని నివారించి ప్రపంచాన్ని సుస్థిరాభివృద్ధి పథంలోకి మళ్లించటానికి మోదీ సూచించిన సాకల్య సంస్కరణే పరిష్కారం.
మోదీ ప్రస్తావించిన అంశాలు
తమ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలను వివరించారు.
భారత్ ఆర్థిక సుస్థిరత సాధించింది. 21వ శతాబ్దం భారత శతాబ్దమని కొంతకాలంగా ప్రపంచం మొత్తం భావిస్తోంది. భారతదేశంలోని 125 కోట్ల మంది ప్రజల నిబద్ధత కారణంగానే ఇది సాధ్యపడింది. ఇలాంటి ఆలోచనలను విస్తరించాలంటే ఐరాసలో భారత్‌కు సమున్నత స్థానం కల్పించాలని పేర్కొన్నారు.
{పపంచ దేశాలు పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. మానవతా పురోగతి పునాదిగా భాగస్వామ్యాలను నెలకొల్పాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.
స్వాతంత్య్రం సాధించిన నాటి నుంచి భారత్ పేదరికంపై దృష్టి సారించింది. విద్య, నైపుణ్యాభివృద్ధి తమ ప్రాధాన్యాలని, పేదరికం నుంచి ప్రపంచం విముక్తికి, అభివృద్ధి సుస్థిరంగా ఉండాలంటే ఐరాసలో భారత్‌కు తగిన గుర్తింపు నివ్వాలని పునరుద్ఘాటించారు.
ఉగ్రవాదం.. ప్రధాన సమస్య
భారత్ అహింసను ప్రబోధిస్తుంది. అలాంటి దేశం ఉగ్రవాదం సమస్యతో గత నాలుగు దశాబ్దాలుగా బాధపడుతోంది. భారత్‌తో సహా ప్రపంచంలోని చాలా దేశాలు ఇది చిమ్ముతున్న విష ప్రభావానికి గురవుతున్నాయి. అయినప్పటికీ ఇంతవరకు ‘ఉగ్రవాదం’ నిర్వచనంపై ఏకాభిప్రాయం లేకపోవటం శోచనీయం. ఉగ్రవాదంపై సరైన విధంగా నిర్వచనాన్ని నిర్ణయించి దీనికి వ్యతిరేకంగా మానవశక్తులన్నింటినీ ఏకంచేసి, కలిసి వచ్చేటట్లు చేయాలంటే ఐరాస ప్రధాన భూమిక పోషించాలి. ఇదే విషయాన్ని మోదీ తన ప్రసంగంలో స్పష్టం చేశారు.
శాంతి పరిరక్షణలో రావాల్సిన మార్పులు
శాంతి పరిరక్షణ కార్యకలాపాలకు దళాలను పంపించే దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. శాంతి పరిరక్షణకు వెళ్లిన దళాలు కొన్నిసార్లు అక్కడి అంతర్యుద్ధంలో భాగం కావాలి. ఉన్నత స్థాయి యాజమాన్యంలోగానీ, దళాలకు ఆదేశాలిచ్చే కమాండర్లలోగానీ ఆయా దేశాలకు తగిన ప్రాతినిధ్యం లేదు. శాంతిదళాలను పంపిన దేశాలకు విధాన నిర్ణయాల ప్రక్రియలో ఎలాంటి పాత్ర లేకపోవటం దీనికి ప్రధాన కారణం. శాంతి పరిరక్షణ చర్యలు విజయవంతమవుతాయా లేదా అనేది సైనికులు మోసుకెళ్లే ఆయుధాలపై కాకుండా, ఐరాస భద్రతా మండలి అందించే నైతిక బలంపై ఆధారపడి ఉంటోందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. ఇప్పుడున్న శాంతి పరిరక్షణ దళాలకు అదనంగా 850 మందిని పంపిస్తామని ప్రకటించారు.
ఆకాంక్షలకు అనుగుణంగా..
మొత్తం మీద ఏడురోజుల తమ అమెరికా పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని సంస్కరణలపై 125 కోట్ల భారతీయుల గళాన్ని వినిపించటమే కాకుండా అనేక దేశాధినేతలతో సమావేశమై ఈ అంశంపై చర్చించటం శుభపరిణామం. సమీప భవిష్యత్తులో ప్రపంచ దేశాల ఆకాంక్షలకు అనుగుణంగా ఐరాస హేతుబద్దమైన, ఆచరణాత్మకమైన సంస్కరణలు చేపట్టి, సంస్థను మరింత బలపరిచే విధంగా మార్పులు రావాలని ఆశిద్దాం.
21వ శతాబ్దం భారత
శతాబ్దమని కొంతకాలంగా ప్రపంచం మొత్తం భావిస్తోంది. భారతదేశంలోని 125 కోట్ల మంది ప్రజల నిబద్ధత కారణంగానే ఇది సాధ్యపడింది. ఇలాంటి
ఆలోచనలను విస్తరించాలంటే ఐరాసలో
భారత్‌కు సమున్నత స్థానం కల్పించాలి -
ఐరాస 70వ సర్వసభ్య
సమావేశంలో ప్రధాన మంత్రి
నరేంద్ర మోదీ
జీ-4 సదస్సు
నాలుగు దేశాలతో కూడిన(గ్రూప్-4) సదస్సుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూయార్క్‌లో ఆతిథ్యం ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందటానికి తమకు అన్ని అర్హతలు ఉన్నాయని భారత్, జర్మనీ, బ్రెజిల్, జపాన్‌లు ప్రకటించాయి. ఈ దిశగా భద్రతా మండలిని నిర్దేశిత కాలవ్యవధిలోపు సంస్కరించాలని పునరుద్ఘాటించాయి. ప్రపంచ శాంతి-అభివృద్ధికి కట్టుబడి అంతర్జాతీయ బాధ్యతలను స్వీకరించటానికి సిద్ధపడి ఈ నాలుగు దేశాలు ఒక కూటమిగా 2004లో ఏర్పాటయ్యాయి. జీ-4 దేశాల అధినేతలు కలుసుకోవటం కూటమి ఏర్పాటైన తర్వాత ఇదే తొలిసారి.
సదస్సు ముఖ్యాంశాలు
ఆధునిక యుగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వాటికి అనుగుణంగా నిర్దిష్ట కాలవ్యవధిలో మండలిలో సంస్కరణలు పూర్తి చేయాలని జీ-4 పేర్కొంది. ఉగ్రవాదం ప్రపంచ సుస్థిరతకు, శాంతికి భంగకరంగా మారిందని జీ-4 దేశాల నేతలు పేర్కొన్నారు. మరోవైపు శరణార్థుల వలసలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, పేదరికం తీవ్రత ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా తగ్గిందని, ఇది శుభ పరిణామమని అభిప్రాయపడ్డారు. భద్రతా మండలి ఆవిర్భావం తర్వాత అంతర్జాతీయ పరిస్థితుల్లో వచ్చిన అనేక సానుకూల మార్పులకు జీ-4 దేశాలు దోహదం చేశాయి. అందుకే ఈ దేశాలకు భద్రతా మండలిలో స్థానం కల్పించాలి. భద్రతా మండలిలో చిన్న, మధ్యస్థ సభ్యదేశాలకు తగినంత, నిరంతర ప్రాతినిధ్యం కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది.
జీ-4 దేశాల ఉమ్మడి ప్రకటన
ప్రపంచ సంక్షోభాలను పరిష్కరించటానికి ఐరాస భద్రతామండలి మరింత ప్రాతినిధ్యాన్ని, న్యాయబద్ధతను కలిగి ఉండాలి.
ఐరాస సంస్కరణల ప్రక్రియను నిర్ణీత కాలవ్యవధి ప్రకారం పూర్తిచేయాలి.
మండలిలో శాశ్వత సభ్యత్వం పొందటానికి జీ-4 దేశాలకు అన్ని అర్హతలు ఉన్నాయి.
భద్రతా మండలి శాశ్వత, తాత్కాలిక సభ్యత్వంలో ఆఫ్రికాకు ప్రాతినిధ్యం కల్పించాలి. ద్వీప దేశాలకు సముచిత స్థానం ఉండాలి.
ఐరాస ఆమోదించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు
2000 సంవత్సరంలో ఆమోదించిన సహస్రాబ్ది లక్ష్యాలు 2015 నాటికి ముగుస్తాయి. 2015-2030 మధ్య ప్రపంచ దేశాలు సాధించాల్సిన లక్ష్యాలను ‘ట్రాన్స్‌ఫార్మింగ్ అవర్ వరల్డ్: ది 2030 అజెండా ఫర్ సస్టయినబుల్ డెవలప్‌మెంట్’ పేరిట రూపొందించుకున్న 17 లక్ష్యాలు, 169 సాధించాల్సిన ఉద్దేశాలను ఐరాస సాధారణ సభ ఆమోదించింది.
లక్ష్యాలు:
పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించటం
ఆకలి కేకలు అసలు లేకుండా చూడటం
ఆరోగ్యకరమైన జీవనాన్ని అందించటం
పురుష సమానత్వం
అందరికీ స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు
ఉద్యోగాలు, ఆర్థికాభివృద్ధి
బాధ్యతాయుత వినియోగం
భూతల పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ
సాగర వనరుల, జీవుల రక్షణ
వాతావరణంపై కార్యాచరణ
నవీకరణ, మౌలిక వసతులు
శాంతి, న్యాయం