
ఇంటి రుణం మార్చుకోవచ్చు..
ఆర్‌బీఐ పాలసీ రేట్లు పెరిగినప్పుడల్లా వేగంగా గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెంచేసే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు.. పాలసీ రేట్లు తగ్గినప్పుడు మాత్రం అంతే వేగంగా వడ్డీరేట్లు తగ్గించవు. దీంతో ముందు తక్కువ వడ్డీకే రుణం తీసుకున్నప్పటికీ.. క్రమక్రమంగా ఈఎంఐలు కొండంతయి కూర్చుంటాయి. ఓవైపు భారీ ఈఎంఐలు కట్టలేక సతమతమవుతుంటే.. మరోవైపు మన పక్క బ్యాంకు చౌక రేటుకే రుణాలు అంటూ ఊదరగొట్టేస్తుంటుంది.
అలాగని, రుణాన్ని దానికి మార్చుకుందామా అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది తెలియక చిరాకు పెరిగిపోతుంటుంది. పోనీ తెలిసినా రోజూ బ్యాంకు చుట్టూ తిరిగేంత సమయం, ఓపిక లేక.. కష్టమయినా భారీ ఈఎంఐల భారాన్ని మోసుకుంటూ తిరగాల్సి వస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే .. లోన్ బదలాయించుకోవడానికి కావల్సిన సర్వీసులు అందించేందుకు స్పెషలిస్టు సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. స్విచ్‌మిడాట్‌ఇన్, మైలోన్‌కేర్‌డాట్‌ఇన్, డెస్టిమనీ అడ్వైజరీ సర్వీసెస్ లాంటివి ఆ కోవకి చెందినవే.
సాధారణంగా ఇలా రుణాన్ని మరో బ్యాంకుకు బదలాయించుకునే ప్రక్రియకి కొన్ని సార్లు చాలా సమయం పట్టేయొచ్చు. మరో దానికి మారుతున్నామంటే...మన డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వడానికి కొన్ని సార్లు రుణాలిచ్చిన సంస్థలు జాప్యం చేయొచ్చు. ఒకోసారి లేని,పోని కొంగొత్త చార్జీలు కట్టాలంటూ కండీషన్లూ పెట్టొచ్చు. ఈ తలనొప్పులన్నీ ఎందుకులే అనుకుని అనేక ప్రయోజనాలున్నప్పటికీ మొత్తానికి బదలాయింపు ఆలోచననే మనం పక్కన పడేసే అవకాశం ఉంది.
ఇలాంటప్పుడు స్పెషలిస్టు సర్వీస్ సంస్థలు అక్కరకొస్తాయి. పాత లోన్‌ను బదలాయించి కొత్త లోన్ మంజూరు అయ్యే దాకా మొత్తం ప్రక్రియను ఈ కంపెనీలు చూసుకుంటాయి. దరఖాస్తు ఫారంలను నింపడం, డాక్యుమెంటేషన్, బ్యాంకు వారితో మాట్లాడించడం, లోన్ మంజూ రయ్యే దాకా చూస్తాయి. ఎక్కడ ఎవర్ని కలిస్తే పని అవుతుందన్నది ఈ స్పెషలిస్టు సంస్థలకి తెలుస్తుంది.
బ్యాంకుల చుట్టూ తిరిగే పని అవి చూసుకుంటాయి కాబట్టి మనకు సమయం ఆదా అవుతుంది. అయితే, ఈ తరహా ప్రొఫెషనల్ సంస్థలు తమ సర్వీసులకు కొంత ఫీజులు వసూలు చేస్తుంటాయి. అవి ఎంత ఉంటాయో తెలుసుకోవాలి. అలాగే, బదలాయించేటప్పుడు వడ్డీ రేట్ల ప్రయోజనం ఎంత, ఇంకా ఎంత కాలం కట్టాలి, కొత్త బ్యాంకు సర్వీసు ప్రమాణాలు ఎలా ఉన్నాయి లాంటివి చూసుకోవాలి. చెప్పుకోతగ్గ స్థాయిలో భారం తగ్గుతుందనుకుంటేనే మారాలి.