అమెరికాలో మోదీ పర్యటన - ముఖ్యాంశాలు | PM Narendra Modi's US visit - Highlights | Sakshi
Sakshi News home page

అమెరికాలో మోదీ పర్యటన - ముఖ్యాంశాలు

Published Thu, Oct 9 2014 2:28 AM | Last Updated on Thu, Apr 4 2019 4:25 PM

అమెరికాలో మోదీ పర్యటన - ముఖ్యాంశాలు - Sakshi

అమెరికాలో మోదీ పర్యటన - ముఖ్యాంశాలు

ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల అమెరికా పర్యటన క్షీణించిన భారత-అమెరికా సంబంధాలు మెరుగు పడగలవనే విశ్వాసాన్ని కల్పించింది. పేదరిక నిర్మూలన, భారత్ వృద్ధి సాధన పట్ల మోదీకి ఉన్న ఆసక్తి ఒబామా ప్రశంసలను అందుకుంది.  ప్రపంచంలో శాంతి భద్రతల అంశంలో భవిష్యత్‌లో భారత్ పాత్ర  కీలకంగా ఉండగలదని అగ్రరాజ్యం ఆకాంక్షించింది. భారత్-అమెరికాల వ్యూహాత్మక భాగస్వామ్యం మిగతా ప్రపంచానికి నమూనాగా ఉండగలదని అమెరికా-భారత దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల పురోగతికి ప్రధాని పర్యటన దోహదపడింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ పరిణామాల విషయంలో ఇరు దేశాల మధ్య పొడచూపిన అభిప్రాయభేదాల తొలగింపు, పెట్టుబడుల కల్పనకు ప్రతికూలతలు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిలో సహకారం, రక్షణ ఉత్పత్తులు, ఇండో పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్యా నికి మోదీ పర్యటన కొంతమేర అనువైన వాతావరణాన్ని కల్పించింది. కానీ పరస్పర సంబంధాల మెరుగుకు ఇరువురి మధ్య స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ ఆ దిశగా సరైన ప్రయత్నం జరగలేదనేది కూడా స్పష్టమవుతోంది. ఇద్దరు నాయకులు అభిలషించారు.
 
 పలు సమావేశాల్లో మోదీ
 అమెరికా కాంగ్రెస్ నాయకులు, అమెరికా-భారత బిజినెస్ కౌన్సిల్ సభ్యులతో మోదీ సమావేశమయ్యారు. అమెరికా కాంగ్రెస్ సమావేశంలో పర్యావరణ సంబంధిత అంశాలతో పాటు భద్రతలో సహకారం పెంపు గురించి ప్రస్తావించారు. తీవ్రవాదంపై పోరుకు ప్రపంచ వ్యాప్తంగా మానవ సమాజం కలిసి రావాలని పిలుపునిచ్చారు. అవినీతిపై తన యుద్ధం కొనసాగుతుందని ప్రకటించారు. భారత్‌లో వేగవంతంగా చోటుచేసుకుంటున్న మార్పుల ప్రయోజనాలను అమెరికా వ్యాపారవేత్తలు అందిపుచ్చుకోవాలని కోరారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే శక్తి ఒక్క ప్రభుత్వం వల్ల మాత్రమే కాదని, అందరి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందన్నారు. దేశంలో పన్నుల వ్యవస్థ సులభతరంగా ఉండాలని అభిలషించారు. ప్రయోజనం లేని పన్నుల వ్యవస్థను తొలగించడానికి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికవృద్ధి సాధనకు భారత్ శత విధాలుగా ప్రయత్నిస్తుందన్నారు. ఎలాంటి ప్రతికూలతలు లేకున్నా ఆర్థిక కోణంలో భారత్ వెనుకబాటు విచారకరమన్నారు. భారత్ పెట్టుబడిదారులకు స్వర్గధామమని ఔత్సాహికులను ఆహ్వానించారు.
 
 కౌన్సిల్ ఆఫ్ ఫారెన్ రిలేషన్స్‌లో మోదీ
 న్యూయార్క్‌లోని కౌన్సిల్ ఆఫ్ ఫారెన్ రిలేషన్స్‌లో మోదీ ప్రసంగం అందరినీ ఆకట్టుకొంది. యావద్భారతావని ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పును మోదీ ప్రస్తావించారు. భారత్‌లో యువత వైఖరి కారణంగా రాజకీయ వాతావరణంలో మార్పులు సంభవించాయి. రాజకీయాలలో స్థిరత్వం ప్రధాన పాత్ర పోషిస్తుందని వివరించారు. గుడ్ గవర్నెన్స్ అంటే కనిష్ట ప్రభుత్వం-గరిష్ఠ పాలన అని అభి వర్ణించారు. ఇటీవల కాలంలో పేదరికం నుంచి బయటపడిన ప్రజలతో నియో-మిడిల్ క్లాస్ ఆవిర్భవించింది. వీరి అభ్యున్నతికి కృషి చేయాల్సి ఉందన్నారు. వ్యవసాయం, తయారీ, సేవా రంగాల్లో అధిక వృద్ధితోపాటు అన్ని రంగాల మధ్య సమతుల్యత సాధించాల్సి ఉందన్నారు.
 
 2020 నాటికి ప్రపంచంలో శ్రామికశక్తికి అధిక డిమాం డ్ ఉంటుంది. భారత్ ఆ లోటును తీర్చగలదు. శ్రామిక శక్తిలో నైపుణ్యాల పెంపునకు భారత్ ప్రాధాన్యమిస్తోంది. శ్రామికశక్తిని మరింత పటిష్టపరిచే క్రమంలో రాష్ట్రాలకు కేంద్రం సహకరిస్తుంది. 21వ శతాబ్దం ఆసియాదే అని విశ్వసించారు. ఆహార భద్రత, వాణిజ్య సదుపాయం మధ్య దగ్గర సంబంధముంది. దేశంలోని గ్రామాలన్నింటికి నిరంతర విద్యుత్ అందించడమే భారత్ లక్ష్యం. దేశంలో తీవ్రవాదం అంతర్గతంగా రూపొందిందే తప్ప ఎగుమతి ద్వారా వచ్చింది కాదు. చైనా-భారత్‌ల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ చర్చల ద్వారా పరిష్కారమయ్యే వీలుంది. ఆఫ్గనిస్థాన్ స్థిరమైన, ప్రశాంతతో కూడిన ప్రగతిని సాధించాలని కోరుకుంటున్నట్లు మోదీ ప్రకటించారు.
 
 అసంపూర్తి అజెండా
 భద్రత, ఆర్థిక సంబంధాలు మెరుగుపరచుకోవడానికి భారత్-అమెరికాలు ప్రయత్నిస్తున్నాయని మోదీ అమెరికా పర్యటన లో రుజువైంది. రెండు దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందించేందుకు ఆయా దేశాలు ఏ విధంగా వ్యవహ రించాలనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, ఆ దిశగా పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదన్నది స్పష్టమవుతోంది. తీవ్రవాదంపై పోరాటం, సైబర్ సెక్యూరిటీ, విద్య, రక్షణ, శక్తి, ఫైనాన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, వాణిజ్యం, పర్యాటకం, పెట్టుబడులు, శిక్షణా నైపుణ్యాల పెంపు లాంటి అంశాలలో చర్చలకు సంబంధించి నాయ కత్వం నుంచి సరైన మార్గదర్శనం లేదు. దీంతో పాటు నిర్ణీత సమయం వెచ్చించలేదు.ప్రజాస్వామ్య దేశమైన భారత్... ఆసియా ఖండంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నిర్మాణాత్మక శక్తిగా ఆవిర్భ విస్తోంది. భారత్‌కు అమెరికా సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులు అవసరం. అమెరికాకు భారత మార్కెట్‌లు, సేవలందించే సుశిక్షితులు కావాలి. ఇరు దేశాల మధ్య ప్రగతికి సంబంధించి ఏర్పడుతోన్న అగాధాలను నిరోధించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కానీ మోదీ-ఒబామా ద్వైపాక్షిక చర్చల్లో అలాంటిదెక్కడా ప్రస్తావనకు రాలేదు.
 
 2005 కార్యాచరణ ఒప్పందం
 భారత్ -అమెరికా రక్షణ సంబంధాల విషయంలో 2005లో కార్యాచరణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ, గత పదేళ్ల కాలంలో సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, తోడ్పాటు, సహకారం, కో-ప్రొడక్షన్, పరిశోధన, అభివృద్ధి లాంటి అంశాలలో పురోగతి చాలా స్వల్పం. వాతావరణ మార్పులు, ప్రపంచ వాణిజ్య సంస్థ అంశాలతో పాటు రెండు దేశాలకు సంబంధించిన ముఖ్యాంశాలను మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. అధిక జనాభా కలిగిన భారత్‌లో ఆహార భద్రత, గ్రామీణ ఉపాధి అవకాశాల పెంపు ద్వారా గ్రామీణ ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచాలి. వ్యవసాయ రాయితీల ఆవశ్యకతను కూడా మోడీ ప్రస్తావించారు. అమెరికా మార్కెట్‌లో భారత సర్వీసు కంపెనీల ప్రవేశానికి ఎలాంటి అవరోధాల్లేకుండా సరళీకృత విధానాల కొనసాగింపు అవసరాన్ని మోదీ అమెరికాకు తెలియజేశారు. భారత మేధో సంపత్తి హక్కు (ఐపీఆర్)లకు భారత్‌కు అత్యంత యాంత్రిక సామర్థ్యం అవసరం. ఫార్మాస్యూటికల్ సంస్థల పరిశోధన, అభివృద్ధికి అధిక నిధులు కేటా యించడం ద్వారా కొత్తమందులను కనిపెట్టాల్సిన అవసరాన్ని మోదీ గుర్తు చేశారు.
 
 మాటల వరకేనా?
 ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం దక్కాలంటే అగ్రరాజ్యం అండదండలు కావాలి. భద్రతా మండలిలో అమెరికాదే ఆధిపత్యం. దీంతోపాటు న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపు, ది మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్, వసెనార్ అరేంజ్‌మెంట్, ఆస్ట్రేలియా గ్రూపులో భారత్‌కు దశలవారీ ప్రవేశం కల్పించడంలోనూ అమెరికా మద్దతు భారత్‌కు అవసరం. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడడానికి వీటిలో సభ్యత్వం ఎంతగానో దోహదపడుతుంది. అయితే అగ్రరాజ్యం ఇచ్చిన మాటను ఎంతవరకు నిలబెట్టుకుంటుందన్నదే సందేహం. ఇందుకు 2010 నవంబర్‌లో ఒబామా భారత్ పర్యటించారు.ఆ సందర్భంలో ప్రాంతీయంగా, ప్రపంచ వ్యాప్తంగా శక్తిమంతమైన దేశంగా భారత్ ఎదగాలని ప్రస్తావించారు. కానీ ఆ స్థాయిలో మద్దతు మాత్రం భారత్‌కు లభించలేదు. వాణిజ్య సదుపాయ ఒప్పందంలో భారత్ అభిప్రాయానికి వ్యతిరేకంగా అమెరికా చర్యలు చేపడితే మళ్లీ పాత కథే పునరావృతమవుతోంది. గత పదేళ్లలో రక్షణ కార్యాచరణ ఒప్పందం (సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్)లో భాగంగా సుమారు రూ. 60 వేల కోట్ల విలువైన రక్షణ ఆయుధాలను భారత్ దిగుమతి చేసుకొంది. కానీ ఈ ఆయుధాల విషయంలో ఉమ్మడి అభివృద్ధి జరగలేదు. దీంతో సాంకేతిక పరిజ్ఞానం బదిలీ సాధ్యం కాలేదు. అపనమ్మకాలను పక్కనబెట్టి ఒకరికొకరు సహకారాన్ని అందిపుచ్చుకుంటే సాంకేతిక భాగస్వామ్యం, పెట్టుబడులు పెరుగుతాయి. ఫలితంగా ఇరు దేశాల్లో అధిక వృద్ధి నమోదవుతుంది.
 
 మొదటి ద్వైపాక్షిక సమావేశం
ముఖ్యాంశాలు: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మధ్య మొదటి ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఇందులోని ముఖ్యాంశాలు..వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలలో సహకరించుకోవాల్సిన ఆవశ్యకతను ఇరు దేశాల నేతలు గుర్తించారు. వాణిజ్యం, అణు ఒప్పందం, వాతావరణంలో మార్పులు, తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం, ప్రాంతీయ భద్రత పెంపు, మధ్య తూర్పు (మిడిల్ ఈస్ట్) ప్రాంతంలో హింసను అరికట్టడం లాంటి అంశాలలో ఒకే ధోరణి అవలంబించేందుకు అంగీకరించారు. రెండు దేశాల మధ్య దృఢమైన మైత్రీ బంధాన్ని వారు ఆకాంక్షించారు.
 
 పౌర అణు ఒప్పందం (సివిల్ న్యూక్లియర్ డీల్) అంశం పరిష్కారంతో పాటు రక్షణలో సహకారాన్ని పెంచడానికి కార్యాచరణ ఒప్పందాన్ని (ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్) మరో పదేళ్లు పొడిగించడానికి రెండు దేశాలు సమ్మతించాయి.  ఆఫ్గనిస్థాన్‌కు బాసటగా నిలవడంతో పాటు తీవ్ర వాదానికి వ్యతిరేకంగా పోరాడే విషయంలో సహకరించుకోవాలని సమ్మతించారు. భారత రక్షణ పరికరాల తయారీ రంగంలో అమెరికన్ కంపెనీలు పాల్గొనాలని మోదీ కోరారు. దక్షిణ, పశ్చిమాసియా ప్రాంతాల్లో పెచ్చరిల్లుతోన్న తీవ్రవాద చర్యలపై ఇరు దేశాల నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తీవ్రవాదంపై పోరాటం, ఇంటెలిజెన్స్ మార్పిడిలో పరస్పర సహకారం ఆవశ్యకతను గుర్తించారు.  శాంతి భద్రతల విషయంలో దక్షిణ, పశ్చిమ ఆసియా ప్రాంతాల్లో భారత్ శక్తిమంతమైన దేశంగా కీలక పాత్ర పోషించడాన్ని ఒబామా శ్లాఘించారు. ప్రపంచ వాణిజ్య సంస్థ అంశాలకు సంబంధించి చ ర్చలు జరిగాయి. వాణిజ్య సదుపాయ ఒప్పందంలో వీలైనంత త్వరగా అవరోధాలు తొలగిపోవాలని ఒబామా ఆశాభావం వ్యక్తం చేశారు.
 
 ఎక్స్‌ప్లోరేషన్ ఆఫ్ స్పేస్, ఎబోలా వైరస్ విసురుతున్న సవాళ్లను అధిగమించడం, వాణిజ్యం, ఆర్థిక సహకారాల్లోనూ చర్చలు జరిగాయి. రక్షణ కార్యాచరణ ఒప్పందం (డిఫెన్స్ ఫ్రేమ్ వర్క్) మరో పదేళ్ల పొడిగింపులో భాగంగా రక్షణ పరికరాల అభివృద్ధి, సంయుక్త ఉత్పత్తి (జాయింట్ ప్రొడక్షన్)లో సహకరించుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.  అమెరికా సుమారు రూ. 20వేల కోట్ల విలువైన రక్షణ ఒప్పందాన్ని భారత్‌తో చేసుకోవాలని ఆసక్తి కనబరుస్తోంది. ఇందులో భాగంగా అమెరికా భారత్‌కు అపాచీ అటాక్ చాపర్‌‌స, చినూక్ హియర్ బై లిఫ్ట్ హెలికాప్టర్లని విక్రయిస్తుంది. ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, విద్య, యువకులలో శిక్షణ నైపుణ్యాల పెంపు అంశాలలో ఇరు నేతలు సారూప్య ధోరణితో ఉన్నట్లు సమావేశ అనంతరం ఒబామా ప్రకటించారు. అటు మోదీ కూడా ఇరు దేశాల మధ్య పటిష్టమైన భాగస్వామ్య పునాదులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా మారిటైమ్ సెక్యూరిటీ విషయంలో సహకరించుకోగలమని ఉమ్మడిగా ప్రకటించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement