ఈ నెలలో 65.30 లక్షల మందికి రూ.1,939.35 కోట్లు
అందులో 47.74 లక్షల మందికి డీబీటీ రూపంలో బ్యాంకు ఖాతాల్లో జమ
మిగిలిన 17.56 లక్షల మందికి ఇంటివద్ద పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శనివారం పలుచోట్ల పింఛను డబ్బులు తీసుకునేందుకు వచ్చిన అవ్వాతాతలతో బ్యాంకులు కిక్కిరిసిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 65,30,838 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, వివిధ రకాల చేతివృత్తిదారులతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ నెలలో పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.1,939.35 కోట్లు విడుదల విషయం చేసిన విషయం తెలిసిందే. మొత్తంలో లబ్ధిదారుల్లో 47,74,733 మందికి ప్రభుత్వం డీబీటీ రూపంలో శనివారం ఉదయమే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేసింది. డబ్బు బ్యాంకుల్లో జమ అయినట్లు శనివారం సాయంత్రానికి 44,54,243 (93.29 శాతం) లక్షల మంది మొబైల్ నంబర్లకు సమాచారం కూడా చేరినట్టు అధికారులు తెలిపారు.
శనివారమే 14.33 లక్షల మందికి ఇంటివద్దే అందిన పింఛను
డీబీటీ రూపంలో బ్యాంకులో జమచేసినవారు పోను మిగిలిన 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధితో మంచానికే పరిమితమై ఉండే 17,56,105 మంది లబ్ధిదారులకు ఒకటోతేదీ నుంచి ఐదోతేదీ మధ్య గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా వారి ఇంటివద్దే పింఛను డబ్బులు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. వీరిలో 14,33,709 మందికి శనివారమే వారి ఇళ్లవద్ద పింఛను డబ్బు పంపిణీ చేశారు. ఇంటివద్ద పింఛన్ల పంపిణీ 81.64 శాతం పూర్తయిందని, మిగిలిన వారికోసం మరో నాలుగు రోజులు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment